Industrial Training Institute
-
ఐటీఐ ట్రేడ్లకు ఆన్లైన్ పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: ఐటీఐ (ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్)లు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటున్నాయి. పారిశ్రామిక రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తున్న తరుణంలో పరిశ్రమల అవసరాలకు తగినట్లు నిపుణులను తయారు చేస్తున్నాయి. ప్రస్తుతం ప్రతి రంగంలోనూ కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరైంది. ఈ నేపథ్యంలో నైపుణ్య శిక్షణకు సాంకేతికతను జోడించాయి. పారిశ్రామిక శిక్షణ సంస్థల్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ)ని అమలు చేసేందుకు కార్మిక ఉపాధి కల్పన శాఖ నిర్ణయించింది. రాష్ట్రంలో 290 ఐటీఐలున్నాయి. వీటిలో ప్రభుత్వ ఐటీఐలు 65, ప్రైవేటు ఐటీఐలు 235 ఉన్నాయి. వీటి పరిధిలో 48,265 మంది అభ్యర్థులు వివిధ ట్రేడ్లలో శిక్షణ పొందుతున్నారు. ట్రేడ్ల వారీగా శిక్షణలు తీసుకుంటున్న విద్యార్థులకు ఆన్లైన్ పద్ధతిలో ప్రతిభను కనబర్చేందుకు సీబీటీ దోహదపడుతుందని ఆ శాఖ భావిస్తోంది. దీంతో ఈ ఏడాది జూన్‌లో జరిగే వార్షిక పరీక్షలను సీబీటీ పద్ధతిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ప్రతి కేటగిరీలో 50 ప్రశ్నలు.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఐటీఐలలో 31 ట్రేడ్లు ఉన్నాయి. వీటిలో 27 ట్రేడ్లలో మాత్రమే విద్యార్థులు ప్రవేశాలు పొందారు. వీరికి ఈ ఏడాది జూన్‌లో వార్షిక పరీక్షలు నిర్వహించనున్నారు. గతంలో మాన్యువల్ పద్ధతిలో ఈ పరీక్షలు నిర్వహించగా... ఈసారి ఆన్లైన్ పద్ధతిలో నిర్వహించనున్నారు. థియరీ, వర్క్‌షాప్ కాలి క్యులేషన్స్, ఎంప్లాయిబులిటీ స్కిల్స్ కేటగిరీలకు సీబీటీ పద్ధతిలో పరీక్షలు జరుగుతాయి. మిగతా పరీక్షలు మాత్రం ఆఫ్‌లైన్ పద్ధతిలో నిర్వహించనున్నారు. ప్రతి కేటగిరీలో 50 ప్రశ్నలుంటాయి. వీటికి ఒకదానివెంట ఒకటి సమాధానాలు ఇస్తూ పరీక్షను పూర్తి చేయాల్సి ఉంటుంది. పరీక్షల నిర్వహణకుగాను కేం ద్రాల్లో వసతులు కల్పించాలని కార్మిక ఉపాధి కల్పన శాఖ ఆదేశాలు జారీ చేసింది. విస్తృత అవగాహన వచ్చేలా... తొలిసారి ఆన్లైన్ పరీక్షలు నిర్వహిస్తున్న తరుణంలో విద్యార్థులు ఆందోళన చెందకుండా ఉండేలా అధికారులు చర్యలు చేపట్టారు. సీబీటీ పరీక్షలపై వారికి అవగాహన కార్యక్రమాలు పూర్తిచేసి విద్యార్థులను సన్నద్ధం చేయనున్నట్లు కార్మిక ఉపాధి కల్పన శాఖ సంచాలకులు కేవై నాయక్ ‘సాక్షి’తో అన్నారు. -
కొలువుల కోర్సులు @ ఐటీఐ
