సింగపూర్‌లో భారతీయుడి మృతి, చెలరేగిన హింస
సింగపూర్: సింగపూర్‌లో రోడ్డు ప్రమాదంలో ఓ భారతీయుడు మృతి చెందడంతో దాదాపు 400 మందిపైగా దక్షిణాసియా వలస కార్మికులు చేపట్టిన ఆందోళన హింసకు దారి తీసింది. లిటిల్ ఇండియాలో ఈ ఘర్షణలు చోటుచుకున్నాయి. శక్తివేల్ కుమారవేలు(33) రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో ఈ ఘర్షణలు రేగాయి. స్థానిక హెంగ్ హప్ పూన్ కంపెనీలో రెండేళ్లుగా పనిచేస్తున్న శక్తివేల్‌ను ఆదివారం సాయంత్రం టెక్కా సెంటర్ సమీపంలో ప్రైవేటు బస్సు ఢీకొనడంతో అతడు మృతి చెందాడు. దీంతో దక్షిణాసియా వలస కార్మికులు ఆందోళనకు దిగారు.
ఆగ్రహానికి గురైన ఆందోళనకారులు ఐదు పోలీసు వాహనాలు, పలు ప్రైవేటు వాహనాలు ధ్వంసం చేశారు. ఆందోళనకారుల దాడిలో 10 మంది పోలీసు అధికారులకు గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి 27 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని స్థానిక మీడియా తెలిపింది. అయితే తాము కాల్పులు జరపలేదని పోలీసులు పేర్కొన్నారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రధాని లీ హైసన్ లాంగ్ ఆదేశించారు.