జోరుగా ఐఫోన్ల ఎగుమతులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెక్నాలజీ దిగ్గజం ఆపిల్ భారత్ నుంచి ఐఫోన్ల ఎగుమతులను గణనీయంగా పెంచింది. 2024 ఏప్రిల్–సెప్టెంబర్ కాలంలో సుమారు రూ.50,400 కోట్ల విలువైన ఎగుమతులను సాధించింది. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే విలువ పరంగా 33 శాతం పెరుగుదలను నమోదు చేయడం విశేషం. చైనాపై ఆధారపడటాన్ని తగ్గించుకుంటూ భారత్‌లో తయారీ సామర్థ్యాలను పెంపొందించడానికి యాపిల్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.ఈ జోరు చూస్తే భారత్ నుంచి విదేశాలకు సరఫరా అయ్యే ఐఫోన్ల విలువ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.1 లక్ష కోట్లు దాటడం ఖాయంగా కనిపిస్తోందని మార్కెట్ వర్గాల అంచనా. 2023–24లో కంపెనీ సుమారు రూ.84,000 కోట్ల విలువైన ఎగుమతులను నమోదు చేసింది. ప్రభుత్వ రాయితీలు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు, దేశంలో సాంకేతిక పురోగతి.. వెరశి కంపెనీ భారత్‌లో తన తయారీ నెట్‌వర్క్‌ను వేగంగా విస్తరిస్తోంది. ముఖ్యంగా బీజింగ్–వాíÙంగ్టన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య చైనాలో తయారీకి సంబంధించిన నష్టాలను తగ్గించడానికి యాపిల్ యొక్క వ్యూహంలో భారత్ కీలక కేంద్రంగా మారింది. కీలకంగా యాపిల్.. ప్రధాన మార్కెట్ అయిన యూఎస్‌కు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–ఆగస్ట్‌లో రూ.24,192 కోట్ల విలువైన స్మార్ట్‌ఫోన్స్ సరఫరా అయ్యాయి. యూఎస్‌కు ఎగుమతుల పరంగా టాప్–1 సెగ్మెంట్‌గా మొబైల్స్ నిలవడంతోపాటు భారత స్మార్ట్‌ఫోన్ ఎగుమతి రంగానికి ఐఫోన్లు వెన్నెముకగా మారాయి. అయిదేళ్ల క్రితం ఇక్కడి నుంచి యూఎస్‌కు ఎగుమతి అయిన స్మార్ట్‌ఫోన్స్ విలువ రూ.43.6 కోట్లు మాత్రమే. తాజా ఎగుమతి గణాంకాలు యాపిల్ తయారీ సామర్థ్యాలను ప్రతిబింబిస్తోంది.యాపిల్ కీలక సరఫరాదారులైన తైవాన్‌కు చెందిన ఫాక్స్‌కాన్ టెక్నాలజీ గ్రూప్, పెగాట్రాన్ కార్ప్, భారత్‌కు చెందిన టాటా ఎల్రక్టానిక్స్ దక్షిణ భారతదేశంలో చురుకుగా ఐఫోన్లను అసెంబుల్ చేస్తున్నాయి. చెన్నైకి సమీపంలోని ఫాక్స్‌కాన్ ఫెసిలిటీ అతిపెద్ద సరఫరాదారుగా నిలుస్తోంది. ఇది భారత ఐఫోన్ ఎగుమతుల్లో సగం సమకూరుస్తోంది. టాటా ఎల్రక్టానిక్స్ గతేడాది విస్ట్రన్ కార్పొరేషన్ నుంచి అసెంబ్లీ యూనిట్‌ను కొనుగోలు చేసింది. ఏప్రిల్–సెపె్టంబర్ కాలంలో కర్ణాటక ఫ్యాక్టరీ నుండి సుమారు రూ.14,280 కోట్ల విలువైన ఐఫోన్లను టాటా ఎల్రక్టానిక్స్ ఎగుమతి చేసింది.కొనసాగుతున్న పెట్టుబడులు..యాపిల్ భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో కేవలం 7 శాతం లోపు మాత్రమే వాటా కలిగి ఉంది. షావోమీ, ఒప్పో, వివో వంటి చైనీస్ బ్రాండ్లదే ఇక్కడ హవా నడుస్తోంది. అయినప్పటికీ ఆపిల్ దేశీయంగా గణనీయంగా పెట్టుబడులు చేస్తోంది. బెంగుళూరు, పుణేలో కొత్త స్టోర్లతో సహా రిటైల్ ఉనికిని విస్తరించే ప్రణాళికలతో భారత్‌లో యాపిల్ వృద్ధి పథం ఆశాజనకంగా కనిపిస్తోంది. భారత్‌లో యాపిల్ అమ్మకాలు 2030 నాటికి రూ.2,77,200 కోట్లకు చేరవచ్చని మార్కెట్ వర్గాల అంచనా. మధ్యతరగతి వర్గాల్లో పెరుగుతున్న కొనుగోలు శక్తి, సులభతర వాయిదా చెల్లింపుల స్కీములు ఇందుకు కారణంగా తెలుస్తోంది.కఠిన కోవిడ్–19 లాక్డౌన్లు, ఆరి్ధక సంక్షోభం కారణంగా మాంద్యంతో చైనాలో యాపిల్ కంపెనీ అనేక సవాళ్లను ఎదుర్కొంది. దేశీయంగా తయారీ సామర్థ్యం పెంచుతున్నప్పటికీ సమీప భవిష్యత్తులో యాపిల్ ప్రధాన మార్కెట్‌గా చైనాను అధిగమించే అవకాశం భారత్‌కు లేదు. మార్చి 2024తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో యాపిల్ భారత్‌లో రూ.1,17,600 కోట్ల విలువైన ఐఫోన్లను అసెంబుల్ చేసింది. ఉత్పత్తి సామర్థ్యాలను రెట్టింపు చేసింది.