మోదీతో మాట్లాడాలని ఉంది: రాహుల్
న్యూఢిల్లీ : రెండున్నరేళ్ల కాలంలో మొట్టమొదటిసారి నరేంద్రమోదీ ప్రధానమంత్రిలా వ్యవహరించారని కాంగ్రెస్ ఉపాధ్యాక్షుడు రాహుల్ గాంధీ కొనియాడారు.నియంత్రణ రేఖ వెంబడి మొహరించి ఉన్న పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం దాడి చేసిందని గురువారం ప్రకటించడంతో రాహుల్ గాంధీ శుక్రవారం మోదీకి అభినందనలు తెలిపారు. మోదీతో మాట్లాడాలని ఉందని దానికి గల కారణం రెండున్నరేళ్ల పాలనలో మొదటిసారి ఆయన ప్రధానమంత్రిలా వ్యవహరించడమేనని పేర్కొన్నారు.ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మోదీ తీసుకుంటున్న చర్యలకు తాము పూర్తి మద్దతిస్తామని ప్రకటించారు. ఒక్క కాంగ్రెస్ పార్టీనే కాదు, దేశమంతా మోదీకి వెన్నుదన్నుగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు.
బుధవారం అర్థరాత్రి భారత సైన్యం నియంత్రణ రేఖ వెంబడి ఉన్న పాక్ భూభాగంలోకి ప్రవేశించి ఏడు ఉగ్రవాద స్థావరాలపై దాడిచేసింది. ఉడి ఉగ్రదాడికి బదులు చెప్పడానికి మోదీ మాటలతో కాకుండా చేతలతో చేసి చూపించారు. ఊహించిన దానికంటే అసాధారణ స్థాయిలోనే ప్రతీకారాన్ని తీర్చుకోవడాన్ని మోదీ అమలుచేశారు. ప్రభుత్వం తీసుకుంటున్న ఈ ఆర్మీ చర్యలకు తాము అండగా ఉంటామని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ నిన్ననే ప్రకటించారు. సైనికులు విజయవంతంగా ఈ ఆపరేషన్స్‌ను పూర్తి చేయడంపై సోనియా గాంధీ అభినందనలు తెలిపారు. సర్జకల్ స్ట్రయిక్స్‌పై అన్ని ప్రధాన పార్టీలు మోదీకి వెన్నుదన్నుగా నిలబడనున్నట్టు ఇప్పటికే ప్రకటించాయి.