మేఘనకు మూడు పతకాలు
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరం తొలిసారి ఆతిథ్యమిచ్చిన ఇండియన్ రిథమిక్ జిమ్నాస్టిక్స్ కప్లో తెలుగు అమ్మాయి, భారత జిమ్నాస్ట్ గుండ్లపల్లి మేఘన ఆకట్టుకుంది. ఆమె సీనియర్ విభాగంలో మూడు పతకాలను గెలుచుకుంది. అంతర్జాతీయ స్థాయిలో జరిగిన ఈ టోర్నీలో సీనియర్స్ విభాగంలో టీమిండియా నాలుగు పతకాలను గెలుచుకుంది. ఇందులో మూడు మేఘన ఖాతాలోకి వెళ్లగా, అదితి ఒక పతకాన్ని సాధించింది. సీనియర్స్ కేటగిరీలో మేఘన ఓవరాల్గా మూడోస్థానంలో నిలిచింది. మొత్తం ఆరు (స్లొవేనియా, ఇటలీ, శ్రీలంక, మలేసియా, భారత్, థాయ్లాండ్) దేశాలకు చెందిన 70 మంది క్రీడాకారులు ఈ టోర్నీలో తలపడ్డారు.
సీనియర్స్ విభాగంలో శ్రీలంక ఆధిపత్యం ప్రదర్శించగా, జూనియర్స్ కేటగిరీలో పతకాలన్నీ స్లోవేనియా ఖాతాలోకి చేరాయి. రెండు రోజుల పాటు జరిగిన ఈ పోటీలు ఆదివారం ముగిశాయి. పోటీల అనంతరం ఈ టోర్నీకి న్యాయనిర్ణేతగా వ్యవహరించిన స్పెలా డ్రాగస్ 45 నిమిషాల పాటు జిమ్నాస్ట్లను ఉద్దేశించి ప్రసంగించింది. ఇందులో జిమ్నాస్ట్ల ప్రదర్శన, కోచింగ్ మెళకువలతో పాటు పోటీల్లో పాయింట్లు సంపాదించడానికి జిమ్నాస్ట్లు ఏయే అంశాలను మెరుగుపరుచుకోవాలో విపులంగా వివరించింది. పాయింట్లు కేటాయించడంలో న్యాయ నిర్ణేతలు ఏయే అంశాలను పరిగణనలోకి తీసుకుంటారో తెలిపింది.