మరో సంచలనంపై దృష్టి
* నేడు బెల్జియంతో భారత్ సెమీస్ మ్యాచ్
* హాకీ వరల్డ్ లీగ్ ఫైనల్స్ టోర్నీ
రాయ్‌పూర్: అమోఘమైన ఆటతీరుతో గ్రేట్ బ్రిటన్‌పై సంచలన విజయం సాధించిన భారత హాకీ జట్టు మరో కఠిన పరీక్షకు సిద్ధమైంది. హాకీ వరల్డ్ లీగ్ ఫైనల్స్ టోర్నీలో శనివారం జరిగే సెమీఫైనల్లో పటిష్టమైన బెల్జియంతో అమీతుమీ తేల్చుకోనుంది. లీగ్ దశలో పూర్తిగా నిరాశపర్చిన సర్దార్‌సేన ప్రస్తుతం నిలకడలేమితో ఇబ్బంది పడుతోంది. ఈ విషయాన్ని కోచ్ ఓల్ట్మన్ కూడా అంగీకరిస్తున్నారు.
అయితే బ్రిటన్‌పై భారత డిఫెన్స్ సమర్థంగా పని చేసింది. ఈ మ్యాచ్‌లో కూడా ఇది కొనసాగితే మరో సంచలనాన్ని ఊహించొచ్చు. లీగ్ దశ నుంచి అద్భుతంగా ఆడుతున్న బెల్జియంను ఓడించడం అనుకున్నంత సులువు కాదు. అన్ని రంగాల్లోనూ ఈ జట్టు పటిష్టంగా కనిపిస్తోంది. ఈ ఏడాది ఆరంభంలో హెచ్‌డబ్ల్యూఎల్ సెమీస్‌లో భారత్‌పై గెలవడం వాళ్లకు ఆత్మవిశ్వాసాన్ని పెంచే అంశం. ఊహించని రీతిలో గోల్స్ కొట్టడంలో బెల్జియన్లు సిద్ధహస్తులు. కాబట్టి వాళ్లను నిలువరించాలంటే భారత్ శక్తికి మించి పోరాడాల్సిందే.
నెదర్లాండ్స్‌కు షాక్: హాకీ వరల్డ్ లీగ్ (హెచ్‌డబ్ల్యూఎల్) ఫైనల్స్ టోర్నమెంట్లో డిఫెండింగ్ చాంపియన్ నెదర్లాండ్స్ జట్టుకు ఓటమి ఎదురైంది. శుక్రవారం జరిగిన తొలి సెమీఫైనల్లో ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియా 3-2 గోల్స్ తేడాతో నెదర్లాండ్స్‌ను ఓడించి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. ఆస్ట్రేలియా తరఫున వొతెర్స్పూన్ (8వ ని.లో), బీల్ (22వ ని.లో), గోడ్స్ (42వ ని.లో) ఒక్కో గోల్ చేయగా... నెదర్లాండ్స్‌కు జోంకర్ (29వ ని.లో), ప్రుసెర్ (33వ ని.లో) ఒక్కో గోల్ అందించారు. భారత్, బెల్జియంల మధ్య సెమీఫైనల్ విజేతతో ఆదివారం జరిగే ఫైనల్లో ఆస్ట్రేలియా తలపడుతుంది.