Infant sale
-
చిత్తూరులో మాయం.. గుంటూరులో ప్రత్యక్షం
చిత్తూరు అర్బన్/ చిత్తూరు రూరల్/ గుంటూరు రూరల్ : శనివారం తెల్లవారుజామున చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిలో కిడ్నాపైన పసికందును అదే రోజు రాత్రి గుంటూరు ఆర్టీసీ బస్టాండులో పోలీసులు క్షేమంగా స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని అదుపులోకి తీసుకున్నారు. బాధితులు, పోలీసుల కథనం మేరకు.. చిత్తూరులోని మంగసముద్రంకాలనీలో నివాసముంటున్న రషీద్ భార్య బి.షబానా ఈ నెల 14న ప్రభుత్వ ఆస్పత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చింది. శనివారం వరకు ఆస్పత్రిలోనే ఉండాలని వైద్యులు సూచించారు. ఈ నేపథ్యంలో శనివారం తెల్లవారుజామున 4 గంటలకు బిడ్డకు పాలిస్తూ నిద్రలోకి జారుకుంది. కొద్దిసేపటి తర్వాత లేచి చూస్తే పక్కన బిడ్డ కనిపించక పోవడంతో ఆందోళన చెందుతూ సమీపంలో పడుకున్న తల్లి, తోడికోడలిని నిద్ర లేపింది. వారు వెంటనే ఆస్పత్రి సిబ్బందికి, పోలీసులకు విషయం చెప్పారు. కాసేపట్లోనే అక్కడికి చేరుకున్న పోలీసులు ఆస్పత్రిలో సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. ముగ్గురు అనుమానిత మహిళలు 5.17 గంటల సమయంలో బిడ్డను ఎత్తుకు వెళుతున్నట్లు కెమెరాల్లో రికార్డయ్యింది. ఈ విషయాన్ని పోలీసులు ఎస్పీ సెంథిల్‌కుమార్‌కు చేరవేశారు. ఆయన చిత్తూరు టూటౌన్ సీఐ యుగంధర్ ఆధ్వర్యంలో ఓ బృందాన్ని రంగంలోకి దింపారు. సీసీ కెమెరాల్లో కనిపించిన మహిళల్లో ఒకరు చిత్తూరులోని సంతపేటకు చెందిన పవిత్రగా గుర్తించారు. ఈమెను అదుపులోకి తీసుకుని విచారించారు. వైజాగ్‌లోని భీమిలికి చెందిన పద్మ అనే మహిళ ఇటీవల తనకు పరిచయమైందని, తనకు మగబిడ్డ కావాలని కోరుతూ రూ.50 వేలు ఇచ్చిందని చెప్పింది. దీంతో ఆస్పత్రిలో బిడ్డను దొంగిలించి, ఆమెకు విక్రయించానని తెలిపింది. సెల్‌ఫోన్ ఆధారంగా కూపీ.. బిడ్డను వైజాగ్ తీసుకెళుతున్నట్లు పక్కా సమాచారం రావడంతో పద్మ సెల్‌ఫోన్ ఆధారంగా సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి గుంటూరు పోలీసులను చిత్తూరు పోలీసులు అప్రమత్తం చేశారు. గుంటూరు బస్టాండులోని ఓ బస్సులో పసికందుకు కొత్త బట్టలు వేసి ఉండటం గమనించిన పోలీసులు.. ఆ బిడ్డను ఎత్తుకున్న మహిళను ప్రశ్నించారు. తొలుత వారు తమ బిడ్డ అని వాదించారు. ఆమె పేరు పద్మ అని తెలియడంతో ఆమెను, ఆమె భర్త వెంకటేశ్వర్లును చేబ్రోలు సీఐ పి.సుబ్బారావు, నల్లపాడు ఎస్ఐ కిషోర్‌లు అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం ఒప్పుకున్నారు. కిడ్నాపైన పసిబిడ్డను క్షేమంగా స్వాధీనం చేసుకుని, గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చిత్తూరులో పవిత్రతో పాటు మరో మధ్యవర్తిని అదుపులోకి తీసుకున్నారు. గంటల వ్యవధిలోనే బిడ్డను పోలీసులు క్షేమంగా రక్షించడంపై సర్వత్రా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. కాగా, ఇటీవల విశాఖ ప్రభుత్వాస్పత్రిలో ఇదే రీతిలో కిడ్నాప్‌కు గురైన మరో చిన్నారిని సైతం పోలీసులు రక్షించడం తెలిసిందే. -
పసికందును అమ్మకానికి పెట్టిన తల్లి!
