దుబాయ్‌లో ఇండో–పాక్ సిరీస్!
న్యూఢిల్లీ: చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్ల మధ్య దుబాయ్‌లో ద్వైపాక్షిక సిరీస్ జరిపేందుకు బీసీసీఐ ప్రభుత్వ అనుమతి కోసం లేఖ రాసిందని ఓ వెబ్సైట్లో వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ సిరీస్ అసాధ్యమని, అలాంటి అనుమతి ఆర్జిలేవి తమకు రాలేదని హోంశాఖ వర్గాలు స్పష్టం చేశాయి. బీసీసీఐ చీఫ్ (తాత్కాలిక) సీకే ఖన్నా ప్రభుత్వ ఆమోదం కోసం లేఖ రాశారని, దీనిపై వచ్చే నెల 9న జరిగే బోర్డు ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్‌జీఎమ్)లో చర్చించనున్నారని ‘క్రికెట్’కు సంబంధించిన వెబ్సైట్ పేర్కొంది. భవిష్యత్ పర్యటనల కార్యక్రమం (ఎఫ్టీపీ)లో భాగంగా భారత్ తటస్థ వేదికపై మూడు టెస్టులు, ఐదు వన్డేలు, రెండు టి20లు ఆడేందుకు పీసీబీకి ప్రతిపాదనలు పంపిందని, దీనికి పాకిస్తాన్ బోర్డు దుబాయ్ వేదికను సూచించిందని ఆ వెబ్సైట్ చెప్పుకొచ్చింది.
అయితే భారత ప్రభుత్వ వర్గాలు మాత్రం ఈ ప్రతిపాదనలేవీ రాలేదని స్పష్టం చేశాయి. పఠాన్‌కోట్, ఉరి దాడులతో పాటు తాజాగా పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ప్రాంతాన్ని రాష్ట్రంగా చేయాలనుకుంటున్న నేపథ్యంలో ఇరు దేశాల మధ్య సత్సంబంధాలేవీ లేవని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. దీంతో ఇప్పట్లో ఇండో, పాక్ సిరీస్ అసాధ్యమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్ అహిర్ కుండబద్దలు కొట్టారు. బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, అధికార బీజేపీ పార్టీ ఎంపీ కూడా అయిన అనురాగ్ ఠాకూర్ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇరు దేశాల మధ్య సిరీస్ నిర్వహణ ప్రశ్నేలేదన్నారు.