త్రిశంకు స్వర్గంలో ‘ఇందిరమ్మ’
- నాలుగు నెలలుగా అందని బిల్లులు
- కొత్త ప్రభుత్వం రద్దు చేస్తోందని ప్రచారం
- ఆందోళనలో లబ్ధిదారులు
- బిల్లు చెల్లించి న్యాయం చేయాలంటూ వేడుకోలు
సంగారెడ్డి డివిజన్: జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. గత ప్రభుత్వాలు ‘ఇందిరమ్మ’ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని అమలు చేయడంతో లబ్ధిదారులు కూడా ఇళ్లు కట్టుకునేందుకు ముందుకు వచ్చారు. అందువల్లే ప్రతి సంవత్సరం లబ్ధిదారుల సంఖ్య కూడా పెరుగుతూ వచ్చింది. అయితే కొత్తగా ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వం ఈ పథకాన్ని కొనసాగించకపోవచ్చనే ప్రచారం జోరుగా సాగుతోంది.
అర్హులైన పేదలకు రూ.3 లక్షలతో రెండు బెడ్రూంలు, హాల్, కిచెన్‌తో ఇళ్లు నిర్మించి ఇవ్వాలని టీఆర్ఎస్ ప్రభుత్వం యోచిస్తోంది. రూ.3 లక్షల పథకానికి సంబంధించి రాష్ట్రస్థాయిలో అధికారులు విధి విధానాలు ఖరారు చేసే పనిలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో ఇందిరమ్మ గృహ నిర్మాణం పథకం కొనసాగింపుపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం కొత్త గృహ నిర్మాణం పథకానికి శ్రీకారం చుడితే తమ పరిస్థితి ఏమిటని ఇందిరమ్మ లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు.
నిలిచిన బిల్లుల చెల్లింపు
జిల్లాలోని ఇందిరమ్మ లబ్ధిదారులకు నాలుగు మాసాలుగా బిల్లులు అందటంలేదు. బిల్లులు రాకపోవటంతో ఇళ్ల నిర్మాణాలు కూడా నత్తనడకన సాగుతున్నాయి. కొత్త సర్కార్ ఈ పథకాన్ని రద్దు చేస్తుందన్న ప్రచారంలో లబ్ధిదారులంతా ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో మూడు విడతలుగా ఇందరిమ్మ గృహ నిర్మాణం పథకాన్ని చేపట్టగా, మూడు విడతల్లో జిల్లాకు 3,03,083 ఇళ్లు మంజూరయ్యాయి. వీటిలో ఇప్పటి వరకు 2,38,122 ఇందిరమ్మ ఇళ్లు గ్రౌండింగ్ చేశారు.
వీటిలో 41,374 ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేశారు. మిగతా 2,38,122 ఇళ్ల నిర్మాణం పనులు వివిధ దశల్లో ఉన్నాయి. 23,587 ఇళ్ల నిర్మాణం పనులు మాత్రం ప్రారంభానికి నోచుకోలేదు. జిల్లాలో ఇందిరమ్మ గృహ నిర్మాణం పథకానికి సంబంధించి ఎక్కువ శాతం ఇళ్లు ఇంకా నిర్మాణ దశల్లోనే కొనసాగుతున్నాయి. పునాదుల దశలో 7,557 ఇళ్లు ఉండగా, పునాది పనులు ప్రారంభించిన ఇళ్లు 27,889, ఇంటిగోడల నిర్మాణం పూర్తయి పనులు కొనసాగుతున్న ఇళ్లు 3952, రూఫ్ స్థాయిలో 10,284 ఇళ్లు ఉన్నాయి.
రూఫ్ పనులు పూర్తయి ఇంకా చిన్నపాటి నిర్మాణం పనులు పూర్తి కావాల్సిన గృహాలు సంఖ్య 1,88,440 వరకు ఉంది. జిల్లాలో ఎక్కువ సంఖ్యలో ఇందిరమ్మ గృహ నిర్మాణాలు నిర్మాణ దశలో ఉన్నందున ప్రభుత్వం ఇందిరమ్మ గృహ నిర్మాణం పథకంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. పెద్ద సంఖ్యలో ఇందిరమ్మ గృహాలు నిర్మాణ దశలో ఉన్నందున లబ్ధిదారులతోపాటు ప్రజాప్రతినిధులు సైతం ఇందిరమ్మ గృహ నిర్మాణం పనులు పూర్తి చేయాలని కోరుతున్నారు.
ఇదిలావుండగా, సుమారు నాలుగు నెలలుగా ఇందిరమ్మ లబ్ధిదారులకు బిల్లుల చెల్లింపు నిలిచిపోయింది. కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటికీ ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం అమలు విషయంలో స్పష్టమైన ఆదేశాలు రాకపోవడంతో గృహ నిర్మాణశాఖ అధికారులు సైతం ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్నారు. ఈ కారణంగానే బిల్లుల చెల్లింపులో ఆలస్యం అవుతున్నట్లు సమాచారం.
ప్రారంభం కాని ఇళ్ల మాటేమిటి
జిల్లాలో ప్రారంభానికి నోచుకోని ఇందిరమ్మ ఇళ్లు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. జిల్లాలో 23,587 ఇళ్ల నిర్మాణం పనులు ఇంకా ప్రారంభం కాలేదు. నూతన ప్రభుత్వం ఇందిరమ్మ పథకం స్థానంలో కొత్త గృహ నిర్మాణం పథకం ప్రారంభించిన పక్షంలో గతంలో మంజూరై ఇప్పటికీ ప్రారంభం కాని ఇందిరమ్మ ఇళ్లు రద్దు చేస్తారని తెలుస్తోంది. రద్దు చేసిన లబ్ధిదారులకు రూ.3 లక్షల గృహ నిర్మాణం పథకంలో తిరిగి ఎంపిక చేయవచ్చని సమాచారం.