సహజ వనరుల కేంద్రం జయశంకర్ జిల్లా
శాసన సభాపతి మధుసూదనాచారి
భూపాలపల్లి : జయశంకర్ జిల్లా సహజ వనరులకేంద్రంగా విలసిల్లుతుందని శాసన సభాపతి సిరికొండ మధుసూదనాచారి అన్నారు. జిల్లా కార్యాలయా లు తాత్కాలికంగా ఏర్పాటు చేయనున్న సింగరేణి, ప్రభుత్వ భవనాలను జేసీ ప్రశాంత్‌జీవన్‌పాటిల్, సింగరేణి భూపాలపల్లి ఏరియా జీఎం పాలకుర్తి సత్తయ్యతో కలిసి గురువారం ఆయన పరిశీలించారు. పట్టణంలోని మంజూర్‌నగర్‌లో ఉన్న ఇందూ అతిథిగృహం, ప్రభుత్వ ఐటీఐ భవనం, సింగరేణి ఎంవీ టీసీ కార్యాలయం, దేవాదుల డేటాబేస్ సెంటర్‌ను పరిశీలించారు. ఇందూ అతిథిగృహంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.భూపాలపల్లి, మంథని, ములుగు నియోజకవర్గాలతో ఏర్పడబోతున్న జయశంకర్ జిల్లా తాత్కాలిక కార్యాలయాల ఏర్పాటు కోసం భవనాలు పరిశీలించినట్లు చెప్పారు. జిల్లా కార్యాలయాల ఏర్పాటుకు సహకరిస్తున్న సింగరేణి యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. చిట్యాల మండలం టేకుమట్ల గ్రామం 1987లోనే మండలంగా ఏర్పడాలని, అప్పుడు పట్టించుకోని వారు నేడు ఆరోపణలకు దిగడం సరికాదన్నారు. ములుగు ఆర్డీవో మహేందర్‌జీ, డ్వామా పీడీ వై.శేఖర్‌రెడ్డి, డీఆర్డీఏ పీడీ వెంకటేశ్వర్‌రెడ్డి, పరకాల డీఎస్పీ సుధీంద్ర, నగర పంచాయతీ చైర్పర్సన్ బండారి సంపూర్ణ, వైస్ చైర్మన్ ఎరుకల గణపతి, కౌన్సిలర్లు పిల్లలమర్రి నారాయణ, నిర్మల, భాస్కర్, వజ్రమణిబీబీచారి పాల్గొన్నారు.