పేదల స్థలాలతో పెద్దల వ్యాపారం !
నంద్యాల, న్యూస్‌లైన్: నిరు పేదలకు దక్కాల్సిన ఇందిరమ్మ స్థలాల్లో అనర్హులు పాగా వేశారు. బినామీ పేర్లతో అధికార పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు పట్టాలు పొంది వాటిని అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. నంద్యాల పట్టణంలో ఎమ్మెల్యే శిల్పా మోహన్‌రెడ్డి పదేళ్లలో వైఎస్సార్‌నగర్, నందమూరినగర్, ఊడుమాల్పురం, చాపిరేవుల, అయ్యలూరు మెట్ట, రైతునగర్ తదితర ప్రాంతాల్లో దాదాపు 12 వేల మందికి ఇళ్ల స్థలాలను అందజేశారు. వీరిలో సుమారు 7 వేల మంది అనర్హులు ఉన్నట్లు తెలుస్తోంది. పట్టణంలో ఇళ్ల స్థలాలకు డిమాండ్ ఉండటంతో కొందరు ఇందిరమ్మ ఇళ్ల స్థలాలను ఆక్రమించుకుని విక్రయాలకు శ్రీకారం చుట్టారు. శివారు ప్రాంతాల్లో సెంట్ ధర రూ.5 లక్షల వరకు ఉంది.
ఈ ప్రాంతాల్లో మొదట స్థలాలు పొందిన అనర్హులు సెంట్ రూ. 2 లక్షల వరకు అగ్రిమెంట్ ప్రకారం అమ్మేస్తున్నారు. ఈ స్థలాలతో కొందరు నాయకులు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. ఇప్పటి వరకు రూ. 75 కోట్ల మేర లావాదేవీలు జరిగినట్లు తెలుస్తోంది. పట్టణంలోని వైఎస్సార్ నగర్లో దాదాపు 8 వేల ఇళ్లను నిర్మించి పేదలకు అందజేస్తే కేవలం 900 మంది మాత్రమే నివాసం ఉంటున్నారు. అలాగే నంద్యాల పట్టణ శివార్లలోని రైతునగర్‌లో దాదాపు 400 ఇళ్లు నిర్మించారు. ఇందులో 200 ఇళ్ల స్థలాలను అనర్హులు దక్కించుకుని ఇతరులకు విక్రయించినట్లు సమాచారం. ఎమ్మెల్యే శిల్పామోహన్‌రెడ్డి ఇచ్చిన పేర్ల జాబితాను రెవెన్యూ అధికారులు విచారించకుండా స్థలాలను మంజూరు చేశారు.
దీంతో పట్టణంలోని దాదాపు 10 వేల మందికి ఇళ్ల స్థలాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. అధికార పార్టీకి జై కొట్టిన మాజీ కౌన్సిలర్లకు, ఉద్యోగ వర్గాలకు ఇళ్ల స్థలాలను ఇచ్చారే తప్ప పేదలకు అందలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయాన్ని స్థానిక తహశీల్దార్ శివరామిరెడ్డిని ‘న్యూస్‌లైన్’ వివరణ కోరగా తాను బాధ్యతలు స్వీకరించిన తర్వాత 300 మందికి మించి స్థలాలు ఇవ్వలేదని అంతకు ముందు ఏం జరిగిందో తనకు తెలియదని అన్నారు.