తెలంగాణలో కొరియా సంస్థల క్లస్టర్
స్థలం ఇచ్చేందుకు ప్రభుత్వం సంసిద్ధత
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్థానికంగా తయారీకి ఊతమిచ్చేలా దక్షిణ కొరియా సంస్థల పారిశ్రామిక క్లస్టర్ ఏర్పాటుకు కావాల్సిన స్థలాన్ని అందించాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. ఇటీవలే జరిగిన సమావేశంలో కొరియన్ బృందానికి ఈ మేరకు ప్రతిపాదన చేసింది. ఆయా సంస్థల సిబ్బందికి అవసరమైన ఆవాసాలు, పాఠశాలలు కూడా ఈ క్లస్టర్‌లో భాగంగా ఉంటాయని బుధవారమిక్కడ జరిగిన ‘కొరియా కారవాన్ 2016’ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా తెలంగాణ పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ చెప్పారు. తమ ప్రతిపాదనపై సానుకూలంగా ఉన్న కొరియా సంస్థలు.. అనువైన ప్రాంతాలను పరిశీలిస్తున్నాయని ఆయన తెలియజేశారు.
మౌలిక సదుపాయాలపై ఎంవోయూ..
ద్వైపాక్షిక వాణిజ్య బంధాన్ని పటిష్టం చేసుకునే దిశగా తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టీఎస్‌ఐఐసీ), కొరియా ట్రేడ్-ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ ఏజెన్సీ (కోట్రా) అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నాయి. తయారీ రంగం, ఎలక్ట్రానిక్స్, మొబైల్స్, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ తదితర అంశాల్లో పరస్పర సహకారానికి ఈ అవగాహన ఒప్పందం తోడ్పడుతుందని అరవింద్ కుమార్ తెలిపారు.