The Indus Entrepreneurs
-
త్వరలో ‘టై’ అమరావతి చాప్టర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వ్యాపారవేత్తల సమాహారమైన ‘ద ఇండస్ ఎంట్రప్రెన్యూర్స్ (టై)’ అమరావతి చాప్టర్ త్వరలో కార్యరూపం దాల్చనుంది. ఎందియా పార్టనర్స్ ఎండీ సతీశ్ ఆండ్రా ప్రెసిడెంట్‌గా నవంబరులో ఈ చాప్టర్ లాంఛనంగా ప్రారంభమవుతుంది. వైజాగ్, తిరుపతి నగరాల్లో కూడా చాప్టర్లను ఏర్పాటు చేస్తామని టై బోర్డు సభ్యుడు, శ్రీనివాసా హేచరీస్ ఎండీ సురేశ్ చిట్టూరి బుధవారమిక్కడ మీడియాకు చెప్పారు. ఐటీ, ఫుడ్ ప్రాసెసింగ్, తయారీ, ఎంఎస్ఎంఈ రంగ కంపెనీలను టై అమరావతి ప్రోత్సహిస్తుందని చెప్పారు. ‘‘కళాశాలల స్థాయిలోనే ఎంట్రప్రెన్యూర్‌షిప్‌ను పెంపొందించేందుకు టాప్ కాలేజీలతో కలిసి పనిచేస్తాం. స్టార్టప్‌లకు ఆంధ్రా ఏంజెల్స్ నెట్వర్క్ నిధులు సమకూరుస్తుంది’’ అని సతీష్ ఆండ్రా వెల్లడించారు. వ్యాపార అవకాశాలు మెరుగు పరిచేందుకు మహిళా వ్యాపారవేత్తలకు చక్కని వేదికను రూపొందిస్తామని ఫాక్స్ మండల్ పార్టనర్ పూర్ణిమ కాంబ్లి తెలిపారు. -
బిజినెస్ బాయ్స్ అండ్ గర్ల్స్
వ్యాపారమా.. అది డబ్బున్నోళ్ల వ్యవహారం అనుకుంటారు అందరూ. అయితే చిట్టి బుర్రలో గట్టి ఆలోచనలు ఉంటాయని నిరూపించేందుకు సిద్ధమైంది ది ఇండస్ ఎంటర్‌ప్రెన్యూర్స్ (టీఐఈ) సంస్థ. ఒక్క ఐడియా నచ్చితే ఏకంగా 10 వేల అమెరికన్ డాలర్లు గెలుచుకునే అవకాశం. ఇందుకోసం జూబ్లీహిల్స్‌లోని రాక్వెల్ ఇంటర్నేషనల్ స్కూల్ వేదికగా ప్రత్యేక శిక్షణ కూడా ఇవ్వనున్నారు. ఏటా ప్రపంచ వ్యాప్తంగా వివిధ రకాల బిజినెస్ కాంపిటీషన్స్, శిక్షణ శిబిరాలను నిర్వహించే టీఐఈ సంస్థ ఈసారి హైదరాబాద్ వేదికగా సరికొత్త శిక్షణను తెరలేపింది. బిజినెస్ అంటే డబ్బులు సంపాదించడం కాదు.. ఉద్యోగాలు కల్పించడం కూడా. వ్యాపారం చేయాలంటే మనీ ఉంటే సరిపోదు.. అందుకు పక్కా ప్రణాళిక ఉండాలి. ఎంబీఏ, బీబీఎం వంటి కోర్సులు చదివిన వారు మాత్రమే బిజినెస్ చేస్తారనుకుంటే పొరపాటు. పట్టుమని పదిహేనేళ్లు కూడా నిండని కుర్రకారును కూడా బిజినెస్మెన్లుగా మార్చడమే ఈ ప్రోగ్రామ్ ఉద్దేశం. 