స్థానికులకు ఉపాధి కల్పించండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటవుతున్న పరిశ్రమల్లో కనీసం 70 నుంచి 80 శాతం ఉద్యోగాలను స్థానికులకే ఇవ్వాలని పరిశ్రమల మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. తెలంగాణ పారిశ్రామిక విధానం ‘టీఎస్ఐపాస్’ ఐదో విడతలో భాగంగా 14 పరిశ్రమలకు ఆయన మంగళవారం అనుమతి పత్రాలు అందజేశారు. ఈ పరిశ్రమలు రూ. 1,118 కోట్ల పెట్టుబడులతో 7,079 మందికి ఉపాధి కల్పించేందుకు ముందుకొచ్చాయన్నారు. ఐ పాస్ ద్వారా ఇప్పటివరకు రూ. 25,972.28 కోట్ల పెట్టుబడులతో 1,013 యూనిట్లకు అనుమతిచ్చామని, వీటితో 76,314 మందికి ఉపాధి దక్కుతుందన్నారు.
నైపుణ్యం కలిగిన మానవ వనరుల కోసం పరిశ్రమలు ఇతర ప్రాంతాల వైపు చూడాల్సిన అవసరం లేదన్నారు. ఉద్యోగాల కల్పనకు నైపుణ్య శిక్షణను పరిశ్రమల శాఖ ద్వారా ఇప్పిస్తామన్నారు. ‘తెలంగాణ టెక్స్టైల్ పాలసీ’ ముసాయిదాకు తుది రూపునిచ్చి త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ఆవిష్కరించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు జూపల్లి వెల్లడించారు.
పరిశ్రమలకు అనుమతుల జారీలో ఎదురవుతున్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నట్లు పరిశ్రమల శాఖ కార్యదర్శి అరవింద్ కుమార్ పేర్కొన్నారు. స్వీడన్, చైనా పర్యటనలు విజయవంతమయ్యాయని, త్వరలో ఆయా దేశాల నుంచి మెగా ప్రాజెక్టులు వస్తున్నట్లు తెలిపారు. న్యూకాన్ ఏరోస్పేస్, మహి గ్రానైట్స్, షాపూర్ పల్లోంజి, వింటేజ్ కాఫీ తదితర సంస్థలకు 15 రోజుల వ్యవధిలో అనుమతుల జారీ చేయడాన్ని ప్రశంసించారు.