నత్తనడకన ‘ఇందిరమ్మ
విద్యా నిలయం’ పనులు
మొయినాబాద్: కళాశాల విద్యార్థినుల కోసం ప్రభుత్వం నిర్మిస్తున్న ‘ఇందిరమ్మ విద్యా నిలయం’ హాస్టల్ భవనం నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. పనులు ప్రారంభమై ఎనిమిది నెలలు దాటినా ఇప్పటికీ పునాదులకే పరిమితమయింది. కళాశాలల్లో చదివే విద్యార్థుల వసతి కోసం ఇందిరమ్మ విద్యా నిలయాలు నిర్మించేందుకు గత ఏడాది అప్పటి ప్రభుత్వం సంకల్పించింది. అందులో భాగంగా జిల్లాలో ఆరు హాస్టల్ భవనాలను నిర్మించేం దుకు ప్రణాళికలు సిద్ధం చేసి, ఒక్కో భవనానికి రూ. 2.50 కోట్ల నిధులు కేటాయించింది. వాటిలో ఒకటి మొయినాబాద్‌లో బాలికల కోసం నిర్మించేందుకు మంజూరు చేశారు.
దాంతో భవన నిర్మాణంకోసం మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో అర ఎకరం ప్రభుత్వ భూమిని కేటాయించారు. ఈ భవన నిర్మాణానికి గత సంవత్సరం నవంబర్ 14న అప్పటి జిల్లా చేనేత, జౌళి శాఖ మంత్రి గడ్డం ప్రసాద్‌కుమార్ శంకుస్థాన చేశారు. ప్రభుత్వం ఈ భవన నిర్మాణ పనుల పర్యవేక్షణను వైద్య, ఆరోగ్య శాఖ ఇంజనీరింగ్ విభాగానికి అప్పగించింది. నెల రోజుల్లోపే టెండర్లు పూర్తి కావడంతో వెం టనే పనులు ప్రారంభించారు. కానీ ఆ పనులు మాత్రం నత్తనడకన సాగుతున్నాయి.
ఈ సంవత్సరం డిసెంబర్‌లోపు ఈ భవనం పూర్తి కావాల్సి ఉంది. ప్రస్తుతం నడుస్తున్న పనులను బట్టిచూస్తే మరో సంవత్సరం పాటు భవని ని ర్మాణ పనులు కొనసాగే అవకాశం కనిపిస్తుంది. నాలుగు నెలల క్రితం పనులను పరిశీలించేందుకు వచ్చిన వైద్య, ఆరోగ్య శాఖ ఇంజనీరింగ్ విభాగం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆనందర్‌కుమార్ పనులు వేగవంతం చేయాలని, డిసెంబర్‌లోగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌కు సూచిం చారు. అయినా పనులు మందకొడిగానే సాగుతుండడంతో వచ్చే విద్యా సంవత్సరంలోనైనా ఈ భవనం విద్యార్థులకు అందుబాటులోకి వస్తుందో రాదోననే సందేహం నెలకొంది.