Indian womens chess team
-
కోవాగ్జిన్ టీకా తీసుకున్న హంపి.. మేటి పోటీకి దూరం
సాక్షి, హైదరాబాద్: భారత మహిళల చెస్ నంబర్‌వన్, ప్రపంచ మూడో ర్యాంకర్ కోనేరు హంపి స్పెయిన్‌లో ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచ మహిళల టీమ్ చెస్ చాంపియన్‌షిప్ కోసం బాగా సన్నద్ధమైంది. అందుబాటులో ఉన్న ఆన్లైన్ టోర్నీ ల్లో చురుగ్గా పోటీపడింది. అయితే తీరా స్పెయిన్ ఈవెంట్ ఆడదామనుకుంటే ఆమె తీసుకున్న టీకా వల్ల ఆంక్షలు ఎదురయ్యాయి. ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ హంపి భారత్‌లో తయారైన కోవాగ్జిన్ టీకా తీసుకుంది. కానీ దీనికి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) గుర్తింపు లేదు. దీని వల్ల ఆమె స్పెయిన్ వెళ్లాలనుకుంటే మునుపటిలాగే కరోనా ప్రొటోకాల్ పాటించాలి. 10 రోజుల పాటు కఠిన క్వారంటైన్లో గడపాలి. ఈ విషయాలన్నీ హంపికి స్పెయిన్ రాయబార కార్యాలయాన్ని సంప్రదిస్తేనే తెలిశాయి. ‘నార్త్ మెసిడోనియా మీదుగా స్పెయిన్ వెళ్లాలనుకున్నా. కానీ అక్కడా స్పెయిన్ మాదిరిగానే ఆంక్షలు ఉన్నాయి. అక్కడా పది రోజులపాటు క్వారంటైన్లో ఉండాల్సి వచ్చేది. ఆంక్షలు సడలించే అవకాశం ఉందేమోనని భారత చెస్ సమాఖ్య కూడా జోక్యం చేసుకుంది. కానీ వారి ప్రయత్నం కూడా ఫలించలేదు’ అని హంపి వివరించింది. కోవాగ్జిన్‌పై ఉన్న ఆంక్షల వల్ల ఆమె ఓ మేటి ఈవెంట్లో పాల్గొనలేకపోయింది. ఆమె స్థానం భర్తీ చేసేందుకు ఎంపిక చేసిన పద్మిని రౌత్‌కు అదే సమస్య ఎదురైంది. కోవాగ్జిన్‌తో ఆమె కూడా స్పెయిన్ పయనం కాలేకపోయింది. డబ్ల్యూహెచ్ఓ ఆమోదించిన కోవిషీల్డ్‌ను వేయించుకున్న వారికి 122 దేశాలు ఆంక్షలు సడలించాయి. చదవండి: Koneru Humpy: థ్యాంక్యూ సాక్షి.. న్యాయ నిర్ణేతలకు ధన్యవాదాలు -
ఉక్రెయిన్ను నిలువరించిన భారత్
ప్రపంచ టీమ్ చెస్ చాంపియన్‌షిప్ చెంగ్డూ (చైనా) : ప్రపంచ చాంపియన్స్‌తో కూడిన టాప్ సీడ్ ఉక్రెయిన్ జట్టును నిలువరిస్తూ.... భారత మహిళల జట్టు ప్రపంచ టీమ్ చెస్ చాంపియన్‌షిప్‌లో రెండో ‘డ్రా’ నమోదు చేసుకుంది. మంగళవారం జరిగిన నాలుగో రౌండ్ మ్యాచ్‌లో భారత్, ఉక్రెయిన్ జట్లు 2-2 పాయింట్లతో సమఉజ్జీగా నిలిచాయి. ప్రపంచ బ్లిట్జ్ చాంపియన్ అన్నా ముజిచుక్‌తో జరిగిన గేమ్‌ను ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి కేవలం 14 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకోగా... క్లాసిక్ విభాగంలో ప్రస్తుత ప్రపంచ చాంపియన్ మరియా ముజిచుక్‌తో జరిగిన గేమ్‌ను ఆంధ్రప్రదేశ్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక 31 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించింది. ప్రపంచ మాజీ చాంపియన్ అన్నా ఉషెనినాతో జరిగిన గేమ్‌లో పద్మిని రౌత్ 52 ఎత్తుల్లో సంచలన విజయం సాధించడంతో భారత్ 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే చివరిదైన నాలుగో గేమ్‌లో ప్రపంచ జూనియర్ మాజీ చాంపియన్ సౌమ్య స్వామినాథన్ 71 ఎత్తుల్లో నటాలియా జుకోవా చేతిలో ఓడిపోవడంతో భారత్ 2-2తో ‘డ్రా’ చేసుకుంది. మరో ఆరు రౌండ్లు మిగిలి ఉన్న ఈ టోర్నీలో భారత్ రెండు పాయింట్లతో తొమ్మిదో స్థానంలో ఉంది. బుధవారం జరిగే నాలుగో రౌండ్లో రష్యాతో భారత్ ఆడుతుంది. మరోవైపు ఆర్మేనియాలో జరుగుతున్న పురుషుల ప్రపంచ టీమ్ చెస్ చాంపియన్‌షిప్‌లో భారత్ 1.5-2.5 పాయింట్ల తేడాతో ఇజ్రాయెల్ చేతిలో ఓడిపోయింది. బోరిస్ గెల్ఫాండ్‌తో పెంటేల హరికృష్ణ తన గేమ్‌ను 27 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకోగా... ఎవగెని పోస్ట్నీపై దీప్ సేన్‌గుప్తా గెలిచాడు. అయితే సేతురామన్ 28 ఎత్తుల్లో సుటోవ్స్కీ చేతిలో; శశికిరణ్ 35 ఎత్తుల్లో సిమిరిన్ చేతిలో పరాజయం పాలవ్వడంతో భారత ఓటమి ఖాయమైంది.