సాక్షి, హైదరాబాద్ : నవ మాసాలు మోసి జన్మనించిన శిశువుని కన్న తల్లే అమ్మకానికి పెట్టిన ఘటన నెరేడ్మెట్ పీఎస్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల మేరకు.. అత్యాచారం కేసులో బాధితురాలైన ఓ మహిళ ఇటీవల పాపకు జన్మనిచ్చింది. ఈనెల 12వ తేదీన ప్రసవం కోసం భువనగిరి జిల్లా ఆస్పత్రికి వచ్చిన బాధితురాలికి 10 రోజుల క్రితం పండంటి ఆడపిల్ల జన్మించింది. (25 మంది కిడ్నాప్!: నలుగురి హత్య) ఏ కష్టం వచ్చిందో ఏమో గానీ బాధితురాలు పుట్టిన పసికందును తెలిసిన వ్యక్తుల ద్వారా ఘట్కేసర్ మండలం ఎదులాబాద్‌కు చెందిన వారికి 60 వేల రూపాయలకు విక్రయించింది. ఈ క్రమంలో డీఎన్ఏ పరీక్ష కోసం పాపను తీసుకు రావాలని నేరెడ్మెట్ పోలీసులు కోరగా.. పసికందు చనిపోయిందని కుటుంబ సభ్యులు చెప్పి పోలీసులను తప్పుదోవ పట్టించారు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు విచారణ చేపట్టగా.. పాపను విక్రయించినట్లు గుర్తించారు. పాపను సురక్షితంగా రక్షించిన పోలీసులు శిశువును ఘట్కేసర్.. ఎదులాబాద్‌లోని చైల్డ్ కేర్ సెంటర్‌కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. (మల్కాజ్గిరి ఏసీపీ ఇంటిపై ఏసీబీ దాడులు) -
పసికందును ‘అమ్మే’శారు
చేరదీసిన ఐసీడీఎస్ అధికారులు నెల్లూరు(అర్బన్) : వెంకటాచలం మండలం చెముడుగుంట పంచాయతీ నక్కల గిరిజనకాలనీలో వారం క్రితం 5 నెలల పసి కందును అమ్మిన సంఘటన ఆలస్యంగా శుక్రవారం వెలుగులోకి వచ్చింది. ఆ బిడ్డను ఐసీడీఎస్ విభాగం ఐసీపీఎస్ అధికారులు చేరదీశారు. గిరిజనకాలనీకి చెందిన సుబ్బాల మస్తానయ్య,చెంచులక్ష్మి దంపతులది రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి. ఆ పేద దంపతులు బిడ్డను పోషించలేక ఐదు నెలల మగబిడ్డను సమీపంలోని బుజబుజనెల్లూరు ప్రాంతానికి చెందిన బొడ్డు సుమతి, ప్రభుదాస్ దంపతులకు రూ.15 వేలకు అమ్మేశారు. ఈ విషయం బయటకు పొక్కడంతో కలెక్టర్ ముత్యాలరాజుకు ఫోన్లో సమాచారం అందించినట్లు తెలుస్తోంది. కలెక్టర్ ఆదేశాల మేరకు ఐసీడీఎస్ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి బిడ్డను స్వాధీనం చేసుకున్నారు. ఇంతలోనే బిడ్డ తండ్రి మస్తానయ్య తమ బిడ్డ తనకు కావాలని అడిగారు. ఈ నేపథ్యంలో భార్యాభర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. వెంకటాచలం తహసీల్దార్ కూడా విచారించారు. ఐసీడీఎస్ అధికారులు బిడ్డను అమ్మిన దంపతులపై వెంకటాచలం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పసిబిడ్డను పెద్దాస్పత్రిలోని చిన్న పిల్లల విభాగానికి తరలించి వైద్య పరీక్షలు చేయిస్తున్నారు. బిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్టు తెలిసింది. -
నల్లగొండ జిల్లాలో శిశు విక్రయం
దామరచర్ల (నల్లగొండ) : నల్లగొండ జిల్లాలో మరో శిశు విక్రయం వెలుగుచూసింది. దామరచర్ల మండలంలోని ఎర్రనాము కాలనీకి చెందిన బలుగూరి సుజాత, యాకోబ్‌లకు ఇద్దరు ఆడ సంతానం. కాగా ఇరవై రోజుల కిందట మూడో సంతానంగా కూడా ఆడపిల్లే పుట్టింది. దీంతో శిశువును గుంటూరు జిల్లా దాచేపల్లికి చెందిన ప్లాస్టిక్ సామాను అమ్ముకునే వారికి విక్రయించినట్లు స్థానికులు చెబుతున్నారు. దీనిపై సమాచారం తెలుసుకున్న ఐసీడీఎస్ సిబ్బంది, స్థానిక వార్డు సభ్యురాలు శిశువు తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. అనంతరం దాచేపల్లికి వెళ్లి చిన్నారిని తీసుకువచ్చి తల్లి ఒడికి చేర్చారు. కాగా ముగ్గురు ఆడపిల్లలను తాము సాకలేమని, మూడో సంతానాన్ని శిశువిహార్‌కు తీసుకెళ్లాలని సుజాత, యాకోబ్‌లు కోరుతున్నారు. శిశువును అమ్ముకోలేదని, సాదుకునేందుకు మాత్రమే ఇచ్చామని వారు చెప్పారు.