computer based test
-
ఉన్నత విద్య ఎంట్రన్స్లకే ఎన్టీఏ పరిమితం
న్యూఢిల్లీ: 2025 నుంచి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)ని ఉద్యోగ ఎంపిక పరీక్షల నిర్వహణ బాధ్య తల నుంచి తప్పిస్తున్నట్లు కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. కేవలం ఉన్నత విద్యా ప్రవేశ పరీక్షలను మాత్రమే ఎన్టీఏ ఇకపై నిర్వహిస్తుందన్నారు. వచ్చే ఏడాదిలో ఈ మేరకు ఎన్టీఏను పునర్వ్యవస్థీకరించి, అవసరమైన కొత్త పోస్టులను సృష్టిస్తామని చెప్పారు. అంతేకాకుండా, నీట్‌ను సంప్రదాయ పెన్, పేపర్ విధానం బదులుగా కంప్యూటర్ ఆధారిత పరీక్ష(సీబీటీ)గా చేపట్టేందుకు ఆరోగ్య శాఖతో సంప్రదింపులు జరుపుతున్నామని మంత్రి ప్రధాన్ మంగళవారం మీడియాకు చెప్పారు. వైద్య కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే నీట్ సహా పలు పరీక్షా పత్రాల లీకేజీలు, రద్దు వంటి పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ ఇచ్చిన సిఫారసుల ఆధారంగా పునర్వ్యవస్థీకరణకు పలు చర్యలు తీసుకుంటోంది. కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (క్యూయెట్– యూజీ)ను ఇకపైనా ఏడాదిలో ఒక్క పర్యాయం మాత్రమే నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ప్రస్తుతానికి ఎన్టీఏను ప్రవేశ పరీక్షల బాధ్యతలను మాత్రమే అప్పగించాలి. దాని సామర్థాన్ని పెంచిన తర్వాత ఇతర పరీక్షల బాధ్యతలను అప్పగించే విషయం ఆలోచించాలి’అని ఇస్రో మాజీ చీఫ్ ఆర్. రాధాకృష్ణన్ సారథ్యంలోని కమిటీ సిఫారసు చేసింది. సంబంధిత కోర్సులో జాయినయ్యే విద్యార్థి మాత్రమే ఆన్లైన్ పరీక్ష రాసేలా డిజి–యాత్ర మాదిరిగానే డిజి–ఎగ్జామ్ విధానాన్ని తీసుకురావాలని కమిటీ పేర్కొంది. ఇందుకోసం, ఆధార్, బయో మెట్రిక్‌తోపాటు ఏఐ ఆధారిత డేటా అనలిటిక్స్‌ను వినియోగించుకోవాలని సూచించింది. పరీక్షల నిర్వహణ, భద్రత, నిఘా, సాంకేతికత వంటి అంశాలకు సంబంధించి డైరెక్టర్ స్థాయిలో 10 సిఫారసులను చేసిందిఎన్సీఈఆర్టీ పాఠ్య పుస్తకాల ధర తగ్గింపు2025 నుంచి ఎన్సీఈఆర్టీ పాఠ్య పుస్తకాల ధరలను తగ్గించనున్నట్లు మంత్రి ప్రధాన్ వివరించారు. ప్రస్తుతం ఏడాదికి 5 కోట్ల టెక్ట్స్ బుక్స్‌ను మాత్రమే ప్రచురిస్తున్నారన్నారు. 2025 నుంచి ముద్రణ సామర్థ్యాన్ని 15 కోట్లకు పెంచుతామని, నాణ్యమైన పుస్తకాలను అందిస్తామని ప్రక టించారు. పాఠ్య పుస్తకాల ధరలను పెంచి, విద్యా ర్థుల తల్లిదండ్రులపై భారం పెంచబోమన్నారు. మారిన సిలబస్ ప్రకారం 2026–27 నుంచి 9 నుంచి 12వ తరగతి వరకు కొత్త పాఠ్య పుస్తకాలను అందుబాటులోకి తెస్తామని మంత్రి వెల్లడించారు. -
గురుకుల పరీక్షలకు 86.54 శాతం హాజరు
సాక్షి, హైదరాబాద్/ సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: గురుకుల విద్యా సంస్థల్లో ఉద్యోగాలకు సంబంధించిన అర్హత పరీక్షలు మంగళవారం ప్రారంభమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 9వేల ఉద్యోగాల భర్తీకి ఈనెల 1వ తేదీ నుంచి 23వ తేదీ వరకు పరీక్షల షెడ్యూల్‌ను తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు (టీఆర్‌ఈఐఆర్‌బీ) ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా మంగళవారం జరిగిన తొలి రోజు పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా