industrial cluster
-
కొప్పర్తిలో విద్యుత్ ఉపకరణాల తయారీ జోన్.. 30,000 మందికి ఉపాధి
సాక్షి, అమరావతి: వైఎస్సార్ జిల్లా కొప్పర్తి వద్ద 225 ఎకరాల్లో విద్యుత్ ఉపకరణాల తయారీ జోన్ ఏర్పాటుకు ఏపీఐఐసీ కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిని పెంచడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం విద్యుత్ ఉపకరణాల తయారీ జోన్ ఏర్పాటుకోసం ఆసక్తిగల రాష్ట్రాల నుంచి బిడ్లను ఆహ్వానించింది. సుమారు రూ.445 కోట్ల పెట్టుబడితో 225 ఎకరాల్లో ఈ జోన్ అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వానికి పంపినట్లు ఏపీఐఐసీ వీసీ, ఎండీ నారాయణ భరత్‌గుప్తా ‘సాక్షి’కి వెల్లడించారు. నిజానికి.. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మన్నవరం వద్ద ఎన్టీపీసీ, బీహెచ్ఈఎల్ భాగస్వామ్యంతో విద్యుత్ ఉపకరణాల తయారీ యూనిట్‌కు 753.85 ఎకరాల భూమిని కేటాయించిన సంగతి తెలిసిందే. ఆయన మరణం తర్వాత ఈ ప్రాజెక్టును ఎవ్వరూ పట్టించుకోకపోవడం, మారిన రాజకీయ పరిస్థితులతో ఈ ప్రాజెక్టు ఆర్థికంగా ప్రయోజనం కాదంటూ రెండు సంస్థలు ఒప్పందం నుంచి వైదొలగడానికి సిద్ధపడ్డాయి. ఈ నేపథ్యంలో.. ప్రస్తుత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం గ్రీన్ఎనర్జీకి అత్యధిక ప్రాధాన్యతను ఇస్తుండటమే కాకుండా రూ.1.26 లక్షల కోట్లతో భారీ ఇంధన ప్రాజెక్టులను చేపట్టారు. ఈ అవకాశాలను వినియోగించుకుంటూ సౌర, పవన విద్యుత్ రంగాలకు చెందిన విద్యుత్ ఉపకరణాల తయారీ యూనిట్‌ను కొప్పర్తిలో ఏర్పాటుచేయడానికి ప్రతిపాదనలను పంపింది. మొత్తం రూ.445 కోట్ల అంచనా వ్యయంలో కేంద్ర ప్రభుత్వం రూ.400 కోట్లు భరిస్తే రాష్ట్ర ప్రభుత్వం రూ.45 కోట్లు వ్యయం చేస్తుంది. ఇతర రాష్ట్రాలతో పోటీపడుతూ ఈ జోన్‌ను సాధించుకునేందుకు నీరు, విద్యుత్‌ను చౌకగా అందించడమే కాకుండా అనేక రాయితీలను ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. 30,000 మందికి ఉపాధి ఇక ఈ తయారీ జోన్ రాష్ట్రానికొస్తే పెట్టుబడులు, ఉపాధితోపాటు కీలకమైన కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు కొప్పర్తిలో ఏర్పాటయ్యే అవకాశముందని అధికారులు తెలిపారు. విద్యుత్ ఉపకరణాల తయారీ రంగాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకం కింద సుమారు రూ.24,000 కోట్ల బడ్జెట్‌ను ఈ రంగానికి కేటాయించింది. కొప్పర్తిలో ఈ తయారీ రంగ జోన్ ద్వారా సుమారు రూ.3,500 కోట్ల పెట్టబడులు రావడంతోపాటు ప్రత్యక్షంగా 5,000 మందికి పరోక్షంగా 25,000 మందికి ఉపాధి లభిస్తుందని అంచనా వేస్తున్నారు. అలాగే, కేంద్ర ప్రభుత్వ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ విండ్ ఎనర్జీ, సెంటర్ పవర్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్లు ఇక్కడ ఏర్పాటయ్యే అవకాశముంది. ఇక్కడే 1,186 ఎకరాల్లో టెక్స్టైల్ పార్కు ప్రతిపాదనలను కూడా కేంద్రానికి పంపిన సంగతి తెలిసిందే. అలాగే, కాకినాడ వద్ద ఇప్పటికే బల్క్ డ్రగ్ పార్క్ సాధించుకున్న రాష్ట్రం ఈ రెండు పార్కులను ఇతర రాష్ట్రాలతో పోటీపడి చేజిక్కించుకుంటుందన్న ఆశాభావాన్ని అధికారులు వ్యక్తంచేస్తున్నారు. -
‘హురూన్’ సంపన్నుల్లో మనోళ్లు 69 మంది
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురూన్ ఇండియా సంపన్నుల జాబితా–2021లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి 69 మంది చోటు సంపాదించారు. వీరందరి సంపాదన రూ.3,79,200 కోట్లు. గతేడాదితో పోలిస్తే ఇది 54 శాతం వృద్ధి. కొత్తగా 13 మంది ఈ లిస్ట్‌లో చేరారు. మొత్తం జాబితాలో ఇద్దరు మహిళలు ఉన్నారు. అయితే ఔషధ తయారీ రంగం నుంచే 21 మంది ఉండడం విశేషం. రూ.1,000 కోట్లు, ఆపైన సంపద కలిగిన వ్యక్తులతో ఈ జాబితాను రూపొందించారు. వీరిలో హైదరాబాద్ నుంచి 56 మంది, రంగారెడ్డి నుంచి నలుగురు, విశాఖపట్నం నుంచి ముగ్గురు ఉన్నారు. సెపె్టంబర్ 15 నాటికి బిలియన్ డాలర్లకుపైగా సంపద కలిగిన వారి సంఖ్య ఏడాదిలో 9 నుంచి 15కు చేరింది. రూ.79,000 కోట్లతో దివీస్ ల్యా»ొరేటరీస్ వ్యవస్థాపకులు మురళి దివి, ఆయన కుటుంబం తొలి స్థానంలో నిలిచింది. పదేళ్ల క్రితం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురూన్ లిస్ట్‌లో ముగ్గురు మాత్రమే నమోదయ్యారు. ఈ ఏడాది జాబితాలో పేరు దక్కించుకున్న వారిలో మొదటి అయిదు స్థానాల్లో జి.అమరేందర్‌రెడ్డి, కుటుంబం, వెంకటేశ్వర్లు జాస్తి, కుటుంబం, ఏ.ప్రతాప్ రెడ్డి (బాలాజీ అమైన్స్), దాసరి ఉదయ్‌కుమార్ రెడ్డి (తాన్లా ప్లాట్‌ఫామ్స్), అనిల్ కుమార్ చలమలశెట్టి (గ్రీన్కో), మహేశ్ కొల్లి(గ్రీన్కో) ఉన్నారు. -
గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ లక్ష్యం అదే: కేటీఆర్
సాక్షి, యాదాద్రి : తెలంగాణ యువతకు ఉపాధి అవకాశాలే లక్ష్యంగా గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఆయన శుక్రవారం చౌటుప్పల్ మండలంలోని దండుమల్కాపురం ఇండస్ట్రియల్ పార్క్‌కు శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... పారిశ్రామిక విధానంలో టీఎస్ఐపాస్ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందన్నారు. దండుమల్కాపురంలోని గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ తెలంగాణకే కాకుండా దేశానికే ప్రత్యేక గుర్తింపు తెస్తుందన్నారు. పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం ఎంతగానో ప్రోత్సహిస్తోందని, ప్రభుత్వ నిర్ణయాలు, విధానాల