అడ్డగోలు గరికట్లు.. ఆదాయానికి తూట్లు
- పంచాయతీల రాబడికి గండి
- దారి మళ్లుతున్న రూ.లక్షలు
- పట్టించుకోని మత్స్యశాఖ
- డెల్టాలో పలు డ్రెయిన్లలో ఇదే పరిస్థితి
భీమవరం : డెల్టాలోని పలు ప్రాంతాల్లో అనధికార గరికట్లు రాజ్యమేలుతున్నాయి. ఫలితంగా ఆయా గ్రామ పంచాయతీలు, మత్స్యకార సొసైటీలకు చేరవలసిన రూ.లక్షల ఆదాయం దారి మళ్లుతోంది. కొందరు గ్రామ పెద్దలు మత్స్యశాఖతోపాటు మత్స్యకార సొసైటీలకు సంబంధం లేకుండా అనధికార గరికట్లతో లక్షలాది రూపాయలు బొక్కేస్తున్నారు. జిల్లాలోని డెల్టా ప్రాంతంలో పలు గ్రామాల్లో మేజర్, మైనర్, మీడియం డ్రెయిన్లు ఉన్నాయి. ఈ డ్రెయిన్లలో ఎటువంటి అనుమతి లేకుండా కొంతమంది వ్యక్తులు గరికట్లు ఏర్పాటుచేసి వాటిని పాట పెట్టి మరీ లక్షలాది రూపాయలు బొక్కేస్తున్నారు.
కొన్ని గ్రామాల్లో అయితే నెం. 2 అకౌంట్ పేరుతో గ్రామ పెద్దలు ఈ బోదె పాటల వల్ల వచ్చే ఆదాయాన్ని దారి మళ్లిస్తున్నారు. భీమవరం, మొగల్తూరు, న రసాపురం, వీరవాసరం, కాళ్ల, యలమంచిలి, ఆకివీడు వంటి మండలాల్లోని పలు గ్రామాల్లో ప్రవహిస్తున్న డ్రెయిన్లు, కాలువల్లో ఈ అనధికారిక గరికట్లు ఇబ్బడి ముబ్బడిగా వెలశాయి. అటు డ్రెయిన్లలోని మత్స్య సంపదను కొల్లగొట్టడంతోపాటు వచ్చిన ఆదాయాన్ని ప్రభుత్వానికి చెందకుండా కొంతమంది పెద్దలు గెద్దల్లా తన్నుకుపోతున్నారు.
ఆయా గ్రామాల్లో గతంలో గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో మత్స్యశాఖ అనుమతితో ఈ గరికట్లు అధికారికంగా నిర్వహించేవారు. వచ్చిన పాట సొమ్మును గ్రామ పంచాయతీ ఆదాయంలో జమ చేసేవారు. ఆ ఆదాయాన్ని గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు వెచ్చించేవారు. మరికొన్ని గ్రామాల్లో మత్స్య సహకార సంఘాలకు ఈ డ్రెయిన్లోని గరికట్లను అధికారికంగా మత్స్యశాఖ అధికారులు అప్పగించి వచ్చిన ఆదాయాన్ని ఆయా సొసైటీల ఆర్థిక పురోభివృద్ధికి కేటాయించేవారు. తద్వారా మత్స్యకార కుటుంబాల్లో వెలుగులు నింపేవారు. వీటన్నింటినీ పక్కనపెట్టి ఆయా గ్రామాల్లో గరికట్లు అనధికారికంగా వేస్తున్నారు.
పట్టించుకోని మత్స్యశాఖ
డెల్టాలోని పలు డ్రెయిన్లలో గరికట్లు వేసి మత్స్య సంపదను పట్టుకుంటున్నారు. ఒక్కొక్క డ్రెయిన్లో అనధికారికంగా వేసిన గరికట్లకు ఆయా డ్రెయిన్ల సామర్థ్యం, మత్స్య సంపదను బట్టి రూ. 5 లక్షల నుంచి 15 లక్షల వరకు ఆదాయం వస్తుంది. భీమవరం మండలంలోని బందాలచేడు, పొలిమేరతిప్ప, మందచేడు, ధనకాలువ, గునుపూడి సౌత్, మొగల్తూరు మండలంలో దర్భరేవు డ్రెయిన్, చింతరేవు కాలువ, నరసాపురం మండలంలో నల్లిక్రీక్, యలమంచిలి మండలంలో కాజా డ్రెయిన్, కాళ్ల మండలంలో బొండాడ డ్రెయిన్, రుద్రాయికోడు, స్ట్రైట్కట్ డ్రెయిన్, పెదకాపవరం డ్రెయిన్లపై అనధికారిక గరికట్లు వెలశాయి.
ఆయా ప్రాంతాల్లోని మత్స్యశాఖ, రెవెన్యూశాఖ అధికారులు అక్రమ గరికట్ల ఏర్పాటు దారుల వద్ద కాసులకు కక్కుర్తిపడి ఏ మాత్రం పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా ఈ గరికట్ల ఆదాయంపై దృష్టి సారించాలని ఆయా గ్రామాలకు చెందినవారు ఉన్నతాధికారులను కోరుతున్నారు.