10క్లాస్ స్పెషల్ పదో తరగతి తర్వాత వృత్తి నైపుణ్యాలతోపాటు సత్వర ఉపాధి అందించగలిగే కోర్సు ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ (ఐటీఐ). ఈ కోర్సుల్లో రెండేళ్ల శిక్షణతో జాబ్ మార్కెట్‌కు అవసరమైన స్కిల్స్ సొంతమవుతారుు. ఈ నేపథ్యంలో ఐటీఐ కోర్సులపై ఫోకస్.. మన దేశంలో వచ్చే దశాబ్దంలో అదనంగా 80 లక్షల మంది ఉద్యోగ వేటలో ఉంటారని అంచనా. అయితే వృత్తి నైపుణ్యాలు తక్కువగా ఉంటే ఉద్యోగం దొరకడం కష్టం. స్కిల్స్ లేని మానవ వనరులకు డిమాండ్ తక్కువ ఉంటుందని నిపుణులు అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా విభిన్న నైపుణ్యాల్లో శిక్షణ ఇచ్చే అంశంపై ఐటీఐలు దృష్టి సారించాయి. కొద్దికాలంగా ఐటీఐ కోర్సుల పట్ల విద్యార్థులు మొగ్గుచూపుతున్నారు. కారణం కోర్సు పూర్తయిన వెంటనే ఉపాధి లభించడమే. జాబ్ లభించకుంటే సొంతంగా ఉపాధి పొందే వీలుంది. పదో తరగతి మార్కుల ఆధారంగా ఈ కోర్సుల్లో ప్రవేశం పొందొచ్చు. ఐటీఐ ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ ట్రేడ్స్ ఫిట్టర్, టర్నర్, మెషినిస్ట్, ఎలక్ట్రీషియన్, రేడియో- టెలివిజన్, డ్రాఫ్ట్స్‌మెన్ మెకానికల్, డ్రాఫ్ట్స్‌మెన్ సివిల్, రిఫ్రిజరేషన్ - ఎరుుర్ కండీషనింగ్, వైర్‌మెన్, మెకానిక్ మోటార్ వెహికల్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఎలక్ట్రోప్లాటర్, ఇన్‌స్ట్ట్రుమెంట్ మెకానిక్, అటెండెంట్ ఆపరేటర్, ల్యాబ్ అసిస్టెంట్, పెయింటర్, డీజిల్ మెకానిక్, ప్లంబర్, వెల్డర్, కార్పెంటర్, ప్లాస్టిక్ ప్రాసెసింగ్ ఆపరేటర్, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామ్ అసిస్టెంట్, ఫోర్జర్ అండ్ హీట్‌ట్రీటర్, మాసన్ (బిల్డింగ్ కనస్ట్రక్షన్) ఇంజనీరింగ్ ట్రేడ్సలో ఉన్నాయి. వీటిని రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేక ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు అందిస్తున్నాయి. నాన్ ఇంజనీరింగ్ ట్రేడ్సలో.. స్టెనోగ్రఫీ, సెక్రెటేరియల్ ప్రాక్టీస్, డ్రెస్మేకింగ్, కట్టింగ్ అండ్ టైలరింగ్, బుక్ బైండింగ్, హ్యాండ్ కంపోజర్, కార్పెట్ వేవింగ్ వంటి కోర్సులున్నాయి. ఇప్పుడు జాబ్ మార్కెట్ అవసరాలకనుగుణంగా అనేక కొత్త కోర్సులకు ఐటీఐలు రూపకల్పన చేస్తున్నాయి. సెంటర్స్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఐటీఐలను సెంటర్స్ ఆఫ్ ఎక్స్‌లెన్స్(సీఓఈ)లుగా రూపొందించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 2005లో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దేశవ్యాప్తంగా 500 ఐటీఐలను సీఓఈలుగా మార్చడం ఈ పథకం ప్రధాన లక్ష్యం. ఇందుకోసం పరిశ్రమలకు అవసరమైన విభిన్న నైపుణ్యాలతో 21 కోర్సులను రూపొందించారు. సంప్రదాయ కోర్సులకు భిన్నంగా వీటిలో శిక్షణ ఉంటుంది. ఉద్యోగావకాశాలెన్నో.. ఆర్టీసీ, ఇండియన్ రైల్వేస్, వివిధ పారిశ్రామిక సంస్థల్లో ఆయా విభాగాల్లో ఉద్యోగాలుంటాయి. ప్రారంభంలో నెలకు రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు అందుకోవచ్చు. -
ఐటీఐల బలోపేతంపై దృష్టి
