భారతీయులకు హెచ్-1 బీ షాక్!
హెచ్-1 బీ, ఎల్ 1 వీసాలపై మరిన్ని ఆంక్షలన్న ట్రంప్ సర్కార్
భారతీయ ఐటీ వృత్తి నిపుణులు అత్యధికంగా వినియోగించే హెచ్-1బీ, ఎల్-1 వీసాలపై మరిన్ని కఠిన ఆంక్షలు విధిస్తామని ట్రంప్ సర్కారు తాజాగా మరోసారి సంకేతాలు ఇచ్చింది. ఈ వీసాల దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు మరిన్ని చర్యలు తీసుకుంటామని అమెరికా అటార్నీ జనరల్ పదవికి నామినేట్ అయిన సెనేటర్ జెఫ్ సెషన్స్ తెలిపారు. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ఆయనను అటార్నీ జనరల్ పదవికి నామినేట్ చేశారు.
'మనం స్వేచ్ఛాయుత ప్రపంచంలో జీవిస్తున్నామని, ఒక అమెరికన్ ఉద్యోగాన్ని విదేశాల్లో తక్కువ జీతంతో పనిచేసే మరొకరితో భర్తీ చేయడం సరైనదేనని భావించడం చాలా తప్పు' అని సెనేట్ జ్యుడీషియరి కమిటీ ముందు హాజరైన జెఫ్ తెలిపారు. అమెరికా అటార్నీ జనరల్ పదవి చేపట్టేందుకు తాను సిద్ధమని ధ్రువీకరించిన ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ 'మనకు సరిహద్దులు ఉన్నాయి. మన పౌరులకు మనం కట్టుబడి ఉండాలి. ఆ విషయంలో మనం చాంపియన్లం. మీతో పనిచేయబోతుండటం గర్వంగా భావిస్తున్నా' అని జెఫ్ అన్నారు.
అమెరికాలో అత్యధిక హెచ్-1బీ వీసాలు పొందుతున్నది భారతీయులే. అమెరికాకు చెందిన కాగ్నిజెంట్, ఐబీఎం తదితర సాఫ్ట్ వేర్ కంపెనీల్లో పనిచేసేందుకు ఈ వీసాల ద్వారానే భారతీయుల అనుమతి పొందుతున్నారు. ఒకవేళ ఈ వీసాలపై ఆంక్షలు విధిస్తే భారతీయ సాఫ్ట్ వేర్ కంపెనీలు, వాటి భాగస్వాములైన అమెరికన్ కంపెనీలకు తీవ్ర ఎదురుదెబ్బ కానుంది.