కుందేళ్లను గెంతనిస్తే అవార్డు!
జంతువులకు మనసుంటుంది. ఆ విషయం మనుషులకు తెలుసు. కానీ వాటి సహజ స్వభావాన్ని మరుగు పరచేలా.. దయలేకుండా వ్యవహరించటం పారిశ్రామిక వ్యవసాయ పద్ధతిలో చూసేదే. కానీ దానికి భిన్నంగా జైళ్లలో ఖైదీల్లా కిక్కిరిసిన ఇనుప పంజరాల్లో(కేజ్లలో) పెంచుతున్న కుందేళ్లకు సాంత్వన చేకూర్చేలా ఐరోపా దేశాల కూటమి తీసుకుంటున్న చర్యలు ఆనందాన్ని కలిగిస్తాయి. కుందేళ్ల పెంపకంలో మెరుగైన ప్రమాణాలు పాటించే వారికి ఈ ఏడాది నుంచి అవార్డ్లు ఇవ్వనున్నట్టు ఐరోపా దేశాల కూటమి ప్రకటించింది.
కేజ్ల్లో పెంచుతున్న కుందేళ్ల సంక్షేమానికి కృషిచేసే సంస్థలకు ఈ అవార్డ్ ఇస్తారు. ఐరోపాలో మాంసం కోసం పెంచుతున్న జంతువుల సంఖ్యలో కుందేళ్లది రెండో స్థానం. ప్రతి సంవత్సరం 12 లక్షల కుందేళ్లను ఆ దేశాల్లో మాంసం కోసం పెంచుతున్నారు. లెక్కకుమిక్కిలి ఉండే కుందేళ్లు కేజ్ల్లో కిక్కిరిసిన జీవితం గడుపుతాయి. తమ సహజ స్వభావానికి అనుగుణంగా చెంగు చెంగున ఉల్లాసంగా ఎగిరే అవకాశం లేదు.
ఇంత జరుగుతున్నా వీటి బాగోగుల కోసం ఉద్ధేశించిన శాసనాలేవీ అమల్లో లేవు. కానీ కుందేళ్ల దాణాను తయారుచేసే కంపెనీలు వీటి జీవన పరిస్థితులు మెరుగుచేసేందుకు నడుం బిగిస్తున్నాయి. ఇటువంటి చర్యలకు ప్రభుత్వ అవార్డ్లు కుందేళ్ల సంక్షేమానికి మరింత ఉత్సాహంతో పనిచేసేందుకు స్ఫూర్తినిస్తుందంటున్నారు జంతు ప్రేమికులు.