♦ కొత్త కోర్సులు ప్రవేశపెట్టాలని కార్మికశాఖ నిర్ణయం ♦ సింగపూర్ తరహాలో తీర్చిదిద్దేందుకు ప్రణాళిక సాక్షి, హైదరాబాద్: పారిశ్రామిక శిక్షణ సంస్థ (ఐటీఐ)లను మరింత బలోపేతం చేసే దిశగా కార్మికశాఖ ప్రణాళికలు రూపొందిస్తోంది. పరిశ్రమల అవసరాలకు తగ్గట్లుగా మానవ వనరులను తయారు చేసి, యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలను పెంపొందించడం కోసం పలు చర్యలు చేపట్టింది. తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ (టామ్‌కామ్) ద్వారా విదేశాలలో ఉద్యోగ అవకాశాల కల్పనకు మంచి స్పందన లభించడంతో ఐటీఐ కాలేజీలను బలోపేతం చేయాలని కార్మికశాఖ నిర్ణయించింది. కార్మిక, హోంశాఖల మంత్రి నాయిని నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో దుబాయ్‌లో జరిపిన పర్యటన ద్వారా టామ్‌కామ్ దాదాపు 1150 మందికి ఉద్యోగ అవకాశాల కోసం విదేశీ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. త్వరలో పదివేల మందికి ఉద్యోగ అవకాశాల కల్పనకు కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఐటీఐలను నైపుణ్య కేంద్రాలుగా మార్చాలని కార్మికశాఖ నిర్ణయించింది. అందుకు అనుగుణంగా శిక్షణ విధానంలో మార్పులు తీసుకురావడంతోపాటు కొత్త కోర్సులను ప్రవేశపెట్టాలని భావిస్తోంది. ఇప్పుడు అందిస్తున్న కోర్సులకు అదనంగా మార్కెట్లో డిమాండ్ ఉన్న ఇంటీరియర్ డిజైన్, బ్యూటీషియన్ వంటి కోర్సులు ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. అలాగే కాలేజీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్ద పీట వేస్తూ, నూతన యంత్ర సామాగ్రి కొనుగోలు చేయాలని కార్మికశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. సింగపూర్‌లో కొనసాగుతున్న పారిశ్రామిక శిక్షణ సంస్థల తరహాలో రాష్ట్రంలోని ఐటీఐలను తీర్చిదిద్దాలని యోచిస్తోంది. అందుకోసం ఈ ఏడాది మొదటి ప్రయత్నంలో భాగంగా రూ.350 కోట్లు విడుదల చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. -
నైపుణ్యం నాస్తి
సాక్షి, మంచిర్యాల : నిరుద్యోగ యువతలో నైరాశ్యం పెరుగుతోంది. జిల్లాలో వృత్తి విద్య కాలేజీల్లో చదివి కొలువుల వేటలో ఉన్నవారికి నిరాశే మిగులుతోంది. తాము చదివిన చదువుకు పోటీ ప్రపంచంలో ఉద్యోగాలు రాక అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా యు వ ఇంజినీర్లు మానసిక వేదనకు గురవుతున్నారు. జిల్లాయేతర కార్పొరేట్ కాలేజీల్లో చదివిన విద్యార్థుల్లో నైపుణ్యం ఉండటంతో హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబయి వంటి నగరాల్లో ఉపాధి అవకాశాలు లభిస్తున్నా యి. కానీ మన జిల్లాలో కనీస విద్యా ప్రమాణాలు లేకపోవడం, ఉపాధి కోసం ఏ కంపెనీకి వెళ్లినా నైపుణ్యం, సీనియార్టీ తప్పనిసరనే నిబంధన ఉండడంతో జిల్లాకు చెందిన నిరుద్యోగులు కొలువులు సాధించలేక పోతున్నారు. దీంతో కొందరు సీనియార్టీ కోసం చిన్న కంపెనీల్లో అతి తక్కువ వేతనాలతో పని చేస్తున్నారు. చివర కు గల్ఫ్ దేశాలకు వెళ్లాలని ఉన్నా.. వృ త్తి విద్యా కోర్సులతోపాటు వివిధ రకాల కంప్యూటర్ కోర్సు సర్టిఫికెట్లు తప్పనిసరి అయ్యాయి. దీంతో జిల్లాకు చెందిన కొందరు యువకులు ఆ కోర్సుల కోసం హైదరాబాద్‌లో మకాం వేశారు. ప్రస్తుతం వృత్తి విద్యా కోర్సులు చేసిన వారు అధికంగా ఉండటం, కంపెనీల ఏర్పాటు లేకపోవడతో