టీఆర్‌ఈఐఆర్‌బీ అధికారులు పక్కాగా ఏర్పాటు చేశారు. గురుకుల ఉద్యోగాల భర్తీలో ఈసారి కొత్తగా కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ (సీబీఆర్టీ) విధానంలో పరీక్షలు నిర్వహించారు. గురుకుల బోర్డు ద్వారా నిర్వహిస్తున్న మొట్టమొదటి సీబీఆర్టీ పరీక్షలను టీఆర్‌ఈఐఆర్‌బీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏర్పాట్లు చేయడంతో పరీక్షలు తొలిరోజు సజావుగా సాగాయి. రాష్ట్రవ్యాప్తంగా 104 కేంద్రాల్లో పరీక్షలు ప్రారంభం కాగా మొదటి రోజున మూడు సెషన్లలో సగటున 86.54 శాతం అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు. మొదటి రోజున మూడు సెషన్లలో ఆర్ట్ టీచర్ పేపర్–1, క్రాఫ్ట్ టీచర్ పేపర్–1, మ్యూజిక్ టీచర్ పేపర్–1 పరీక్షలు జరిగాయి. ఈ మూడు పరీక్షలకు మొత్తంగా 10,920 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా... కేవలం 9,450 మంది మాత్రమే హాజరయ్యారు. ప్రశ్నపత్రం ఆంగ్లంలో ఇచ్చారని ఆందోళన మంగళవారం ప్రారంభమైన పోటీ పరీక్షల్లో మొదటిరోజు ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ విభాగాలకు పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల ప్రశ్నపత్రం పూర్తిగా ఆంగ్లంలో మాత్రమే ఇచ్చారు. నోటిఫికేషన్లో మాత్రం తెలుగు, ఆంగ్లంలో ప్రశ్నపత్రం ఇస్తామని ప్రకటించారని, ఇప్పుడు ఇలా చేయడమేమిటని పలుచోట్ల అభ్యర్థులు నిరసన వ్యక్తం చేశారు. పైగా సరిపడా కంప్యూటర్లు లేకుండానే ఆఫ్‌లైన్‌కు బదులు ఆన్లైన్ విధానంలో పరీక్షలు పెట్టడమేమిటని ప్రశ్నించారు. ఈ విషయాలపై తాము కోర్టుకు వెళ్లనున్నట్లు అభ్యర్థులు పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాల కేటాయింపుపై గందరగోళం.. ఆప్షన్ ఇచ్చిన జిల్లా, చుట్టుపక్కల జిల్లాలు కాకుండా 200 నుంచి 300 కిలోమీటర్ల దూరంలో పరీక్ష కేంద్రాలు కేటాయించడం పట్ల అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో మహిళా, గర్భిణి, బాలింత అభ్యర్థులు పరీక్షలను రాయలేని పరిస్థితి నెలకొంది. ఇతర అభ్యర్థులు సైతం వేల రూపాయలు చార్జీలకోసం వెచ్చించాల్సిన పరిస్థితి నెలకొంది. కొందరు అభ్యర్థులు డిగ్రీ లెక్చరర్, జూనియర్ లెక్చరర్, పీజీటీ, టీజీటీ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారు. వీటికి పేపర్–1, పేపర్–2, పేపర్–3 రాయాల్సి ఉంటుంది. ఈ పరీక్షలకు సైతం ఒక్కో పరీక్షను ఒక్కో జిల్లాలో వందల కిలోమీటర్ల దూరం వెళ్లి రాయాల్సిన విధంగా కేంద్రాలు ఇచ్చారు. -
కొలువుల అర్హత పరీక్షల షెడ్యూల్ ఖరారు
సాక్షి, హైదరాబాద్: పలు ఉద్యోగ నియామకాల అర్హత తేదీలను తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్విస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ఖరారుచేసింది. ఇంటర్మీడియట్ విద్య కమిషనరేట్ పరిధిలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో జూనియర్ లెక్చరర్ ఉద్యోగ అర్హత పరీక్షలను సెప్టెంబర్ 12 నుంచి సబ్జెక్టుల వారీగా నిర్వహించనున్నట్లు స్పష్టంచేసింది. అన్ని సబ్జెక్టులకు రెండు సెషన్లలో పరీక్షలు జరుగుతాయి. పరీక్షల నిర్వహణ తేదీలకు సంబంధించిన షెడ్యూల్‌ను టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. పరీక్షలన్నీ కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ (సీబీఆర్టీ) విధానంలో నిర్వహించనున్నట్లు వెల్లడించింది. సెప్టెంబర్ 12న ప్రారంభం కానున్న పరీక్షలు అక్టోబర్ 3 వరకు దాదాపు 11 రోజులపాటు పరీక్షలు కొనసాగనున్నాయి. ఆగస్టు 8న ఏఓ, జేఏఓ పరీక్ష..: పురపాలన, పట్టణాభివృద్ధి శాఖ పరిధిలోని పట్టణ స్థానిక సంస్థ (యూఎల్బీ)ల్లోని అకౌంట్స్ ఆఫీసర్ (ఏఓ), జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ (జేఏఓ) ఉద్యోగాల భర్తీకి సంబంధించిన పరీక్షను ఆగస్టు 8న నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ వెల్లడించింది. నిర్దేశించిన రోజున ఉదయం, మధ్నాహ్నం రెండు సెషన్లలో పరీక్షలను సీబీఆర్టీ పద్ధతిలో నిర్వహించనున్నట్లు వెల్లడించింది. పై అన్ని పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు పరీక్ష తేదీకి వారం ముందు హాల్‌టికెట్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చని చెప్పింది. -
AP TET 2022: ప్రారంభమైన ఏపీ టెట్ పరీక్షలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్షలు (ఏపీటెట్)–ఆగస్టు 2022 శనివారం (నేటి) నుంచి ప్రారంభమయ్యాయి. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2:30 నుంచి 5 గంటల వరకు రెండో సెషన్ ఉంటుందని అధికారులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 21 వరకు కంప్యూటరాధారితంగా ఇవి జరుగుతాయి. ఈ పరీక్షలకు 5.25 లక్షల మంది వరకు అభ్యర్థులు దరఖాస్తు చేశారు. అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో 150 పరీక్ష కేంద్రాలను అధికారులు ఏర్పాటుచేశారు. రాష్ట్రంతోపాటు ఒడిశా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లలోనూ వీటిని ఏర్పాటుచేశారు. ఇక టెట్ ఉత్తీర్ణత సర్టిఫికేట్ చెల్లుబాటు ఇంతకుముందు ఏడేళ్లుగా ఉండేది. కానీ, కేంద్ర ప్రభుత్వం దీన్ని మార్పుచేసి చెల్లుబాటును జీవితకాలంగా ప్రకటించింది. వెయిటేజీతో పెరిగిన అభ్యర్థులు ఇక ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంటు టీచర్ పోస్టుల అర్హత కోసం నిర్వహించే ఈ పరీక్షల్లో వచ్చే మార్కులకు డీఎస్సీ ఎంపికల్లో 20 శాతం వెయిటేజీ ఇవ్వనుండడంతో కొత్తగా డీఎడ్, బీఈడీ కోర్సులు పూర్తిచేసిన వారితో పాటు గతంలో ఈ పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారు కూడా తమ స్కోరు పెంచుకునేందుకు ఈసారి టెట్ పరీక్షలకు హాజరవుతున్నారు. టెట్‌కు దరఖాస్తు చేసుకునేందుకు డిగ్రీ రిజర్వుడ్ అభ్యర్థుల అర్హత మార్కులను 45 నుంచి 40కి తగ్గించారు. దీనివల్ల కూడా అదనంగా మరో 50వేల మంది దరఖాస్తు చేశారు. అభ్యర్థుల సంఖ్య పెరగడం.. రాష్ట్రంలో పరీక్ష కేంద్రాలు తగినన్ని లేకపోవడంతో పలువురు అభ్యర్థులకు ఇతర రాష్ట్రాల్లోని సెంటర్లను కేటాయించారు. దీంతో వారు ఇబ్బందికి గురవుతున్నారు. -
ఏపీ ఎంసెట్ పరీక్ష ప్రారంభం
-
ఏపీ ఎంసెట్ పరీక్ష ప్రారంభం
