Indian womens boxing
-
Indian Women Boxers: సప్త స్వర్ణాలు
న్యూఢిల్లీ: ప్రపంచ యూత్ బాక్సింగ్ చాంపియన్‌షిప్ మహిళల విభాగంలో భారత బాక్సర్లు తమ విశ్వరూపం ప్రదర్శించారు. బరిలోకి దిగిన ఏడు వెయిట్ కేటగిరీల్లోనూ భారత బాక్సర్లు విసిరిన పంచ్‌లకు పసిడి పతకాలు వచ్చాయి. పోలాండ్‌లో గురువారం జరిగిన ఫైనల్స్‌లో ఏడుగురు భారత మహిళా బాక్సర్లు గీతిక (48 కేజీలు), బేబీరోజీసనా చాను (51 కేజీలు), పూనమ్ (57 కేజీలు), వింకా (60 కేజీలు), అరుంధతి (69 కేజీలు), థోక్చోమ్ సనమచ చాను (75 కేజీలు), అల్ఫియా పఠాన్ (ప్లస్ 81 కేజీలు) స్వర్ణ పతకాలను సొంతం చేసుకున్నారు. ప్రపంచ యూత్ చాంపియన్‌షిప్‌లో చరిత్రలో భారత్‌కిదే అత్యుత్తమ ప్రదర్శన కావడం విశేషం. 2017 ప్రపంచ యూత్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు అత్యధికంగా ఐదు స్వర్ణ పతకాలు లభించాయి. ఫైనల్స్‌లో గీతిక 5–0తో నటాలియా (పోలాండ్)పై... బేబీరోజీసనా 5–0తో వలేరియా లింకోవా (రష్యా)పై... పూనమ్ 5–0తో స్థెలిన్ గ్రాసీ (ఫ్రాన్స్)పై గెలిచారు. వింకా పంచ్‌ల ధాటికి ఆమె ప్రత్యర్థి జుల్దిజ్ (కజకిస్తాన్) ఎదురు నిలువలేకపోవడంతో రిఫరీ చివరి రౌండ్ పూర్తి కాకుండానే బౌట్‌ను నిలిపి వేశారు. అరుంధతి 5–0తో బార్బరా (పోలాండ్)పై... సనమచ చాను 3–2తో డానా డిడే (కజకిస్తాన్)పై... అల్ఫియా 5–0తో దరియా కొజోరెజ్ (మాల్దొవా)పై విజయం సాధించారు. శుక్రవారం జరిగే పురుషుల విభాగం ఫైనల్లో భారత్ తరఫున సచిన్ సివాచ్ (56 కేజీలు) బరిలో ఉన్నాడు. -
అదిరిన భారత బాక్సర్ల పంచ్
న్యూఢిల్లీ: ఈ ఏడాది అంతర్జాతీయస్థాయిలో భారత బాక్సర్ల నిలకడైన ప్రదర్శన కొనసాగుతోంది. తాజాగా జర్మనీలో జరిగిన బ్లాక్ ఫారెస్ట్ కప్ టోర్నమెంట్లో భారత జూనియర్ మహిళా బాక్సర్లు పతకాల పంట పండించారు. మొత్తం ఏడు పతకాలు గెల్చుకొని టోర్నమెంట్లో ఉత్తమ జట్టు అవార్డును సొంతం చేసుకున్నారు. భారత్ నెగ్గిన ఏడు పతకాల్లో ఐదు స్వర్ణాలు, రెండు రజతాలు ఉన్నాయి. ఉక్రెయిన్, జర్మనీ, కజకిస్తాన్, లాత్వియా, హంగేరి, లిథువేనియా, మంగోలియా, గ్రీస్, పోలాండ్ దేశాలు కూడా పాల్గొన్న ఈ టోర్నీలో భారత్ తరఫున 13 మంది బాక్సర్లు బరిలోకి దిగారు. భారత్ తరఫున తమన్నా (48 కేజీలు), అంజు (50 కేజీలు), నేహా (54 కేజీలు), అంబేషోరి దేవి (57 కేజీలు), ప్రీతి దహియా (60 కేజీలు) స్వర్ణ పతకాలను సాధించారు. ఫైనల్లో ఓడిన తన్ను (52 కేజీలు), ఆశ్రేయ (63 కేజీలు) రజత పతకాలతో సరిపెట్టుకున్నారు. -
వరల్డ్ నంబర్‌వన్ మేరీకోమ్
భారత మహిళా బాక్సింగ్ దిగ్గజం మేరీకోమ్ తన ఘనమైన కెరీర్లో మరో కీర్తికిరీటం చేరింది. ఆరు సార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన ఈ మణిపూర్ మాణిక్యం వరల్డ్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి ఎదిగింది. అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం (ఐబా) విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో ఆమె 48 కేజీ కేటగిరీలో నంబర్‌వన్‌గా నిలిచింది. 36 ఏళ్ల ఈ వెటరన్ బాక్సర్ గత నవంబర్‌లో ఆరోసారి ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిల్ గెలిచింది. దీంతో మేరీ ఆ వెయిట్ కేటగిరీలో 1700 పాయింట్లతో అగ్రస్థానం అధిరోహించింది. -
ప్రొఫెషనల్ బాక్సర్‌గా సరిత
ఢిల్లీ: భారత మహిళల బాక్సింగ్‌లో కొత్త అధ్యాయం మొదలుకానుంది. రెండుసార్లు ఆసియా చాంపియన్‌గా నిలిచిన భారత మహిళా బాక్సర్ సరితా దేవి ప్రొఫెషనల్‌గా మారనుంది. తద్వారా ఈ ఘనత సాధించనున్న తొలి భారతీయ బాక్సర్‌గా గుర్తింపు పొందనుంది. ఈ మేరకు భారత్‌లో ప్రొఫెషనల్ బాక్సింగ్‌కు లైసెన్స్ కలిగిన భారత బాక్సింగ్ కౌన్సిల్ (ఐబీసీ)తో రెండేళ్ల కాలానికి ఆమె ఒప్పందం చేసుకుంది. భారత బాక్సింగ్ సమాఖ్య (బీఎఫ్ఐ) అనుమతిస్తే అమెచ్యూర్ సర్క్యూట్‌లోనూ కొనసాగుతానని 31 ఏళ్ల సరితా దేవి తెలిపింది. ‘దశాబ్దంకంటే ఎక్కువ కాలం నుంచి నేను అమెచ్యూర్ బాక్సర్‌గా ఉన్నాను. ఒలింపిక్స్ మినహా అన్ని అంతర్జాతీయ వేదికలపై పతకాలు సాధించాను. ఏదైనా కొత్తగా చేయాలనిపించింది. అందుకే ప్రొఫెషనల్ బాక్సర్‌గా మారాలని నిర్ణయించుకున్నాను’ అని 60 కేజీల విభాగంలో పోటీపడే సరిత వివరించింది. అంతా అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాది జనవరి 19న సరితా దేవి తొలి ప్రొఫెషనల్ బౌట్ జరిగే అవకాశముంది