ఉపాధి అవకాశాలు లభించడం లేదు. కాగా, ఏటా జిల్లాలోని వృత్తి విద్యా కాలేజీల్లో వేలాది మంది వివిధ కోర్సులు పూర్తి చేస్తున్నారు. బీటెక్, ఎంబీఏ పూర్తి చేసిన వాళ్లు మల్టీనేషన్ కంపెనీల వైపు.. పాలిటెక్నిక్, ఐటీఐ, సంబంధిత కోర్సులు చదివిన విద్యార్థులు పరిశ్రమలు.. నర్సింగ్, ఎంఎల్టీ కోర్సులు చేసిన వారు ఆస్పత్రుల వైపు.. బీఈడీ, డీఎడ్ చదివిన వారు స్కూళ్లలో బోధకులుగా మారుతున్నారు. వీరికి ఉద్యోగాన్వేషణ కోసం ఎక్కడికి వె ళ్లినా చుక్కెదురవుతోంది. విద్యాప్రమాణాలు హుష్‌కాకి జిల్లాలోని కళాశాలల్లో విద్యా ప్రమాణాలు అంతంత మాత్రంగా ఉండడంతో ఆయా రంగాల్లో నైపుణ్యత లేక విద్యార్థులు కంపెనీల్లో ఉద్యోగాలకు అర్హత సాధించలేకపోతున్నారు. ఇంజినీరింగ్ కాలేజీల్లో అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ కొరత ఉంది. పూర్వ విద్యార్థులే ఆయా కాలేజీల్లో ప్రొఫెసర్లుగా వ్యవహరిస్తున్నారు. అనుభవజ్ఞులను తీసుకుంటే ఎక్కువ వేతనాలు ఇవ్వాల్సి వస్తోందని యాజమాన్యాలు తమ కాలేజీల్లో చదివిన విద్యార్థులనే బోధకులుగా నియమించుకుంటున్నారు. కొన్ని బ్రాంచీల్లో ఆధునాతక ల్యాబ్‌లు లేవు. ఇంకొన్ని బ్రాంచీలకు అసలు ల్యాబ్‌లు లేక విద్యార్థులు మౌఖిక బోధన తోనే చదువులు ముగించేస్తున్నారు. ప్రయోగాలు లేక, పరిశోధనాత్మక విద్య అందక విద్యార్థులు చదువులు ముగించేస్తున్నారు. విద్యా ప్రమాణాలు నామమాత్రంగా ఉండడం.. సీనియార్టీ లేకపోవడంతో ఇంజినీరింగ్, ఎంబీఏ చదివిన విద్యార్థులు కనీసం గల్ఫ్‌కు వెళ్లాలన్నా వెళ్లలేకపోతున్నారు. దీంతో కష్టపడి చదివిన చదువుతోపాటు పలు కంప్యూటర్ కోర్సులు పూర్తి చేసుకుని బయటి దేశాలకు వెళ్తున్నారు. కేవలం మంచిర్యాలలోనే సుమారు 40 మంది ఇంజినీరింగ్ విద్యార్థులు గత విద్యా సంవత్సరం చదువులు ముగించుకుని హైదరాబాద్‌లో వివిధ కోర్సులు చేస్తున్నారు. ఇటు పారమెడికల్ కాలేజీల్లోనూ ఇలాంటి పరిస్థితే ఉంది. కాలేజీల్లో ప్రయోగశాలల పరిస్థితి అధ్వానంగా ఉంది. వారంలో కనీసం ఒక సారైనా ల్యాబ్ నిర్వహించాల్సి ఉన్నా.. పలు పారమెడికల్ కాలేజీ యాజమాన్యాలు నెలకోసారి నిర్వహించి చేతులు దులుపుకుంటున్నాయి. తీరా చదువు ముగించుకుని ఏడాదిపాటు శిక్షణకాలం కోసం ఆస్పత్రులు, ల్యాబ్‌లకు వెళ్లిన పారామెడికల్ సిబ్బంది కనీస పరిజ్ఞానం లేక ఇబ్బందులు పడుతున్నారు. ఇండస్ట్రీయల్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ (ఐటీఐ) కాలేజీల్లోనూ అనుభవజ్ఞులైన ఇన్స్ట్రక్టర్లు లేరు. దీంతో చాలా చోట్ల విద్యార్థులు కాలేజీల వైపు కన్నెత్తి చూడడం లేదు. పాస్ అయితే చాలు అనే ఉద్దేశంతో పరీక్షల సమయంలో మాత్రమే హాజరవుతున్నారు. ఇదే పరిజ్ఞానంతో అప్రంటీస్ (శిక్షణ) కోసం పరిశ్రమల్లో వెళ్లిన అభ్యర్థులను తీసుకునేందుకు యాజమాన్యాలు ఇష్టపడడం లేదు. ఒకవేళ తీసుకున్నా.. వారి కోర్సులకు తగట్టు శిక్షణ ఇవ్వడం లేదు. దీంతో అప్రంటీస్ సర్టిఫికెట్ ఉన్నా.. నైపుణ్యం లేక కంపెనీల్లో ఉద్యోగాలకు అనర్హులవుతున్నారు.