సాక్షి, విజయవాడ : రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, బీ. ఫార్మసీ ప్రవేశాలకు సంబంధించి నిర్వహిస్తున్న ఎంసెట్ పరీక్ష గురువారం ఉదయం 9 గంటలకు ప్రారంభమైంది. కరోనా నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకుంది. మొత్తం రెండు సెషన్లలో జరగనున్న ఎంసెట్ పరీక్షలు ఈ నెల 25 వరకు 14 సెషన్లలో ఏడు రోజుల పాటు సీబీటీ విధానంలో నిర్వహించనున్నారు. ప్రతిరోజు ఉదయం 9నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 3నుంచి సాయంత్రం 6గంటల వరకు ఈ పరీక్ష జరుగుతుంది. ఈనెల 17, 18, 21, 22, 23 తేదీల్లో ఇంజినీరింగ్, 23, 24, 25 తేదీల్లో అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశానికి పరీక్షలను నిర్వహించనున్నారు. ఈసారి ఇంజనీరింగ్, అగ్రికల్చర్, బీ.ఫార్మసీ విభాగాల్లో మొత్తం 2,72 ,900 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఇందుకోసం 47 పట్టణాల్లో 118 పరీక్ష కేంద్రాల ఏర్పాటు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ ఎంసెట్‌కు నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతించేది లేదని ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ రవీంద్ర తెలిపారు. నిర్ణీత సమయానికి రెండు గంటల ముందు నుంచే విద్యార్థులను కోవిడ్ మార్గదర్శకాలతో పరీక్ష కేంద్రంలోకి అనుమతించనున్నట్లు వెల్లడించారు. ప్రతి విద్యార్థి భౌతిక దూరం పాటించాలని తెలిపారు. పరీక్ష హాలులో విద్యారి్థకి విద్యార్థి మధ్య 4నుంచి 6 అడుగులు భౌతిక దూరం ఉండేలా బల్లలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్షకు ముందు, తరువాత పరీక్ష కేంద్రాలను పూర్తిస్థాయిలో శానిటైజన్ చేయించనున్నట్లు తెలిపారు. విద్యార్థులను థర్మల్ స్క్రీనింగ్, హ్యాండ్ శానిటైజేషన్ చేసిన తరువాతనే లోనికి అనుమతిస్తామని, ప్రతి విద్యార్థి తప్పనిసరిగా మాస్కు ధరించాలని సూచించారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు వారి వెంట 50ఎంఎల్ హ్యాండ్ శానిటైజర్, అలాగే పారదర్శక వాటర్ బాటిల్‌ను వెంట తెచ్చుకోవచ్చని పేర్కొన్నారు. ముందస్తుగా పరీక్ష రాసేసినప్పటికి పరీక్ష సమయం పూర్తయ్యేవరకు విద్యార్థులు కేంద్రంలోనే ఉండాలని సూచించారు. విద్యార్థులు తప్పనిసరిగా ఒరిజినల్ అడ్మిట్ కార్డు, ఏదేని ఫొటో ఐడీ కార్డు వెంట తెచ్చుకోవాలని ఆయన తెలిపారు. -
సెట్స్‌కు ఏపీ ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు
సాక్షి, అమరావతి: ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఎంసీఏ, ఎంబీఏ, ఎంటెక్ తదితర కోర్సుల్లో చేరేందుకు నిర్వహించే ఎంసెట్ సహా వివిధ ప్రవేశ పరీక్షలకు రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేయిస్తోంది. ఇందుకు సంబంధించి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్.. విద్యాశాఖ అధికారులు, ఏపీ ఉన్నత విద్యామండలి అధికారులు, వివిధ కామన్ ఎంట్రన్స్ పరీక్షల కన్వీనర్లతో పలుమార్లు సమీక్షలు నిర్వహించి ఏర్పాట్లపై పలు సూచనలు అందించారు. ► కోవిడ్–19 ప్రొటోకాల్‌ను అనుసరిస్తూ ఉన్నత విద్యామండలి ఈ ప్రవేశ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేపట్టింది. ► కంప్యూటర్ ఆధారిత (సీబీటీ)గా (పీఈసెట్ మినహా) ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. ► ఇప్పటికే బార్‌కోడింగ్ హాల్ టికెట్లు జారీచేసి, విద్యార్థులు పాటించాల్సిన విధివిధానాలపై స్పష్టమైన సూచనలు ఇచ్చారు. ► ప్రతి అభ్యర్థి నుంచి సెల్ఫ్ డిక్లరేషన్‌ను