ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో అవకతవకలు
మంచాల, న్యూస్‌లైన్: ప్రభుత్వ సంక్షేమ పథకాలు లబ్ధిదారులకేమోగానీ కొంతమంది అధికారులు, నాయకులకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని అందినకాడికి దండుకుంటున్నారు. మండల పరిధిలోని దాద్పల్లికి దాద్పల్లితండా, వెంకటేశ్వర తండా అనుబంధ గ్రామాలుగా ఉన్నాయి. ఇక్కడ అధిక సంఖ్యలో గిరిజనులు ఉన్నారు.
వీరిలో నిరక్ష్యరాస్యత, అమాయకత్వాన్ని ఆసరగా చేసుకొని అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. పంచాయతీ పరిధిలో ఇందిరా ఆవాస్ యోజన (ఐఏవై) పథకం కింద 1998 నుంచి 2006 వరకు 150 ఇళ్లు మంజూరయ్యాయి. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద 2008 నుంచి 2013 వరకు 330 ఇళ్లు మంజూరయ్యాయి. ఇందిరమ్మ ఇళ్లు ఇప్పిస్తామని కొంతమంది నాయకులు స్థాని కుల నుంచి ఫొటోలు, బ్యాంకు ఖాతానంబర్లు తీసుకున్నారు. అధికారులు, సదరు నా యకులు కుమ్మక్కై ఇళ్లు కట్టకున్నా కట్టినట్లు రికార్డుల్లోకి ఎక్కించారు.
లబ్ధిదారులకు తెలి యకుండా బిల్లులు కాజేశారు. లబ్ధిదారుల సంతకాలు ఫోర్జరీ చేసి లక్షల్లో స్వాహా చేశా రు. కొంతమంది అనర్హులకు, ప్రభుత్వ ఉ ద్యోగులకు కూడా ఇళ్లు మంజూరు అయ్యేలా చూశారు. తరువాత విషయం తెలిసిన లబ్ధిదారులు అవాక్కయ్యారు. మా సంతకాలు లేకుండా మా ఖాతాలో నుంచి డబ్బులు ఎలా ఇచ్చారని బోడకొండ దక్కన్ గ్రామీణ బ్యాం కు, మండల కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. విచారణ చేపడతామని అధికారులు హామీ ఇచ్చి చేతులు దులుపుకున్నారు.
‘పరిహారం’లోనూ అంతే...
పంట నష్ట పరిహారం విషయంలోనూ ఇలాగే జరిగింది. ప్రభుత్వం 2011-2012లో పంట నష్టపోయిన 503 మంది రైతులకు పరిహారం కింద రూ.3లక్షల 60 వేలు మంజూరు చేసింది. ఇందులో 40 నుంచి 50 మందికి మాత్రమే పరిహారం అందింది. బాధితులకు తెలియకుండానే ప్రభుత్వం ఇచ్చిన పరిహారాన్ని వారి ఖాతాల నుంచి ఇతరుల ఖాతాలకు మళ్లించారు. గుట్టచప్పుడు కాకుండా కాజేశారు. గత నవంబర్‌లో పంటనష్ట పరిహారంపై వ్యవసాయాధికారులు విచారణ చేపట్టారు. వంద మంది ఖాతాలను విచారించగా వాటిలో 70 ఖాతాలు నకిలీవని, 30 ఖాతాలు మాత్రమే వాస్తవమని తేలింది. పూర్తిస్థాయి విచారణ చేపట్టకుండానే అధికారులు ఈ తంతును తూతూమంత్రంగా ముగించారు.
రుణాల్లోనూ అదే తంతు..
మరోవైపు గ్రామంలో నకిలీ పాసు పుస్తకాలు సృష్టించి బ్యాంకుల నుంచి పెద్ద ఎత్తున రుణాలు తీసుకున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల విషయంలో పెద్దఎత్తున అవకతవకలు జరుగుతున్నా సంబంధిత అధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.