ఇండస్ ఎక్విప్మెంట్స్ కంపెనీలో పేలుడు
భువనగిరి, న్యూస్‌లైన్ : భువనగిరి పారి శ్రామిక వాడలోని ఇండస్ ఎక్విప్మెంట్స్ కంపెనీలో మంగళవారం ఉదయం పేలుడు సంభవించింది. మహిళా కార్మికులు చెత్తను డస్ట్‌బిన్‌తో పారబోసే సమయం లో లిక్విడ్‌కు రాపిడి కలిగి భారీ శబ్ధంతో పేలుడు జరిగింది. ఈ ప్రమాదంలో భువనగిరి మండలం వడపర్తికి చెందిన శైలజ, మన్నెవారిపంపుకు చెందిన ఉడుత అని తలు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో శైలజ పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. వెంటనే వైద్య చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. గత అక్టోబర్‌లో ఇదే ప్రాంతంలోని త్రిస్లా కంపెనీలో బాయిలర్ పేలిన సంఘటనలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది.
తాజా సంఘటనతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో ఉన్న కార్మికులు ఏం జరుగుతుందోనన్న భయంతో కంపెనీల్లోంచి బయటకు వచ్చారు. సుమారు 200 మీటర్ల పరిధిలో గల కంపెనీల కిటికీల అద్దాలు పగిలిపోయాయి. మంగళవారం కావడంతో పక్కనే గల ఎల్లమ్మగుడికి వచ్చిన భక్తులు సైతం పేలుడు శబ్ధంతో ఏం జరుగుతుందో తెలియక భయంతో వణికిపోయారు. పేలుడు సమాచారాన్ని స్థానిక పోలీసులకు అందించడంతో ఫైరింజన్‌తోపాటు పట్టణ పోలీ సులు సంఘటనాస్థలాన్ని సందర్శించి ప్రమాదాన్ని నివారించారు. కాగా కంపెనీలో బాయిలర్స్, టబ్స్ వంటి పరికరాలను తయారుచేసి ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తారు.
ఇందులో సుమారు 15 మంది కార్మికులు పనిచేస్తున్నారు. కంపెనీలో పనిచేసే కార్మికులకు హెల్మెట్స్, గ్లౌవ్స్, షూ, కంటి అద్దాలు వంటి రక్షణ పరికరాలను ఇవ్వకుండానే నిబంధనలకు విరుద్ధంగా ప్రమాదకరంగా పనిచేయిస్తున్నారని వెల్లడైంది. అయితే గత మూడు నెలలుగా కంపెనీ కార్మికులకు వేతనాలు ఇవ్వడం లేదని తెలుస్తోంది. కాగా సంఘటనాస్థలాన్ని భువనగిరి పట్టణ ఇన్స్పెక్టర్ మధుసూదన్‌రెడ్డి సందర్శించి విచారణ జరుపుతున్నారు.