సర్వే గణాంకాల వాడకాన్ని మార్చి 31 వరకు నిలిపేయాలని ఎంఆర్‌యూసీ, ఆర్‌ఎస్‌సీఐ నిర్ణయం
త్వరలో సర్వే గణాంకాల పునర్ మూల్యాంకనం..
సాక్షి, హైదరాబాద్: దేశంలో వివిధ పత్రికల పాఠకుల సంఖ్యపై ఇండియన్ రీడర్‌షిప్ సర్వే(ఐఆర్‌ఎస్)-2013 తప్పుడు గణాంకాలు వెలువరించిన నేపథ్యంలో.. సర్వే వివరాల వాడకాన్ని తాత్కాలికంగా నిలుపుదల చేశారు. సర్వే నిర్వహణ సంస్థ ‘మీడియా రీసెర్చ్ యూజర్స్ కౌన్సిల్’(ఎంఆర్‌యూసీ) ఈ విషయాన్ని ఓ ప్రకటనలో తెలిపింది.
పత్రికల పాఠకుల సంఖ్యపై ఐఆర్‌ఎస్-2013లో భారీగా తప్పులు దొర్లడంతో దేశంలోని ప్రముఖ మీడియా సంస్థలు ఖండించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్‌ఎస్‌సీఐ మేనేజింగ్ కమిటీ, ఎంఆర్‌యూసీ బోర్డు ముంబైలో సమావేశమై దీనిపై చర్చించాయి. సర్వే గణాంకాలను పునర్ మూల్యాంకనం చేయాలని సమావేశం నిర్ణయించింది. పునర్ మూల్యాంకనం పూర్తయ్యే వరకు సర్వే గణాంకాల వాడకాన్ని మార్చి 31 వరకు నిలుపుదల చేయాలని నిర్ణయం తీసుకుంది.
ఐఆర్‌ఎస్ సర్వే గణాంకాలను పునర్ మూల్యాంకనం చేయడానికి ఒక ప్రక్రియ రూపొందిస్తున్నామని, ఇది ఈ నెల 24కల్లా ఖరారవుతుందని సమావేశం పేర్కొంది. మార్చి 31కల్లా పునర్ మూల్యాంకనం పూర్తవుతుందని, ఈ ప్రక్రియలో గుర్తించిన అంశాలను, తమ సిఫార్సులను ఏప్రిల్ తొలి రోజుల్లో ఆర్‌ఎస్‌సీఐకు సమర్పించనున్నట్లు ఎంఆర్‌యూసీ పేర్కొంది. ఆమోదం పొందిన సిఫార్సులను ఐఆర్‌ఎస్ భవిష్యత్ ప్రణాళికలో చేరుస్తారని ఓ ప్రకటనలో తెలిపింది. పునర్ మూల్యాంకనం పూర్తయ్యే వరకు సర్వే గణాంకాల వాడకాన్ని నిలిపేయాల్సిందిగా ఆర్‌ఎస్‌సీఐ, ఎంఆర్‌యూసీ, ఏబీసీలు చందాదారులు, సభ్యులకు సూచించాలని సమావేశంలో నిర్ణయించినట్లు వెల్లడించింది.
ఐఆర్‌ఎస్ సర్వే నిలుపుదల
Published Fri, Feb 21 2014 4:26 AM | Last Updated on Tue, Oct 9 2018 6:36 PM
Advertisement
Advertisement