Information Technology and Communications
-
కొత్త ప్రైవసీ పాలసీని ఉపసంహరించుకోండి
న్యూఢిల్లీ: వివాదాస్పదంగా మారిన నూతన ప్రైవసీ విధానం–2021ను వెనక్కి తీసుకోవాలని వాట్సాప్ యాజమాన్యాన్ని కేంద్ర ఎలక్ట్రానిక్స్› అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) శాఖ ఆదేశించింది. ఈ మేరకు తాజాగా నోటీసు జారీ చేసింది. వాట్సాప్ ప్రైవసీ పాలసీలో చేసిన మార్పుల పట్ల ఐటీ శాఖ అభ్యంతరం వ్యక్తం చేసింది. సమాచార విధానంలోని పవిత్రమైన విలువలను, డేటా సెక్యూరిటీని, వినియోగదారుల ఎంపిక స్వేచ్ఛను దెబ్బతీసేలా ఈ నూతన పాలసీ ఉందని పేర్కొంది. కొత్త పాలసీని అమలు చేస్తున్న తీరుపై కూడా అభ్యంతరం వ్యక్తం చేసింది. భారత పౌరుల ప్రయోజనాలను, హక్కులను ఉల్లంఘించేలా కొత్త పాలసీ ఉందని తేల్చిచెప్పింది. నోటీసుపై ఏడు రోజుల్లోగా స్పందించాలని వాట్సాప్ యాజమాన్యానికి కేంద్ర ఐటీ శాఖ సూచించింది. సంతృప్తికరమైన సమాధానం రాకపోతే చట్టప్రకారం తగిన చర్యలు తప్పవని స్పష్టం చేసింది. సమస్యాత్మకం, బాధ్యతారాహిత్యం భారతదేశంలో ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టాలు, నిబంధనలను బేఖాతరు చేస్తూ కొత్త ప్రైవసీ పాలసీని ఎలా తీసుకొచ్చారని వాట్సాప్‌ను కేంద్రం నిలదీసింది. దేశ పౌరుల హక్కులను, ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత తమపై ఉన్న దృష్ట్యా.. భారత చట్టాల ప్రకారం వాట్సాప్‌పై చర్యలు తీసుకోవడానికి వీలున్న అన్ని అవకాశాలను పరిశీలిస్తామని తెలిపింది. ప్రైవసీ విధానం విషయంలో యూరప్ వినియోగదారులు, భారతీయ వినియోగదారుల మధ్య వివక్ష చూపడం ఏమిటని వాట్సాప్‌ను కేంద్రం ప్రశ్నించింది. నిత్య జీవితంలో ఎంతోమంది భారతీయులు సమాచార మార్పిడి కోసం వాట్సాప్‌పై ఆధారపడుతున్నారని గుర్తుచేసింది. దీన్ని అలుసుగా తీసుకొని భారతీయ వినియోగదారుల విషయంలో అనుచితమైన నియమ నిబంధనలు విధించడం సమస్యాత్మకమే కాదు బాధ్యతారాహిత్యం కూడా అని ఐటీ శాఖ ఉద్ఘాటించింది. యూరప్ వినియోగదారుల విషయంలో ఇలాంటి అనుచిత నియమ నిబంధనలు లేవని పేర్కొంది. నూతన ప్రైవసీ పాలసీ ప్రకారం.. భారతీయ వినియోగదారుల సమాచారాన్ని వాట్సాప్ యాజమాన్యం తమ మాతృసంస్థ ఫేస్‌బుక్‌కు చేరవేస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. దీనివల్ల వినియోగదారుల వ్యక్తిగత సమాచారం బహిరంగం కావడం తథ్యమన్న వాదనలు వినిపిస్తున్నాయి. కొత్త ప్రైవసీ పాలసీని ఆమోదించడానికి మే 15న గడువుగా విధించిన వాట్సాప్ తర్వాత దాన్ని వాయిదా వేసిన విషయం తెలిసిందే. అయితే తర్వాత మరో మెలిక పెట్టింది. పాలసీని ఆమోదించాల్సిందిగా కొన్నాళ్లపాటు రిమైండర్లు పంపుతామని... అప్పటికీ ఓకే చెప్పకపోతే సదరు వినియోగదారుడికి క్రమేపీ చాటింగ్, వాయిస్‌కాల్స్, వీడియో కాల్స్ సేవలను నిలిపివేస్తామని తమ వెబ్సైట్లో పేర్కొంది. అయితే దీనికి నిర్దిష్ట గడువేమీ చెప్పకపోవడం గమనార్హం. వాట్సాప్ కొత్త ప్రైవసీ విధానంపై ఢిల్లీ హైకోర్టులో విచారణ పెండింగ్‌లో ఉంది. -
