భారత సైనికులకు ఇటలీ ఘన నివాళి
మిలన్: రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో ఇటలీకి విశేష సేవలందించి ప్రాణత్యాగం చేసిన భారతీయ సైనికులకు ఆ దేశసైన్యం ఘన నివాళులర్పించింది. ఇందులో భాగంగా ఆనాటి యుద్ధంలో వీరమరణం పొందిన సైనికులకు స్మారక స్థూపాలను నిర్మించి ఆవిష్కరించింది ఇటలీ మాంటోన్. ఈ కార్యక్రమానికి ఇటలీ భారత అంబాసిడర్ డా. నీనా మల్హోత్రా తోపాటు రక్షణశాఖ ప్రతినిధులు, ఇటలీ దళాల ప్రతినిధులు అక్కడి ప్రజలు పాల్గొన్నారు.
రెండో ప్రపంచ యుద్ధంలో ఇటలీకి వెన్నుదన్నుగా నిలిచిన భారత సైనికులు ఆనాడు ప్రాణత్యాగానికి కూడా వెనుకాడకుండా తమ విధులను నిర్వర్తించారు. సుమారు 50 వేల మంది ప్రాతినిధ్యం వహించిన 4,8,10వ డివిజన్ బెటాలియన్లతో కలిసి వీరంతా వీరోచితంగా పోరాడారు. ఆనాటి యుద్ధకాండలో 23,722 మంది భారత సైనికులు అసువులుబాశారు. వీరందరినీ ఇటలీ వ్యాప్తంగా కామన్ వెల్త్ యుద్ధ స్మశానవాటికల్లో సమాధి చేశారు.
ఈ సందర్బంగా భారత సైన్యానికి చెందిన వి.సి. నాయక్ యశ్వంత్ గాడ్గేకు సన్ డయల్ స్మారక స్థూపాన్ని నిర్మించి ఇటలీ అత్యున్నత సైనిక పురస్కారం విక్టోరియా క్రాస్ బహూకరించారు. యశ్వంత్ గాడ్గే యుద్ధంలో ఎగువ టైబర్ లోయలో పోరాటం చేస్తూ వీరమరణం చెందారు. కార్యక్రమంలో మొత్తం 20 మందికి విక్టోరియా క్రాస్ పురస్కారాన్ని బహుకరించగా అందులో ఆరుగురు భారతీయ సైనికులే కావడం విశేషం.
ఇది కూడా చదవండి: కిడ్నాపైన బాలిక సమయస్ఫూర్తి.. తెలివిగా సమాచారం అందించి..