జియో వల్ల ఎంత నష్టం వాటిల్లిందంటే..
న్యూఢిల్లీ : రిలయన్స్ జియో... టెలికాం మార్కెట్లోకి అడుగుపెట్టడంతో ఒక్కసారిగా ఇండస్ట్రీ పరిస్థితంతా తలకిందులైన సంగతి తెలిసిందే. దీని దెబ్బకు దిగ్గజ టెలికాం కంపెనీలు భారీగానే నష్టాలు మూటగట్టుకున్నాయి. అయితే ఏకతాటిగా పెరిగిపోతున్న జియో సబ్ స్క్రైబర్ బేస్, 2016-17 వరకు ఆఫర్ చేసిన ఉచిత ఆఫర్లతో ఇండస్ట్రీ రెవెన్యూలు కూడా ఏడాది ఏడాదికి 11.7 శాతం పడిపోయినట్టు జేఫ్ఫెరీస్ రిపోర్టు నివేదించింది. జేఫ్పెరీస్ బుధవారం వెల్లడించిన రిపోర్టులో జియో సబ్ స్క్రైబర్ వృద్ధి, 2016-17 నాలుగో క్వార్టర్ ముగిసేవరకు కంపెనీ ఆఫర్ చేసిన ఉచిత సేవలు ఇండస్ట్రీ రెవెన్యూలను దెబ్బతీశాయని పేర్కొంది. అంతేకాక ఈ ఆర్థిక సంవత్సరంలోనూ సెక్టార్ రెవన్యూలు 38 శాతం పడిపోయే అవకాశముందని టెలికాం డిపార్ట్ మెంట్ అంచనావేస్తోంది. అంటే 17వేల కోట్ల రెవెన్యూలు కనుమరుగయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
రిలయన్స్ జియో ఎఫెక్ట్ ఎక్కువగా మెట్రోలు, ఏ సర్కిళ్లలో ఉందని, ఈ ప్రాంతాల్లో దీనికి అత్యధిక వ్యాప్తి ఉన్నట్టు తెలిపింది. అక్కడే స్మార్ట్ ఫోన్ ఎకోసిస్టమ్ కూడా మెరుగ్గా అభివృద్ధి చెందిందని కూడా రిపోర్టు వివరించింది. 2016-17 నాలుగో క్వార్టర్ ముగిసే వరకు రిలయన్స్ జియో సబ్ స్క్రైబర్ బేస్ ఎలాంటి బ్రేక్ లు లేకుండా 10.8కోట్ల మేర దూసుకుపోయిందని చెప్పింది. తాజా నెలలోనే జియో అడిక్షన్ కొంచెం తగ్గింది. మొత్తంగా భారత్ లో 4జీ స్మార్ట్ ఫోన్ల బేస్ 13.1 కోట్లుంటే, దానిలో 86 శాతం డివైజ్ లలో జియోనే వాడుతున్నారని జేఫ్ఫెరీస్ వెల్లడించింది.
వీరిలో 61 శాతం మంది యాక్టివ్ యూజర్లుగా ఉన్నట్టు పేర్కొంది. డేటా సర్వీసులు ఎక్కువ వృద్ధి చెందడం, వాయిస్ లు పడిపోవడం, ఆపరేటర్లు తక్కువ పెట్టుబడులు వారి రెవెన్యూల పడిపోవడానికి దారితీశాయని ఈ రిపోర్టు చెప్పింది. ప్రస్తుతం టాప్-3లో ఉన్న ఆపరేటర్లే 76 శాతం మార్కెట్ షేరును కలిగిఉన్నారు. కానీ వారి రెవెన్యూలకు దెబ్బపడటం, ఇండస్ట్రీ రెవెన్యూలకు కూడా గండికొడుతోంది.