తొలగనున్న గజిబిజి కేబుళ్లు
సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ అధికారులు అదుగో.. ఇదు గో అంటూ చాలాకాలంగా చెబుతోన్న కామన్ డక్టింగ్ కొద్దిరోజుల్లో అందుబాటులోకి వచ్చే అవకాశముంది. 4జీ బ్రాడ్‌బ్యాండ్ సేవల కోసం కేబుళ్ల ఏర్పాటుకు రోడ్డు కటింగ్‌కు అనుమతి ఇవ్వాలని రిలయెన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ అనుమతి కోరగా, సాధ్యాసాధ్యాలపై ప్రభుత్వం ఆలోచనలో పడింది. గ్రేటర్లో ఇప్పటికే అధ్వానంగా ఉన్న రహదారులతో నిత్యం ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తుతుండగా, రిలయెన్స్ కోరిన 1600 కిలోమీటర్ల మేర రోడ్ల కటింగ్‌కు అనుమతిస్తే.. పరిస్థితి దారుణంగా ఉంటుందని అంచనా వేసిన అధికారులు సా ధ్యం కాదని చెప్పినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో, 4జీ సర్వీసెస్ కోసం ఒక సంస్థ తర్వాత మరొకటి తమ కేబుళ్ల కోసం రోడ్లను తవ్వేం దుకు అవకాశమున్న అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్ల శాఖ డక్టింగ్‌కు సంబంధించి సాంకేతికాంశాలు, ఫీజబిలిటీ, అంచనా వ్య యం, డిజైన్ తదితర అంశాలపై తగు సూచనలు చేయాలని ఓ కమిటీని నియమించింది. కమిటీ చైర్మన్‌గా జీహెచ్ఎంసీ కమిషనర్ కృష్ణబాబు, మెంబర్ కన్వీనర్‌గా జీహెచ్ఎంసీ ఈఎన్సీ ధన్సింగ్, సభ్యులుగా వాటర్‌బోర్డు, హెచ్ఎంఆర్, ఆర్అండ్బీ, పబ్లిక్‌హెల్త్ విభాగాలకు చెందిన ఉన్నతాధికారులున్నారు. కమిటీ సమావేశమై తగిన ప్రతిపాదనల్ని అందజేయాలని ప్రభుత్వం సూచించడంతో.. సదరు కమిటీ శనివారం జీహెచ్ఎంసీలో సమావేశమై ఆయా అంశాలపై చర్చలు జరిపింది. ఆరేడు సంస్థలకు చెందిన కేబుళ్లును ఏర్పాటు చేసేందుకు వీలుగా నిర్మించాల్సిన డక్ట్లు ఎలాంటి స్పెసిఫికేషన్స్‌తో ఉండాలి.. కిలోమీటరు డక్ట్ ఏర్పాటుకు ఎంత వ్యయమవుతుంది తదితర అంశాలను చర్చించిన కమిటీ.. ప్రస్తుతానికి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిసింది. మలి సమావేశంలో ఓ కొలిక్కి వస్తుందని భావిస్తున్నారు. నగరంలోని అనేక ప్రాంతాల్లో మెట్రో రైలు పనులు జరుగుతున్నందున సదరు పనులు చేస్తున్న ఎల్ అండ్‌టీ సంస్థకే మెట్రోరైలు మార్గాల్లో డక్టింగ్ పనులు అప్పగించే అంశం కూడా చర్చకు వచ్చినట్లు తెలిసింది. డక్ట్ ఏర్పాట్లకు కి.మీ.కు దాదాపు రూ.25 లక్షల వరకు ఖర్చవుతుందని అంచనా. జీహెచ్ఎంసీ పరిధిలో అడ్డదిడ్డంగా వేళాడుతున్న కేబుళ్లకు చెక్ పెట్టేందుకు కామన్డక్ట్ ఏర్పాటు చేయాలనే అభిప్రాయం చాలా కాలంగా ఉంది. గతేడాది సీఓపీ సందర్భంగా ఎంపిక చేసిన మార్గాల్లోనైనా డక్టింగ్ ఏర్పాటుకు సిద్ధమైనప్పటికీ, అందుకయ్యే ఖర్చును భరించేందుకు కేబుల్ సంస్థలు వెనుకడుగు వేయడంతో ఆ పనులు నిలిచిపోయాయి. తాజా సమావేశంతో డక్టింగ్‌కు మార్గం సుగమం కాగలదని భావిస్తున్నారు. సమావేశంలో ఈఎన్సీ(పబ్లిక్‌హెల్త్) పాండురంగారావు, ఈఎన్సీ (వాటర్‌బోర్డు) సత్యనారాయణ, హెచ్ఎంఆర్ ప్రతినిధి జియాఉద్దీన్, ఆర్అండ్బీ నుంచి ఎస్ఈ చెన్నారెడ్డి పాల్గొన్నారు.