మూలంగా పారిశ్రామికవేత్తలు పరిశ్రమలు స్థాపిం చేందుకు పెద్ద సంఖ్యలో ముందుకు వస్తున్నారన్నారు. కాలుష్యరహితమైన ఆరెంజ్, గ్రీన్ కేటగిరీ పరిశ్రమలు మాత్రమే ఈ పార్క్‌లో ఏర్పాటు కానున్నాయని, రసాయనిక, బల్క్‌డ్రగ్స్ పరిశ్రమలకు అవకాశం లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. వేలాది మందికి ఉపాధి అవకాశాలు పార్క్‌లో పరిశ్రమల ఏర్పాటుకు ప్లాట్లు కొనుగోలు చేసిన ఔత్సాహికులు రెండేళ్లలో నిర్మాణాలు పూర్తి చేసి వెంటనే ఉత్పత్తులను ప్రారంభించాలి. ఈ మేరకు ఇప్పటికే ఆయా కంపెనీల యాజమానులకు అగ్రిమెంట్లో నిబంధన విధించారు. ఈ పారిశ్రామిక వాడ ద్వారా ప్రత్యక్షంగా 19వేలు, పరోక్షంగా మరో 15వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. జిల్లాలోని పోచంపల్లి, చౌటుప్పల్, సంస్థాన్‌నారాయణపురం, రంగారెడ్డిజిల్లా అబ్దుల్లాపూర్‌మెట్, హయత్‌నగర్, ఇబ్రహీంపట్నం మండలాల ప్రజలకు ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి. ఉద్యోగులకు టౌన్షిప్, రెస్టారెంట్లు, డార్మెటరీ హాళ్లు, కమ్యూనిటీ హాళ్లు ఏర్పాటు కానున్నాయి. తద్వారా స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి. ఇక్కడ ప్రత్యేకంగా ఐటీఐ ఏర్పాటు చేసిన నిరుద్యోగులకు విద్యతోపాటు ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు. వృత్తి నైపుణ్యంతో కూడిన కార్మికులకు, నైపుణ్యం లేని కార్మికులకు లబ్ధి చేకూరనుంది. విజయవాడ – హైదరాబాద్ జాతీయహదారికి రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఏర్పాటవుతున్న ఈపార్క్‌కు.. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, సికింద్రాబాద్, హైదరాబాద్ రైల్వేస్టేషన్లు అందుబాటులో ఉన్నాయి. ఇదీ ప్రాజెక్టు స్వరూపం ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు 442 ఎకరాల భూమి కేటాయించారు. మొత్తం 450 యూనిట్లు రానున్నాయి. ఇందులో 40 యూనిట్లు మహిళలకు కేటాయించారు. రూ.1,553కోట్ల పెట్టుబడితో పార్క్ ఏర్పాటు చేస్తున్నారు. యూనిట్ సైజు 450 మీటర్ల నుంచి 5 ఎకరాల వరకు నిర్ణయించారు. ప్లాట్లు పొందిన వ్యక్తులు రెండేళ్లలో పరిశ్రమ నిర్మాణం పూర్తి చేసి ఉత్పత్తులను ప్రారంభించాల్సి ఉంటుంది. లేనిపక్షంలో ప్లాట్లను తిరిగి స్వాధీనం పరిశ్రమల ఏర్పాటుకు రూ.1,600కి గజం చొప్పున భూమి ధర నిర్ణయించారు. రెండేళ్ల క్రితమే ప్లాట్ల కేటాయింపులు పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు రూ.250కోట్ల నిధులు కేటాయించారు. ప్లాట్లు పొందిన వ్యక్తులకు బ్యాంకులు రుణాలు, సబ్సిడీ లభిస్తాయి. చిన్న, సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలు ఇక్కడ ఏర్పాటవుతాయి. ఎలక్ట్రికల్, డ్రిల్లింగ్, ప్లాస్టిక్, ప్యాకేజింగ్, ఇంజనీరింగ్, డిఫెన్స్ అండ్ ఎయిరోస్పేస్ వంటి కాలుష్య రహిత పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి. టీఎస్ఐపాస్తో జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సాహం టీఎస్ఐపాస్ –2014 నూతన పారిశ్రామిక విధా నం ద్వారా రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు ప్ర భుత్వం చేయూతనిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తక్కువ ధరకు భూమి, ప న్నుల్లో రాయితీ, పెట్టుబడుల్లో రాయితీ, ఎస్సీ, ఎస్టీ, మహిళ, దివ్యాంగులకు ప్రత్యేక రిజర్వేషన్ ల ద్వారా పరిశ్రమల ఏర్పాటుకు జిల్లా పరిశ్ర మల శాఖ ప్రోత్సహిస్తోంది. టీఎస్ఐపాస్ ద్వా రా గడిచిన మూడేళ్లలో జిల్లాలో 482 చిన్న, సూ క్ష్మ, మధ్యతరహా పరిశ్రమలకు అనుమతులు ఇచ్చారు. 2019 ఆగస్టు 31 వరకు రూ.4,559 కోట్ల వ్యయంతో ఏర్పాటైన ఆయా పరిశ్రమల్లో 17,618మందికి ఉపాధి లభిస్తోంది. అలాగే ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు టీఫ్రైడ్, టీఐడియా ద్వారా 231మంది లబ్ధిదారులకు పరిశ్రమల స్థాపన కోసం ప్రోత్సాహక పథకాలను అందించారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.5.51కోట్లు మంజూరు చేసింది. పరిశ్రమలు స్థాపించే జనరల్ కేటగిరీ వ్యక్తులకు 25శాతం, ఎస్సీ, ఎస్టీలకు 35 నుంచి 40శాతం, మహిళలకు అదనంగా 10 శాతం రాయితీ, పావలా వడ్డీ ఇస్తున్నారు. జిల్లాకు తరలిరానున్న మరో 300 పరిశ్రమలు హైదరాబాద్ జంటనగరాలనుంచి పరిశ్రమలను ఔటర్ రింగ్‌రోడ్డు బయటకు తరలించా లని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇది అమల్లోకి వస్తే మరో 300 వరకు పరిశ్రమలు జిల్లాకు రానున్నాయి. పరిశ్రమలు స్థాపించే వారికి సరసమైన ధరలకు భూముల కేటాయింపు, ఎలాంటి ఇబ్బందులు లేకుండా సింగిల్‌విండో విధానంతో అనుమతులు జారీ చేస్తారు. -
ఆన్లైన్లో ఇండస్ట్రియల్ స్పేర్ పార్ట్స్
♦ హైదరాబాద్‌లో స్పేర్ పార్ట్స్ ♦ జూన్‌లోగా గిడ్డంగుల ఏర్పాటు ♦ కంపెనీ కో-ఫౌండర్ దినేష్ అగర్వాల్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పరిశ్రమలకు అవసరమైన విడిభాగాలను ఆన్లైన్లో విక్రయిస్తున్న స్పేర్ఎన్పార్ట్స్.కామ్ హైదరాబాద్‌లో అడుగుపెట్టింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 350 మంది విక్రేతలతో చేతులు కలిపిన ఈ కంపెనీ.. ఇప్పుడు భాగ్యనగరిలో ఉన్న రిటైలర్లతో భాగస్వామ్యం కుదుర్చుకుంటోంది. దేశవ్యాప్తంగా ఉన్న టాప్ 200 ఇండస్ట్రియల్ క్లస్టర్లలో హైదరాబాద్ మొదటి 20 స్థానాల్లో ఉంటుందని గ్లోబల్ స్పేర్ఎన్పార్ట్స్ సహ వ్యవస్థాపకులు దినేష్ కుమార్ అగర్వాల్ సాక్షి బిజినెస్ బ్యూరోకు బుధవారం తెలిపారు. ఇక్కడ సిబ్బందిని నియమించడం ద్వారా దక్షిణాది మార్కెట్లో విస్తరిస్తామని చెప్పారు. దేశవ్యాప్తంగా కస్టమర్లకు 3-7 రోజుల్లో ఉత్పత్తులను డెలివరీ చేస్తున్నట్టు తెలిపారు. 