15 రోజుల్లోనే పరిశ్రమలకు అనుమతులు
- భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు
- గగన్‌పహడ్‌లో మెట్రో క్యాష్ అండ్ క్యారీ ప్రారంభం
రాజేంద్రనగర్: తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు వచ్చే పారిశ్రామిక ఔత్సాహికులకు 15 రోజుల్లో అన్ని అనుమతులు ఇవ్వనున్నట్లు భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు వెల్లడించారు. పారిశ్రామిక అభివృద్ధిని దృష్టిలోపెట్టుకుని సీఎం కేసీఆర్ గత పదిహేను రోజుల్లోనే 17 పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేశారని గుర్తు చేశారు. మంగళవారం రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని ఎయిర్పోర్ట్ ప్రధాన రహదారిపై ఉన్న గగన్‌పహాడ్‌లో జర్మనీకి చెందిన మెట్రో క్యాష్ అండ్ క్యారీ మాల్‌ను శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా మెట్రో సంస్థవారు నగరంలో ఇప్పటికే మూడు మాల్స్‌ను ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. మరో షాపింగ్ మాల్ కోసం కూడా వీరు దరఖాస్తు చేసుకున్నారని, త్వరలోనే అన్ని అనుమతులను ఇవ్వనున్నట్లు తెలిపారు.
రానున్న మూడు నాలుగు నెలల్లో హైదరాబాద్‌లో ప్రతిరోజు మంచినీటి సరఫరా ఉంటుందని తెలిపారు. . ఇలాంటి షాపింగ్ మాల్స్ రావడం వల్ల స్థానికులకు ఉద్యోగాలు లభిస్తాయన్నారు. అదే విధంగా దినసరి అవసరాలకు సంబంధించిన అన్ని రకాల ఉత్పత్తులు ఒకే చోట లభిస్తాయని తెలిపారు. అంతకుముందు శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ మాట్లాడుతూ... ఇలాంటి షాపింగ్ మాల్స్ ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న శివారు ప్రాంతాలకు రావడం ఎంతో సంతోషకరమన్నారు. మెట్రో క్యాష్ అండ్ క్యారీ సీఈఓ రాజీవ్ మాట్లాడుతూ...ఈ షాపింగ్ మాల్స్ వల్ల చిరు వ్యాపారులు నష్ట పోతారన్న అపోహ నుంచి బయట పడాలని కోరారు. తమ సంస్థలో అధికశాతం మెంబర్ షిప్ కార్డులు చిరువ్యాపారులకు, కిరాణకొట్టుదారులకే కేటాయించామన్నారు. కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి,చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, స్థానిక టిడిపి ఎమ్మెల్యే టి.ప్రకాష్‌గౌడ్, మాజీ ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి, నియోజకవర్గ టీఆర్ఎస్ ఇన్చార్జి స్వర్ణలత భీమార్జున్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.