అల్‌ఖైదా, ఐఎస్ తీవ్రవాదం అత్యంత ప్రమాదకరం
గౌహతి: దేశ రక్షణలో పోలీసు, నిఘా వ్యవస్థల పాత్ర అత్యంత కీలకమని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. శనివారం అసోం రాజధాని గౌహతిలో నిర్వహించిన అన్ని రాష్ట్రాల డీజీపీలు, ఐబీ అధికారుల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాజ్‌నాథ్ .... దేశం ఎదుర్కొంటున్న ఉగ్రవాదం, విదేశీ చొరబాట్లు, శరణార్థుల అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్ మాట్లాడుతూ ... అల్ ఖైదా, ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదం అత్యంత ప్రమాదకరమైనవని అన్నారు.
ఉగ్రవాదం చాలా తీవ్రమైన అంశంగా పరిగణిస్తున్నామని... ఈ అంశాన్ని చిన్నదిగా చూడబోమని తెలిపారు. దేశ సరిహద్దుల్లో పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని తరుచూ ఉల్లంఘించడమే కాకుండా.... పలు దురాగతాలకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు. దేశ సరిహద్దుల్లోని ప్రజలకు పూర్తి భద్రత కల్పిస్తామని రాజ్‌నాధ్ భరోసా ఇచ్చారు. 2019 నాటికి దేశంలోని అన్ని జాతీయ రహదారులలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇటీవల జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన మొదటి దశ ఎన్నికల్లో అత్యధిక శాతం ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని గుర్తు చేశారు.
ఆ రాష్ట్రంలో ఇంతలా ఓటింగ్ జరగడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఇంత ఓటింగ్ జరగడం గతంలో తాను ఎన్నడూ చూడలేదన్నారు. అదికాక ఆ ఎన్నికలు ప్రశాంతగా జరిగాయని చెప్పారు. దేశ తీర ప్రాంతాల్లో రక్షణ వ్యవస్థను మరింత పెంచాలని ఆయన ఉన్నతాధికారులకు సూచించారు. దేశ విపత్తు సమయంలో ఎన్డీఆర్ఎఫ్, ఎన్డీఏఎంలదీ కీలక పాత్ర పోషిస్తున్నాయని ఆ సంస్థల సేవలను రాజ్‌నాథ్ ఈ సందర్భంగా ప్రశంసించారు.