100కుపైగా ప్రధాన బ్రాండ్ల ప్రొడక్టులను విక్రయిస్తున్నామని వివరించారు. 40 శాతం దాకా డిస్కౌంట్.. కంపెనీ మొత్తం 24 విభాగాల్లో 1 లక్షకుపైగా ఉత్పత్తులను అందుబాటులో ఉంచింది. సేఫ్టీ ప్రొడక్ట్స్, బేరింగ్స్, బెల్ట్స్, ఎలక్ట్రికల్స్ వంటివి వీటిలో ఉన్నాయి. ఏడాదిలో ఈ సంఖ్యను 10 లక్షలకు చేరుస్తామని దినేష్ వెల్లడించారు. 40 శాతం దాకా డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నట్టు తెలిపారు. ‘తక్కువ సమయంలో ప్రొడక్టుల డెలివరీ కోసం వచ్చే జూన్ కల్లా హైదరాబాద్‌సహా 20 ప్రధాన ఇండస్ట్రియల్ ఏరియాల్లో గిడ్డంగులను ఏర్పాటు చేస్తాం. ఇందుకు అవసరమైన నిధులను ప్రైవేటు ఈక్విటీ ద్వారా సమీకరిస్తాం. ఇండస్ట్రియల్ స్పేర్స్ మార్కెట్ 22 శాతం వార్షిక వృద్ధిరేటుతో భారత్‌లో రూ.2 లక్షల కోట్లుంది. అయిదేళ్లలో ఇది రెండింతలు కానుంది. మొత్తం మూడు కంపెనీలు ఆన్లైన్లో వీటిని విక్రయిస్తున్నాయి. ఆన్లైన్ వాటా కేవలం రూ.150 కోట్లు మాత్రమే’ అని వివరించారు. -
తెలంగాణలో కొరియా సంస్థల క్లస్టర్
స్థలం ఇచ్చేందుకు ప్రభుత్వం సంసిద్ధత హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్థానికంగా తయారీకి ఊతమిచ్చేలా దక్షిణ కొరియా సంస్థల పారిశ్రామిక క్లస్టర్ ఏర్పాటుకు కావాల్సిన స్థలాన్ని అందించాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. ఇటీవలే జరిగిన సమావేశంలో కొరియన్ బృందానికి ఈ మేరకు ప్రతిపాదన చేసింది. ఆయా సంస్థల సిబ్బందికి అవసరమైన ఆవాసాలు, పాఠశాలలు కూడా ఈ క్లస్టర్లో భాగంగా ఉంటాయని బుధవారమిక్కడ జరిగిన ‘కొరియా కారవాన్ 2016’ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా తెలంగాణ పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ చెప్పారు. తమ ప్రతిపాదనపై సానుకూలంగా ఉన్న కొరియా సంస్థలు.. అనువైన ప్రాంతాలను పరిశీలిస్తున్నాయని ఆయన తెలియజేశారు. మౌలిక సదుపాయాలపై ఎంవోయూ.. ద్వైపాక్షిక వాణిజ్య బంధాన్ని పటిష్టం చేసుకునే దిశగా తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టీఎస్ఐఐసీ), కొరియా ట్రేడ్-ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ ఏజెన్సీ (కోట్రా) అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నాయి. తయారీ రంగం, ఎలక్ట్రానిక్స్, మొబైల్స్, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ తదితర అంశాల్లో పరస్పర సహకారానికి ఈ అవగాహన ఒప్పందం తోడ్పడుతుందని అరవింద్ కుమార్ తెలిపారు.