తీసుకొనేందుకు ప్రత్యేక ప్రొఫార్మాను ఉన్నత విద్యామండలి రూపొందించింది. ► ఈ నెల 10 నుంచి ఐసెట్ పరీక్షలతో సెట్స్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ► బార్కోడ్ స్కానింగ్ ద్వారా అభ్యర్థుల సమాచారాన్ని అధికారులు ధ్రువీకరించుకుంటారు. ఇందుకోసం ప్రవేశద్వారం వద్ద బార్కోడ్ రీడర్లను ఏర్పాటు చేశారు. ► అభ్యర్థులు మాస్క్‌తో రావాలి. పరీక్ష కేంద్రం వద్ద శానిటైజర్లు ఏర్పాటు చేస్తారు. ► అభ్యర్థులను పరీక్ష కేంద్రంలోకి ఉదయం సెషన్లో 7.30– 9.00 గంటల వరకు, మధ్యాహ్నం సెషన్లో 1.30– 3.00 వరకు అనుమతిస్తారు. పరీక్ష ఉదయం 9 గంటలకు, మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం అవుతుంది. ► ప్రతి సెషన్లో పరీక్ష హాలు లోపల శానిటైజ్ చేస్తారు. ► సెట్లకు సంబంధించిన సమాచారం ఆయా సెట్ల అధికారిక వెబ్సైట్ నుంచి పొందవచ్చు. ► అభ్యర్థులను ప్రవేశ ద్వారం వద్ద థర్మల్ స్క్రీనింగ్ చేస్తారు. టెంపరేచర్ ఎక్కువగా ఉన్న వారిని ఐసోలేషన్ గదిలో పరీక్ష రాయిస్తారు. ► ప్రతి కేంద్రంలో ఐసోలేషన్ గదులు కేటాయిస్తున్నారు. ఈ గదుల్లో పరీక్షల సిబ్బందికి పీపీఈ కిట్లు అందించనున్నారు. ► ఈసెట్‌లో ఈసారి కొత్తగా అగ్రికల్చర్ డిప్లొమో కోర్సుకు ప్రవేశాలు చేపట్టనున్నారు. ► ఐసెట్‌లో గతంలో బీఎస్సీ కంప్యూటర్స్, ఐటీ చేసిన వారికి ఎంసీఏలో లేటరల్ ఎంట్రీ ఉండేది. కానీ ఎంసీఏను రెండేళ్లకు కుదించినందున లేటరల్ ఎంట్రీని రద్దుచేసి వారికి కూడా ఫస్టియర్‌లోనే ప్రవేశాలు కల్పించనున్నారు. ► ప్రభుత్వం, విద్యాశాఖ మంత్రి సూచనల మేరకు ఉన్నత విద్యామండలి ప్రవేశ పరీక్షలను కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ప్రశాంతంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తోందని సెట్స్ ప్రత్యేకాధికారి డాక్టర్ ఎం.సుధీర్‌రెడ్డి తెలిపారు. (చదవండి: ఇంగ్లిష్ లేకుంటే మీ ముందు ఇలా మాట్లాడగలిగేవాడినా?) -
ఐటీఐ ట్రేడ్లకు ఆన్లైన్ పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: ఐటీఐ (ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్)లు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటున్నాయి. పారిశ్రామిక రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తున్న తరుణంలో పరిశ్రమల అవసరాలకు తగినట్లు నిపుణులను తయారు చేస్తున్నాయి. ప్రస్తుతం ప్రతి రంగంలోనూ కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరైంది. ఈ నేపథ్యంలో నైపుణ్య శిక్షణకు సాంకేతికతను జోడించాయి. పారిశ్రామిక శిక్షణ సంస్థల్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ)ని అమలు చేసేందుకు కార్మిక ఉపాధి కల్పన శాఖ నిర్ణయించింది. రాష్ట్రంలో 290 ఐటీఐలున్నాయి. వీటిలో ప్రభుత్వ ఐటీఐలు 65, ప్రైవేటు ఐటీఐలు 235 ఉన్నాయి. వీటి పరిధిలో 48,265 మంది అభ్యర్థులు వివిధ ట్రేడ్లలో శిక్షణ పొందుతున్నారు. ట్రేడ్ల వారీగా శిక్షణలు తీసుకుంటున్న విద్యార్థులకు ఆన్లైన్ పద్ధతిలో ప్రతిభను కనబర్చేందుకు సీబీటీ దోహదపడుతుందని ఆ శాఖ భావిస్తోంది. దీంతో ఈ ఏడాది జూన్‌లో జరిగే వార్షిక పరీక్షలను సీబీటీ పద్ధతిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ప్రతి కేటగిరీలో 50 ప్రశ్నలు.