'తమిళ జాలర్ల విడుదలకు భారత్ యత్నం'
కొలంబో/న్యూఢిల్లీ: శ్రీలంకలో మరణశిక్ష పడ్డ ఐదుగురు తమిళ జాలర్లను భారత హైకమిషనర్ మంగళవారం ఉదయం కలిశారు. కొలంబోలోని వెలికడ జైల్లో ఉన్న ఐదుగురు మత్స్యకారులను భారత దౌత్యాధికారి యాష్ సిన్హా కలిశారు. వీలైనంత త్వరగా జైలు నుంచి విడుదల చేయించేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వారితో చెప్పారు.
వెలికడ జైలు సూపరిండెంటెంట్ కార్యాలయంలో ఐదుగురు జాలర్లను యాష్ సిన్హా కలిశారని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి సయిద్ అక్బరుద్దీన్ ఢిల్లీలో చెప్పారు. వారికి అవసరమైన దుస్తులు, వస్తువులు అందజేశారని తెలిపారు. వారికి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారని చెప్పారు. జాలర్ల విడుదలకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నిస్తోందన్న విషయాన్ని వారికి చెప్పారన్నారు.