జర్మనీలో బెంగళూరు మహిళకు తీవ్ర అవమానం
బెంగళూరు: యూరోపియన్ దేశంలో శ్రుతి బసప్ప అనే భారతీయ మహిళకు అవమానం చోటుచేసుకుంది. బెంగళూరు నుంచి ఐస్లాండ్ వెళుతున్న ఆమెను జర్మనీలోని ఫ్రాంక్ ఫర్డ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో తనిఖీ సిబ్బంది అవమానించారు. తనిఖీల్లో భాగంగా ఆమెను స్కానింగ్ చేసినప్పటికీ దుస్తులు విప్పేయాలంటూ ఆమెకు అడ్డు చెప్పారు. సాధారణ తనిఖీకి బదులు తాము నమ్మలేమని అనుమానం వ్యక్తం చేస్తూ వస్త్రాలు విప్పేయాల్సిందేనని నలుగురిలో అవమాన పరిచారు.
అయితే, ఆమె భర్త ఒక యూరోపియన్ కావడంతో ఆ గండం నుంచి బయటపడింది. దీనిపై శ్రుతి తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ తాను ఒంటరిగా ఉంటే పరిస్థితి ఏమిటని ప్రశ్నించింది. తన భర్త ఒక యూరోపియన్ కాకుంటే ఎలాంటి అవమానం ఎదుర్కోవాల్సి వచ్చేదో అని తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఫేస్బుక్లో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ చర్య ముమ్మాటికి జాతి వివక్షే అని మండిపడింది. ఈ ఘటనపై విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ కూడా స్పందించి అక్కడి విదేశాంగ కార్యాలయ అధికారులు పూర్తి వివరాలు తనకు అందజేయాలని ఆదేశించారు. ఈ ఘటన వివరాలు శ్రుతి తెలియజేసింది.
శ్రుతి తన భర్తతో కలిసి ఫ్రాంక్‌ఫర్డ్ ఎయిర్‌పోర్ట్‌లో అడుగుపెట్టింది. అక్కడి విమానాశ్రయంలో తనిఖీల్లో భాగంగా బాడీ స్కానింగ్‌కు వెళ్లి రిపోర్ట్ తీసుకుంది. అయినా అధికారులు అనుమానం వ్యక్తం చేయడంతో బాడీని తడుముతూ చేసే తనిఖీలకు ఒప్పుకుంది. అయితే, తనకు ఇటీవలె కడుపునకు సంబంధించి శస్త్ర చికిత్స అయిందని, తనిఖీని కాస్తంత నెమ్మదిగా చేయాలని చెప్పింది. కానీ, అందుకు కూడా వాళ్లు నిరాకరించి ఆమెను వస్త్రాలు పూర్తిగా తీసేయాల్సిందేనంటూ ఆదేశించారు. అందుకు ఆమె నిరాకరించింది. అక్కడే ఉన్న యురోపియన్ భర్త జోక్యం చేసుకోవడంతో బయటపడింది.