ప్రపంచ చాంపియన్‌పై గీత గెలుపు
న్యూఢిల్లీ: ప్రొ రెజ్లింగ్ లీగ్ (పీడబ్ల్యూఎల్)లో పంజాబ్ రాయల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న భారత రెజ్లర్ గీత ఫోగట్ పెను సంచలనం సృష్టించింది. మహిళల 58 కేజీల విభాగంలో ప్రపంచ చాంపియన్ ఒక్సానా హెర్హెల్ (హరియాణా హ్యామర్స్)తో జరిగిన బౌట్లో గీత ఫోగట్ 8-6 పాయింట్ల తేడాతో గెలిచి ఆశ్చర్యపరిచింది. పీడబ్ల్యూఎల్‌లో అత్యధిక మొత్తం అందుకున్న రెజ్లర్‌గా గుర్తింపు పొందిన ఒక్సానా ఒకదశలో 6-5తో ముందంజలో ఉంది.
అయితే చివరి సెకన్లలో గీత పట్టుదలతో పోరాడి మూడు పాయింట్లు సాధించి అద్భుత విజయాన్ని దక్కించుకుంది. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో పంజాబ్ రాయల్స్ 5-2తో హరియాణా హ్యామర్స్ను ఓడించి ఈ లీగ్‌లో మూడో విజయాన్ని తమ ఖాతాలో జమ చేసుకుంది. పంజాబ్ రాయల్స్ తరఫున వ్లాదిమిర్ (57 కేజీలు), మౌజమ్ ఖత్రీ (97 కేజీలు), చులున్బట్ (125 కేజీలు), వాసిలిసా (69 కేజీలు) గెలుపొందగా... హరియాణా తరఫున యోగేశ్వర్ దత్ (65 కేజీలు), నిర్మలా దేవి (48 కేజీలు) విజయం సాధించారు. బుధవారం జరిగే మ్యాచ్‌లో బెంగళూరు యోధాస్‌తో ఢిల్లీ వీర్ తలపడుతుంది.