పగబట్టి.. జుట్టు కత్తిరించి..
వ్యక్తిగత కక్షల నేపథ్యంలో మహిళ కేశాలను కత్తిరించింది తన కసి తీర్చుకుంది మరో మహిళ. ఈ ఘటన చిలకలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి..
సికింద్రాబాద్ బౌద్ధనగర్‌కు చెందిన శ్రీవల్లి (28), అనీల్‌కుమార్ భార్యాభర్తలు. అదే ప్రాంతానికి చెందిన పార్వతి మరో ముగ్గురు మహిళలతో కలిసి శుక్రవారం రాత్రి బైక్‌లపై వచ్చి శ్రీవల్లి ఇంట్లో చొరబడి ఆమెపై దాడిచేశారు. ఈ సందర్భంగా ముగ్గురు మహిళలు బాధితురాలి చేతులు పట్టుకోగా పార్వతి తనవెంట తెచ్చుకున్న కత్తెరతో శ్రీవల్లి జుత్తును కత్తిరించింది.
బాధితురాలు విడిపించుకుని పక్కనే ఉన్న తన తల్లి ఇంటికి వెళ్లినా వారు ఆమె వెంటపడి దాడి చేశారు. దీనిని అడ్డుకున్న శ్రీవల్లి తల్లి బాలమణిపై కూడా దాడికి పాల్పడి వాహనాలపై అక్కడినుంచి పరారయ్యారు. వ్యక్తిగత కక్షలతోనే పార్వతి మరో ముగ్గురు మహిళలను తనపై దాడికి పాల్పడడమే కాకుండా జుత్తును కత్తిరించారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్ఐ జయశంకర్ తెలిపారు.