9-12 ఏళ్ల లోపు వాళ్లకు మాత్రమే 9 నుంచి 12 ఏళ్ల మధ్య వయసు ఉన్న చిన్నారులు మాత్రమే ఈ శిక్షణకు అర్హులు. ఆసక్తి గలవారు ముందుగా https://hyderabad.tie.org వెబ్సైట్లో లాగిన్ కావాలి. వెంటనే టీఐఈ హైదరాబాద్ పేజీ ఓపెన్ అవుతుంది. ఇందులో టీఐఈ అనే ఆప్షన్‌ను క్లిక్ చేసి.. రిజిస్ట్రేషన్ ఫాంను పూర్తి చేయాలి. దరఖాస్తులు పంపించేందుకు ఈ నెల 17 చివరి తేదీ. ఈ శిక్షణకు కేవలం 40 మంది విద్యార్థులను మాత్రమే తీసుకుంటారు. ఈ నెల 24న ప్రారంభమయ్యే ట్రైనింగ్ ప్రోగ్రాం మొత్తం 16 వారాలు కొనసాగనుంది. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు శిక్షణ తరగతులు నిర్వహిస్తారు.. వ్యాపార మెలకువలు ఈ శిక్షణలో వ్యాపార మెలకువలు, అభివృద్ధి అవకాశాలు, నాయకత్వ లక్షణాలపై తరగతులు నిర్వహిస్తారు. ఏ పరిస్థితులకు ఎలాంటి వ్యాపారం చేయాలి.. ఆర్థిక సర్దుబాట్లు, బిజినెస్ లా, పేటెంట్ ఎలా తీసుకోవాలి, మార్కెటింగ్‌లో మెళకువలు వంటి బిజినెస్ రిలేటెడ్ అంశాలను క్షుణ్నంగా బోధిస్తారు. రెండో సెషన్లో ప్రాక్టికల్స్.. రెండో 8 వారాల ప్రోగ్రామ్‌లో టీఐఈ చాప్టర్లలోని పలు కంపెనీల యజమానులతో ప్రాక్టికల్ క్లాసులుంటాయి. ఇన్నోబాక్స్ ఫౌండర్ అండ్ సీఈఓ మురళీ కాకరాల , సేతుసర్వ్ ఫౌండర్ అండ్ సీఈఓ సంగారెడ్డి పేరిరెడ్డి, క్రాస్బోర్డర్స్ ఫౌండర్ అండ్ సీఈఓ సుబ్బరాజు పెరిచెర్ల, పరంపర ఫౌండర్ అండ్ సీఈఓ వెంకట్ వల్లభనేని వంటి వివిధ కంపెనీల అధికారులు మెంటర్స్గా ఈ ప్రోగ్రామ్‌లో పాల్గొంటున్నారు. ఒక్కో మెంటర్స్ ‘మై స్టోరీ’ పేరుతో ఆయన జీవితంలో ఎలా కష్టపడ్డాడు. బిజినెస్ ఆలోచన ఎలా వచ్చింది? ప్రస్తుతం ఏం చేస్తున్నాడు.. వంటి తన జీవితానుభవాలను చిన్నారులకు చెబుతారు. దీంతో పిల్లల్లో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. గెలిస్తే 10 వే ల డాలర్లు.. ప్రతి 5 మందిని కలిపి ఓ బృందంగా.. మొత్తం 8 బృందాలు చేస్తారు. 8 వారాలు ఓరల్ క్లాసులుంటాయి. ఆపై 8 వారాలు మెంటర్స్‌తో ప్రాక్టికల్స్ ఉంటాయి. మొదటి 8 వారాల క్లాసులు పూర్తయ్యే నాటికి ఒక్కో బృందం ఒక్కో బిజినెస్ ప్లాన్‌తో సిద్ధంగా ఉంటుంది. వీరితో మెంటర్స్ 8 వారాలు క్లాసులు తీసుకుంటారు. శిక్షణ పూర్తయిన తర్వాత డిసెంబర్లో పోటీలు నిర్వహిస్తారు. ఇందులో విజేతగా నిలిచిన బృందం ప్రపంచ బిజినెస్ పోటీల్లో పాల్గొంటుంది. ఈ బృందం 2015 జూన్ వరకు విదేశాల్లో ఉంటుంది. ఇక్కడా విజేతగా నిలిచిన బృందానికి 10 వేల డాలర్లు బహుమతిగా అందిస్తారు. - ఆడెపు శ్రీనాథ్ -
ఔత్సాహికుల కోసం టై సదస్సు
