Published
Sat, Sep 17 2016 1:55 AM
| Last Updated on Sat, Oct 20 2018 6:19 PM
పసికందును ‘అమ్మే’శారు
చేరదీసిన ఐసీడీఎస్ అధికారులు
నెల్లూరు(అర్బన్) : వెంకటాచలం మండలం చెముడుగుంట పంచాయతీ నక్కల గిరిజనకాలనీలో వారం క్రితం 5 నెలల పసి కందును అమ్మిన సంఘటన ఆలస్యంగా శుక్రవారం వెలుగులోకి వచ్చింది. ఆ బిడ్డను ఐసీడీఎస్ విభాగం ఐసీపీఎస్ అధికారులు చేరదీశారు. గిరిజనకాలనీకి చెందిన సుబ్బాల మస్తానయ్య,చెంచులక్ష్మి దంపతులది రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి. ఆ పేద దంపతులు బిడ్డను పోషించలేక ఐదు నెలల మగబిడ్డను సమీపంలోని బుజబుజనెల్లూరు ప్రాంతానికి చెందిన బొడ్డు సుమతి, ప్రభుదాస్ దంపతులకు రూ.15 వేలకు అమ్మేశారు. ఈ విషయం బయటకు పొక్కడంతో కలెక్టర్ ముత్యాలరాజుకు ఫోన్‌లో సమాచారం అందించినట్లు తెలుస్తోంది. కలెక్టర్ ఆదేశాల మేరకు ఐసీడీఎస్ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి బిడ్డను స్వాధీనం చేసుకున్నారు. ఇంతలోనే బిడ్డ తండ్రి మస్తానయ్య తమ బిడ్డ తనకు కావాలని అడిగారు. ఈ నేపథ్యంలో భార్యాభర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. వెంకటాచలం తహసీల్దార్ కూడా విచారించారు. ఐసీడీఎస్ అధికారులు బిడ్డను అమ్మిన దంపతులపై వెంకటాచలం పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పసిబిడ్డను పెద్దాస్పత్రిలోని చిన్న పిల్లల విభాగానికి తరలించి వైద్య పరీక్షలు చేయిస్తున్నారు. బిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్టు తెలిసింది.