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఐటీఐలలో 31 ట్రేడ్లు ఉన్నాయి. వీటిలో 27 ట్రేడ్లలో మాత్రమే విద్యార్థులు ప్రవేశాలు పొందారు. వీరికి ఈ ఏడాది జూన్‌లో వార్షిక పరీక్షలు నిర్వహించనున్నారు. గతంలో మాన్యువల్ పద్ధతిలో ఈ పరీక్షలు నిర్వహించగా... ఈసారి ఆన్లైన్ పద్ధతిలో నిర్వహించనున్నారు. థియరీ, వర్క్‌షాప్ కాలి క్యులేషన్స్, ఎంప్లాయిబులిటీ స్కిల్స్ కేటగిరీలకు సీబీటీ పద్ధతిలో పరీక్షలు జరుగుతాయి. మిగతా పరీక్షలు మాత్రం ఆఫ్‌లైన్ పద్ధతిలో నిర్వహించనున్నారు. ప్రతి కేటగిరీలో 50 ప్రశ్నలుంటాయి. వీటికి ఒకదానివెంట ఒకటి సమాధానాలు ఇస్తూ పరీక్షను పూర్తి చేయాల్సి ఉంటుంది. పరీక్షల నిర్వహణకుగాను కేం ద్రాల్లో వసతులు కల్పించాలని కార్మిక ఉపాధి కల్పన శాఖ ఆదేశాలు జారీ చేసింది. విస్తృత అవగాహన వచ్చేలా... తొలిసారి ఆన్లైన్ పరీక్షలు నిర్వహిస్తున్న తరుణంలో విద్యార్థులు ఆందోళన చెందకుండా ఉండేలా అధికారులు చర్యలు చేపట్టారు. సీబీటీ పరీక్షలపై వారికి అవగాహన కార్యక్రమాలు పూర్తిచేసి విద్యార్థులను సన్నద్ధం చేయనున్నట్లు కార్మిక ఉపాధి కల్పన శాఖ సంచాలకులు కేవై నాయక్ ‘సాక్షి’తో అన్నారు. -
రైల్వే సీబీటీలో 5లక్షల మందికి అర్హత
న్యూఢిల్లీ: అసిస్టెంట్ లోకో పైలట్లు, టెక్నీషియన్ల పోస్టుల భర్తీకి నిర్వహించిన కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(సీబీటీ) మొదటి దశలో మొత్తం 5, 88, 605 మంది అర్హత సాధించారని రైల్వే శాఖ తెలిపింది. డిసెంబర్ 12వ తేదీ నుంచి 14వ తేదీ వరకు జరగనున్న రెండో దశ పరీక్షకు వీరు అర్హత పొందారని పేర్కొంది. పరీక్షకు 10రోజుల ముందు హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. పరీక్ష తేదీకి నాలుగు రోజులు ముందుగా ఈ–కాల్ లెటర్లు అందుబాటులో ఉంచనున్నట్లు పేర్కొంది. మొత్తం 64, 371 పోస్టులకు గాను ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో పరీక్ష నిర్వహించారు. -
18న ఏఈఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్
జోనల్ కో-ఆర్డినేటర్ ప్రొఫెసర్ రాంనాథ్ కిషన్ కేయూ క్యాంపస్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీపీఎస్సీ) ఆధ్వర్యంలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్స్ కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్‌ను ఈనెల 18న నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నామని అటెస్ట్ జోనల్ కో-ఆర్డినేటర్, కేయూ ప్రొఫెసర్ రాంనాథ్కిషన్ శుక్రవారం తెలిపారు. ఈ పరీక్ష పూర్తిగా కంప్యూటర్ ఆధారంగా జరుగుతుందన్నారు. వరంగల్ జోన్లో 14 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని వివరించారు. మొత్తం 2,860 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరు కాబోతున్నారన్నారు. మొదటి సెషన్ ఉదయం జరిగే పరీక్షకు అభ్యర్థుల ఉదయం 8-30గంటల నుంచే పరీక్షా కేంద్రాలకు అనుమతిస్తారన్నారు. రెండో సెషనల్లో మధ్యాహ్నం 1.15 గంటల నుంచే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారన్నారు. ఉదయం జరిగే పరీక్షకు ఉదయం 9-15 గంటల తరువాత, మధ్యాహ్నం పరీక్షకు 1-45గంటల తరువాత ఎట్టి పరిస్థితుల్లోను పరీక్షాకేంద్రాల్లోకి అనుమతించబోరన్నారు.