తూతూ మంత్రంగా ఇందిర జయంతి
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి గాంధీభవన్‌లో పార్టీ నిర్వహించే కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తొలినాళ్లలో కొన్ని కార్యక్రమాలకు హాజరైన ఆయన కొంతకాలంగా పూర్తిగా ముఖం చాటేశారు. పార్టీ దివంగత నేతల జయంతి, వర్ధంతి కార్యక్రమాలతోపాటు జాతీయ పండుగలకూ ఆయన రావడం లేదు. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు, సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి మధ్య విభేదాలు, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులే ఇందు కు కారణమనే వాదన పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది.
మంగళవారం గాంధీభవన్‌లో ఇందిర జయంతి కార్యక్రమాన్ని ఎలాంటి హడావుడి లేకుండా తూతూమంత్రంగా నిర్వహించారు. ఆర్భాటంగా కార్యక్రమం పెడితే సీఎం హాజరవ్వాల్సి వస్తుందని, అదే సమయంలో తెలంగాణ నేతలు రాకతప్పదని, దీంతో కార్యక్రమం రసాభాసగా మారుతుందనే ఉద్దేశం తో బొత్స.. ఇలా చేశారని పార్టీవర్గాలు అంటున్నాయి. కాగా, దీనిపై బొత్స వివరణ ఇస్తూ...‘సీఎం ఢిల్లీ వెళ్లినందున మంగళవారం కూడా అక్కడే ఉంటారని భావించి ఇందిర జయంతి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం పెట్టలేదు. ఉదయం సీఎంతో ఫోన్లో మాట్లాడి నెక్లెస్‌రోడ్డులోని ఇందిరగాంధీ విగ్రహం వద్దనే నివాళులు అర్పించవచ్చు అక్కడికే వచ్చేయండని చెప్పాను. అంతే తప్ప సీఎం గాంధీభవన్ కార్యక్రమానికి రాకపోవడానికి మరో కారణమేదీ లేదు’ అని మీడియాకు వివరించారు.