బైక్ ఇంజిన్ పనిచేసేదిలా...
ఎక్కామా... కిక్కొట్టామా.. యాక్సిలరేటర్ రైజ్ చేశామా.. రయ్యిమని దూసుకెళ్లామా అదీ మనం నిత్యం చేసే పని.
కిక్ కొట్టగానే ఇంజిన్‌లో ఏమవుతుంది? మనల్ని ముందుకు తీసుకెళ్లేంత శక్తి అక్కడెలా పుడుతుంది? ఎప్పుడైనా ఆలోచించారా? చేతక్ స్కూటర్లకు దాదాపు కాలం చెల్లిపోయింది కాబట్టి వాటి సంగతి పక్కనబెడదాం.
ఇప్పుడు అందుబాటులో ఉన్న ఫోర్‌స్ట్రోక్ ఇంజిన్లు ఎలా పనిచేస్తాయో చూద్దాం...
పేరులో ఉన్నట్టుగానే ఈ ఇంజిన్లు స్థూలంగా నాలుగు దశల్లో పనిచేస్తాయి.
ఒక్కో దశ గురించి వివరంగా...
1. దీన్నే ఇండక్షన్ స్ట్రోక్ అని కూడా అంటారు. ఈ దశలో పైవైపు నుంచి ఇంధనం, గాలుల మిశ్రమం ఇంజిన్ ఛాంబర్ లోపలికి వస్తుంది. అదే సమయంలో పిస్టన్ కిందకు జారుతూ ఉంటుంది.
2. పిస్టన్ పైకి కదలడం మొదలవుతుంది. ఇంధనం సరఫరా చేసే వాల్వ్‌తోపాటు, బయటకు పంపే ఎగ్జాస్ట్ వాల్వ్ కూడా మూసుకునే ఉండటం వల్ల ఛాంబర్లో ఉండే అతితక్కువ స్థలంలోనే గాలి, ఇంధనాల మిశ్రమం కంప్రెస్ అవుతుంది. ఈ దశను కంప్రెషన్ స్ట్రోక్ అని కూడా అంటారు.
3. ఇగ్నీషన్ నుంచి వెలువడే స్పార్క్ గాలి, ఇంధనాల మిశ్రమాన్ని మండిస్తుంది. అప్పటికే బాగా ఒత్తిడితో ఉన్న ఈ మిశ్రమం ఒక్కసారిగా మండిపోతుంది. ఇన్లెట్, ఎగ్జాస్ట్ వాల్వ్‌లు రెండూ మూసుకునే ఉంటాయి. ఫలితంగా వెలువడే శక్తి పిస్టన్ను తద్వారా క్రాంక్‌షాఫ్ట్‌ను కదిలిస్తుంది. వాహనానికి శక్తినిచ్చే దశ కాబట్టి దీన్ని పవర్ స్ట్రోక్ అని కూడా అంటారు.
4. ఈ దశలో ఎగ్జాస్ట్ వాల్వ్ తెరుచుకోవడంతో అప్పటికే మండిపోయిన గాలి, ఇంధన మిశ్రమం తాలూకూ వాయువులు దీనిగుండా బయటకు వెళ్లిపోతాయి. పిస్టన్ కూడా పైవైపు ప్రయాణిస్తూ వాయువులన్నీ బయటకు వెళ్లిపోయేలా చేస్తుంది. ఈ దశను ఎగ్జాస్ట్ స్ట్రోక్ అని పిలుస్తారు.
ఈ 4 దశలు వెంటవెంటనే జరిగిపోతూ వాహనం ముందుకెళ్లేందుకు అవసరమైన శక్తిని అందిస్తాయన్నమాట.