ఐటీఐ ట్రేడ్‌లకు ఆన్‌లైన్‌ పరీక్షలు  | Online Exams For ITI Candidates In Telangana | Sakshi
Sakshi News home page

ఐటీఐ ట్రేడ్‌లకు ఆన్‌లైన్‌ పరీక్షలు 

Published Mon, Feb 25 2019 4:26 AM | Last Updated on Mon, Feb 25 2019 4:26 AM

Online Exams For ITI Candidates In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఐటీఐ (ఇండస్ట్రియల్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌)లు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటున్నాయి. పారిశ్రామిక రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తున్న తరుణంలో పరిశ్రమల అవసరాలకు తగినట్లు నిపుణులను తయారు చేస్తున్నాయి. ప్రస్తుతం ప్రతి రంగంలోనూ కంప్యూటర్‌ పరిజ్ఞానం తప్పనిసరైంది. ఈ నేపథ్యంలో నైపుణ్య శిక్షణకు సాంకేతికతను జోడించాయి. పారిశ్రామిక శిక్షణ సంస్థల్లో కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (సీబీటీ)ని అమలు చేసేందుకు కార్మిక ఉపాధి కల్పన శాఖ నిర్ణయించింది. రాష్ట్రంలో 290 ఐటీఐలున్నాయి. వీటిలో ప్రభుత్వ ఐటీఐలు 65, ప్రైవేటు ఐటీఐలు 235 ఉన్నాయి. వీటి పరిధిలో 48,265 మంది అభ్యర్థులు వివిధ ట్రేడ్లలో శిక్షణ పొందుతున్నారు. ట్రేడ్‌ల వారీగా శిక్షణలు తీసుకుంటున్న విద్యార్థులకు ఆన్‌లైన్‌ పద్ధతిలో ప్రతిభను కనబర్చేందుకు సీబీటీ దోహదపడుతుందని ఆ శాఖ భావిస్తోంది. దీంతో ఈ ఏడాది జూన్‌లో జరిగే వార్షిక పరీక్షలను సీబీటీ పద్ధతిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. 

ప్రతి కేటగిరీలో 50 ప్రశ్నలు.. 
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఐటీఐలలో 31 ట్రేడ్‌లు ఉన్నాయి. వీటిలో 27 ట్రేడ్‌లలో మాత్రమే విద్యార్థులు ప్రవేశాలు పొందారు. వీరికి ఈ ఏడాది జూన్‌లో వార్షిక పరీక్షలు నిర్వహించనున్నారు. గతంలో మాన్యువల్‌ పద్ధతిలో ఈ పరీక్షలు నిర్వహించగా... ఈసారి ఆన్‌లైన్‌ పద్ధతిలో నిర్వహించనున్నారు. థియరీ, వర్క్‌షాప్‌ కాలి క్యులేషన్స్, ఎంప్లాయిబులిటీ స్కిల్స్‌ కేటగిరీలకు సీబీటీ పద్ధతిలో పరీక్షలు జరుగుతాయి. మిగతా పరీక్షలు మాత్రం ఆఫ్‌లైన్‌ పద్ధతిలో నిర్వహించనున్నారు. ప్రతి కేటగిరీలో 50 ప్రశ్నలుంటాయి. వీటికి ఒకదానివెంట ఒకటి సమాధానాలు ఇస్తూ పరీక్షను పూర్తి చేయాల్సి ఉంటుంది. పరీక్షల నిర్వహణకుగాను కేం ద్రాల్లో వసతులు కల్పించాలని కార్మిక ఉపాధి కల్పన శాఖ ఆదేశాలు జారీ చేసింది. 

విస్తృత అవగాహన వచ్చేలా... 
తొలిసారి ఆన్‌లైన్‌ పరీక్షలు నిర్వహిస్తున్న తరుణంలో విద్యార్థులు ఆందోళన చెందకుండా ఉండేలా అధికారులు చర్యలు చేపట్టారు. సీబీటీ పరీక్షలపై వారికి అవగాహన కార్యక్రమాలు పూర్తిచేసి విద్యార్థులను సన్నద్ధం చేయనున్నట్లు కార్మిక ఉపాధి కల్పన శాఖ సంచాలకులు కేవై నాయక్‌ ‘సాక్షి’తో అన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement