సాక్షి, హైదరాబాద్/ సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: గురుకుల విద్యా సంస్థల్లో ఉద్యోగాలకు సంబంధించిన అర్హత పరీక్షలు మంగళవారం ప్రారంభమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 9వేల ఉద్యోగాల భర్తీకి ఈనెల 1వ తేదీ నుంచి 23వ తేదీ వరకు పరీక్షల షెడ్యూల్‌ను తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు (టీఆర్‌ఈఐఆర్‌బీ) ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా మంగళవారం జరిగిన తొలి రోజు పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా టీఆర్‌ఈఐఆర్‌బీ అధికారులు పక్కాగా ఏర్పాటు చేశారు.
గురుకుల ఉద్యోగాల భర్తీలో ఈసారి కొత్తగా కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ (సీబీఆర్‌టీ) విధానంలో పరీక్షలు నిర్వహించారు. గురుకుల బోర్డు ద్వారా నిర్వహిస్తున్న మొట్టమొదటి సీబీఆర్‌టీ పరీక్షలను టీఆర్‌ఈఐఆర్‌బీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏర్పాట్లు చేయడంతో పరీక్షలు తొలిరోజు సజావుగా సాగాయి. రాష్ట్రవ్యాప్తంగా 104 కేంద్రాల్లో పరీక్షలు ప్రారంభం కాగా మొదటి రోజున మూడు సెషన్లలో సగటున 86.54 శాతం అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు. మొదటి రోజున మూడు సెషన్లలో ఆర్ట్ టీచర్ పేపర్–1, క్రాఫ్ట్ టీచర్ పేపర్–1, మ్యూజిక్ టీచర్ పేపర్–1 పరీక్షలు జరిగాయి. ఈ మూడు పరీక్షలకు మొత్తంగా 10,920 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా... కేవలం 9,450 మంది మాత్రమే హాజరయ్యారు.
ప్రశ్నపత్రం ఆంగ్లంలో ఇచ్చారని ఆందోళన
మంగళవారం ప్రారంభమైన పోటీ పరీక్షల్లో మొదటిరోజు ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ విభాగాలకు పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల ప్రశ్నపత్రం పూర్తిగా ఆంగ్లంలో మాత్రమే ఇచ్చారు. నోటిఫికేషన్‌లో మాత్రం తెలుగు, ఆంగ్లంలో ప్రశ్నపత్రం ఇస్తామని ప్రకటించారని, ఇప్పుడు ఇలా చేయడమేమిటని పలుచోట్ల అభ్యర్థులు నిరసన వ్యక్తం చేశారు. పైగా సరిపడా కంప్యూటర్లు లేకుండానే ఆఫ్‌లైన్‌కు బదులు ఆన్‌లైన్ విధానంలో పరీక్షలు పెట్టడమేమిటని ప్రశ్నించారు. ఈ విషయాలపై తాము కోర్టుకు వెళ్లనున్నట్లు అభ్యర్థులు పేర్కొన్నారు.
పరీక్ష కేంద్రాల కేటాయింపుపై గందరగోళం..
ఆప్షన్ ఇచ్చిన జిల్లా, చుట్టుపక్కల జిల్లాలు కాకుండా 200 నుంచి 300 కిలోమీటర్ల దూరంలో పరీక్ష కేంద్రాలు కేటాయించడం పట్ల అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో మహిళా, గర్భిణి, బాలింత అభ్యర్థులు పరీక్షలను రాయలేని పరిస్థితి నెలకొంది. ఇతర అభ్యర్థులు సైతం వేల రూపాయలు చార్జీలకోసం వెచ్చించాల్సిన పరిస్థితి నెలకొంది. కొందరు అభ్యర్థులు డిగ్రీ లెక్చరర్, జూనియర్ లెక్చరర్, పీజీటీ, టీజీటీ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారు. వీటికి పేపర్–1, పేపర్–2, పేపర్–3 రాయాల్సి ఉంటుంది. ఈ పరీక్షలకు సైతం ఒక్కో పరీక్షను ఒక్కో జిల్లాలో వందల కిలోమీటర్ల దూరం వెళ్లి రాయాల్సిన విధంగా కేంద్రాలు ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment