ఇందూరుకు కాళేశ్వరం నీరు
* నిజాంసాగర్ ప్రాజెక్టుకు పునర్వైభవం
* నిజామాబాద్ జిల్లాకు అదనంగా రెండు వేల ఇళ్లు
* జిల్లా ప్రతినిధులతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నిజామాబాద్ జిల్లాకు సాగునీటిని అందించే ప్రణాళికకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నిజామాబాద్ జిల్లాకు గరిష్ఠంగా లాభం జరుగుతుందని అన్నారు. మల్లన్నసాగర్ నుంచి ఈ నీటిని తీసుకునేందుకు వీలుగా జిల్లాలో రిజర్వాయర్లు, కాల్వల నిర్మాణం జరగాలని అధికారులను ఆదేశించారు. నిజాంసాగర్ ప్రాజెక్టు కాల్వలన్నింటినీ పూర్తి స్థాయిలో మరమ్మతు చేసి 3 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించాలని చెప్పారు. ప్రాజెక్టుల రీ డిజైన్ ద్వారా వచ్చే కొత్త ప్రాజెక్టులతో ఎక్కువ వ్యవసాయ భూమి సాగయ్యేలా రిజర్వాయర్లు, కాల్వలు నిర్మించాలన్నారు. అంతర్రాష్ట ప్రాజెక్టు లెండి ద్వారా జుక్కల్ నియోజకవర్గానికి సాగునీరు అందుతుందని, ఆ ప్రాజెక్టు పనులూ వేగంగా జరగాలని చెప్పారు. మహారాష్ట్రతో నిరంతరం సంప్రదింపులు జరపాలని, భూ సేకరణకు కావా ల్సిన నిధులు విడుదల చేయాలని ఆదేశించారు.
ప్రాణహిత ప్రాజెక్టులో భాగంగా బాల్కొం డ, ఆర్మూరు, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాలకు నీరందించేందుకు జరుగుతున్న పనులను యథావిధిగా కొనసాగించాలన్నారు. నిజామాబాద్ జిల్లాలో అమలయ్యే వివిధ ప్రభుత్వ పథకాలపై సీఎం క్యాంపు కార్యాలయంలో ఆదివారం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. మంత్రులు హరీశ్‌రావు, పోచారం శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎంపీలు కవిత, బిబి పాటిల్, ఎమ్మెల్యేలు ఏనుగు రవీందర్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎ.జీవన్‌రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్, గణేష్ గుప్తా, హనుమంతు షిండే, షకీల్ అహ్మద్, ఎమ్మెల్సీలు పాతూరి సుధాకర్‌రెడ్డి, రాజేశ్వర్‌రావు, గంగాధర్, జెడ్పీ చైర్పర్సన్ దఫేదార్ రాజు, సీఎస్ రాజీవ్‌శర్మ, సీఎం అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. జిల్లాలో ప్రస్తుతమున్న సాగునీటి ప్రాజెక్టులైన నిజాంసాగర్, ఎస్సారెస్పీల పరిస్థితిని సీఎం సమీక్షించారు.
మిషన్ కాకతీయ ద్వారా ఎక్కువ చెరువులను పునరుద్ధరించాలన్నారు. పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టించే విషయంలోనూ జిల్లాలో పురోగతి కని పించాలని ఆదేశించారు. జిల్లాకు అవసరమైతే రెండు వేల ఇళ్లు అదనంగా కేటాయించడానికి సీఎం అంగీకారం తెలిపారు. కనీసం 50 ఇళ్లు ఒకేచోట ఉండేలా లే అవుట్ రూపొందించి డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టాలని సీఎం సూచిం చారు. గృహకల్ప ద్వారా గతంలో కట్టిన ఇళ్లలో చాలా తక్కువ సంఖ్యలో నివాసముంటున్నారని, వాటిని పూర్తి స్థాయిలో వినియోగించుకోవడానికి అవసరమైన విధానం రూపొందించాలని చెప్పారు. మహిళల పేరు మీదనే ఇళ్లు కేటాయించాలని ఆదేశించారు.