సాక్షి, హైదరాబాద్: తెలుగు దినపత్రికలు చదువుతున్న సగటు పాఠకుల సంఖ్య భారీగా తగ్గిపోతున్న తరుణంలో సాక్షి దినపత్రిక అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. 2019–20 నాలుగో త్రైమాసికానికి సంబంధించి మరింత మంది పాఠక దేవుళ్ల ఆదరణ చూరగొంది. 2019–20 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం గణాంకాలతో పోలిస్తే నాలుగో త్రైమాసికంలో సాక్షి తన ఆధిక్యతను ప్రదర్శించింది. ఇండియన్ రీడర్‌షిప్ సర్వే (ఐఆర్‌ఎస్) నాలుగో త్రైమాసికం గణాంకాలు విడుదల చేయడంతో ఈ విషయం స్పష్టమైంది.
(చదవండి: మీ విశ్వాసాన్ని ‘సాక్షి’ కాపాడుకుంటుంది)
2019–20 మొదటి త్రైమాసికంతో పోలిస్తే సాక్షి దినపత్రిక నాలుగో త్రైమాసికంలో 30.79 లక్షల మంది సగటు పాఠకులతో (ఏవరేజ్ ఇష్యూ రీడర్‌షిప్) మూడు శాతం వృద్ధిని నమోదు చేసింది. తెలుగు దినపత్రికల సగటు పాఠకుల సంఖ్య 25 శాతం వరకు తగ్గితే సాక్షి మాత్రం 3 శాతం పెంచుకోవడం విశేషం. ఇదే కాలంలో ఈనాడు 20.15 లక్షల మంది పాఠకులను (30 శాతం) కోల్పోయింది. ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే సగటు పాఠకులు కోల్పోయిన సంఖ్య 33% ఉండగా నమస్తే తెలంగాణ దాదాపు సగం మంది పాఠకులను (49%) కోల్పోయింది.
ఏపీలో భారీ వృద్ధి నమోదు..
ఆంధ్రప్రదేశ్‌లో సాక్షి దినపత్రిక సగటు పాఠకుల సంఖ్యను భారీగా పెంచుకుంది. 2019–20 మొదటి మూడు నెలల కాలం (ఏప్రిల్–జూన్)తో పోలిస్తే చివరి మూడు నెలల కాలం (జనవరి–మార్చి 2020)లో ఈనాడు, సాక్షి పత్రికల మధ్య అంతరం 2.53 లక్షలకు పడిపోయింది. ఆ తేడా మొదటి త్రైమాసికంలో 17.86 లక్షలుగా ఉండేది. ఏపీ క్లస్టర్–1లో (శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాలు) సాక్షి దినపత్రిక 13 శాతం సగటు పాఠకుల సంఖ్యను పెంచుకోగా ఈనాడు 46 శాతం మేర పాఠకులను కోల్పోయింది. అదే సమయంలో రాయలసీమ క్టస్టర్‌లో (చిత్తూరు, అనంతపురం, వైఎస్సార్ కడప, కర్నూలు జిల్లాలు) సాక్షి అత్యధికంగా 59 శాతం పాఠకుల ఆదరణ సంపాదించుకోగా ఈనాడు 33 శాతం మంది పాఠకులను కోల్పోయింది.
హైదరాబాద్ పరిధిలో సాక్షి 27 శాతం వృద్ధి..
హైదరాబాద్ నగర పరిధి (ఆర్బన్ అగ్లామరేషన్)లోనూ సాక్షి దినపత్రిక 27 శాతం వృద్ధిని నమోదు చేసింది. 2019–20 మొదటి క్వార్టర్‌తో పోలిస్తే నాలుగో క్వార్టర్‌లో సాక్షి మినహా మిగిలిన ప్రధాన పత్రికల సగటు పాఠకుల సంఖ్య బాగా తగ్గిపోయింది. క్వార్టర్–1తో పోలిస్తే క్వార్టర్–4లో ఈనాడు 24 శాతం, నమస్తే తెలంగాణ 64 శాతం, ఆంధ్రజ్యోతి 28 శాతం క్షీణత నమోదు చేసినట్లు ఇండియన్ రీడర్‌షిప్ సర్వే వెల్లడించింది.
లాక్‌డౌన్ సమయంలోనూ...
కరోనా లాక్‌డౌన్ సమయంలోనూ సాక్షి భద్రతా ఏర్పాట్లను పక్కాగా పాటించి వాటిని పాఠకులకు ప్రదర్శించి వారిలో విశ్వాసాన్ని పాదుకొల్పింది. దీంతో మూడో దశ లాక్‌డౌన్ వచ్చేసరికి సాక్షి లాక్‌డౌన్‌కు ముందు ఉన్న ప్రింట్ ఆర్డర్‌ను (ముద్రించే కాపీలు) నిలబెట్టుకుంది. అన్ని విషయాల్లోనూ ముందంజలో ఉన్న సాక్షి దినపత్రిక అగ్రస్థానానికి చేరుకోవడానికి ఇదో మంచి అవకాశంగా భావిస్తోంది.
(వీడియో: వార్తా పత్రికలు శుభ్రమైనవి..)
Comments
Please login to add a commentAdd a comment