గల్లంతైన విమానం కోసం గాలింపు
జకర్తా : తూర్పు ఇండోనేషియాలో గల్లంతైన విమానం కోసం ఆ దేశ ప్రభుత్వం గాలింపు చర్యలను ముమ్మరం చేసింది. ఈ మేరకు ఇండోనేసియా రవాణా మంత్రిత్వ శాఖ ప్రతినిధి జూలియస్ బారట శనివారం వెల్లడించారు. ఏవియేస్టర్ మండిరి ప్రైవేట్ ఎయిర్‌లైన్ సంస్థకు చెందిన ఈ విమానం 10 మందితో దక్షిణ సులవేసి ప్రావిన్స్‌లోని మసాంబ నుంచి మకస్సార్కు శుక్రవారం బయల్దేరింది. మరో 11 నిమిషాల్లో విమానం మకస్సార్లో దిగాల్సి ఉంది.
అంతలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో విమాన సంబంధాలు తెగిపోయాయి. దీంతో వెంటనే రంగంలోకి వైమానిక సిబ్బంది దిగి గాలింపు చర్యలు చేపట్టారు. కానీ ఫలితం లేకపోయింది. దాంతో శనివారం ఉదయం నుంచి మళ్లీ విమాన ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ప్రమాదానికి గురైన ఈ విమానంలో ఏడుగురు ప్రయాణికులతోపాటు ముగ్గురు విమాన సిబ్బంది ఉన్నారని బారట తెలిపారు. వారిలో ముగ్గురు చిన్నారులని చెప్పారు.