సాక్షి, హైదరాబాద్: ఇన్వెస్టర్లు, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ఒకచోట చేరుస్తూ అతిపెద్ద సదస్సు నిర్వహించడానికి ‘ద ఇండస్ ఎంటర్‌ప్రెన్యూర్స్(టై)’ సిద్ధమయింది. ఈ నెల 18 నుంచి 20 వరకు మూడు రోజుల పాటు హెచ్ఐసీసీలో జరిగే ఈ సదస్సులో ప్రముఖ వెంచర్ క్యాపిటలిస్టులు, ప్రైవేటు ఈక్విటీ ఫండ్లు, ఏంజెల్ ఇన్వెస్టర్లు పాల్గొంటారని టై హైదరాబాద్ చాప్టర్ అధ్యక్షుడు మురళి బుక్కపట్నం, టై సదస్సు కన్వీనర్ అనంతరావు తెలియజేశారు. ఈ వెంచర్ క్యాపిటలిస్టులలో హెలియాన్ వెంచర్ పార్ట్నర్, యాక్సెల్ పార్ట్నర్స్, లైట్‌స్పీడ్ వెంచర్ పార్ట్నర్స్, టీవీఎస్ క్యాపిటల్, కాలరి క్యాపిటల్, వెంచర్ఈస్ట్, పీపుల్ క్యాపిటల్, యునిలేజర్ వెంచర్స్, శ్రీ క్యాపిటల్, ఇండియన్ ఏంజిల్ నెట్వర్క్ తదితర సంస్థలున్నట్లు వారు తెలియజేశారు. వివిధ రంగాల్లో ఉన్న అవకాశాలను ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు, ఇన్వెస్టర్లు ఏకకాలంలో తెలుసుకోవటానికి ఈ సదస్సు ఉపయోగపడుతుందని వారు చెప్పారు. ‘‘ఆలోచనలు కంపెనీ ఏర్పాటు స్థాయికెళ్లాలి. కంపెనీ ఏర్పాటయ్యాక ఫండింగ్ రావాలి. ఫండింగ్ వచ్చాక విస్తరణ జరగాలి. ఆ తరవాత బయటపడాలి. అక్కడి నుంచి సీరియల్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎదగాలి. అన్నిటికన్నా ప్రధానమైనది, ఎక్కువ అడ్డంకులు ఎదురయ్యేది ఒక ఐడియాను కంపెనీగా మార్చడం, దానికి తగ్గ ఆర్థిక వనరులను సంపాదించడమే. ఈ ప్రక్రియను అర్థం చేసుకోవటమే ప్రధానంగా ఈ సదస్సు నిర్వహిస్తున్నాం’’ అని మురళి వివరించారు. కాగా, ఇన్వెస్టర్లు ఏ రంగాలపై ఆసక్తి చూపిస్తున్నారో కూడా అర్థం చేసుకోవచ్చని అనంతరావు తెలియజేశారు. నిజానికి సిలికాన్ వ్యాలీలో విజయపతాకం ఎగురవేసిన భారతీయ సంతతి వ్యాపారులు మరింత మందిని తమలా తీర్చిదిద్దేందుకు ఈ ై‘టె’ని ఏర్పాటు చేశారు. ప్రపంచవ్యాప్తంగా 17 దేశాల్లో 61 చాప్టర్లు, 15,000 మంది సభ్యులతో విస్తరించిన ఈ సంస్థకు భారత్‌లో 17 చాప్టర్లున్నాయి. తాజా సదస్సులో అపోలో గ్రూపు సంస్థల చైర్మన్ ప్రతాప్ సీ రెడ్డి, జీఎంఆర్ గ్రూప్ చైర్మన్ గ్రంధి మల్లికార్జునరావు, మైహోమ్ గ్రూప్ సంస్థల చైర్మన్ జే రామేశ్వరరావు, సినీ నిర్మాత రోనీ స్క్రూవాలా ప్రభృతులు పాల్గొంటారు. తాము ఎదుర్కొన్న ఆటుపోట్లను, అధిగమించిన తీరును వివరిస్తారు. సదస్సులో పాల్గొనాలనుకునేవారు http://www.tiesummit.com ద్వారా సంప్రతించవచ్చని నిర్వాహకులు చెప్పారు.