భారతీయ దర్జీకి బంపర్ లాటరీ
దుబాయ్: దర్జీగా పనిచేస్తున్న ఓ ప్రవాస భారతీయుడు(33) దుబాయ్ షాపింగ్ మహోత్సవంలో బంపర్ లాటరీ గెలుచుకున్నాడు. మూడు రోజుల క్రితమే జన్మించిన కుమారుడు అతడికి అదృష్టాన్ని మోసుకొచ్చాడు. కేరళకు చెందిన ఫసలుద్దీన్ కుట్టిపాలక్కాల్ దుబాయ్‌లో దర్జీగా పనిచేస్తున్నాడు. దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్ 2014 సందర్భంగా నిర్వహించిన ఇన్ఫినిటీ మెగా లాటరీలో ఆయన లక్ష దిర్హామ్‌లు(రూ.16.9 లక్షలు), రెండు విలాసవంతమైన కార్లు దక్కించుకున్నాడు. లాటరీలో పదేళ్లుగా తన అదష్టాన్ని పరీక్షించుకుంటున్న ఫసలుద్దీన్కు కొడుకు పుట్టిన వెంటనే భారీ మొత్తం దక్కటంతో ఆనందానికి అవధుల్లేవు.
ఏటా స్నేహితులతో కలిసి లాటరీ టిక్కెట్ కొనుగోలు చేసే ఫసలుద్దీన్ ఈసారి మాత్రం ఒంటరిగానే వెళ్లి కొత్తేడాదిలో అదష్టాన్ని మూటగట్టుకున్నాడు. ఈ ఏడాది లాటరీ తననే వరిస్తుందని గట్టిగా విశ్వసించినట్లు చెప్పాడు. ఒక వంతు సొమ్మును స్నేహితుల అవసరాలు, కుటుంబసభ్యుల కోసం వెచ్చించి మిగతా డబ్బుతో కేరళలో ఇల్లు నిర్మించుకుంటానని తెలిపాడు. ఖరీదైన కార్లను ఏం చేయాలో ఫసల్ ఇంకా ఆలోచించలేదు.