సిక్కా ఎఫెక్ట్: ఇన్పీ కో-ఫౌండర్స్ సంపద ఆవిరి
సాక్షి, ముంబై : ఇన్ఫోసిస్ కో-ఫౌండర్స్, విశాల్ సిక్కా దెబ్బ భారీగానే కొట్టింది. సిక్కా దెబ్బకు ఇన్ఫీ షేర్లు కుప్పకూలడంతో, కంపెనీ సహ-వ్యవస్థాపకులు తమ బిలీనియర్ ట్యాగ్ పోగొట్టుకున్నారు. గత రెండు రోజులుగా కంపెనీ షేర్లు నష్టాలు పాలవడంతో ఇన్ఫోసిస్ హై ప్రొఫైల్ ఫౌండర్ ఎన్ఆర్ నారాయణమూర్తి తన బిలీనియర్ స్టేటస్‌ను కోల్పోగా... గోపాలక్రిష్ణన్ కూడా ఆ ట్యాగ్‌ను వదులుకోవాల్సి వచ్చింది. సీఈవోగా సిక్కా రాజీనామా అనంతరం పతనమవడం ప్రారంభమైన ఇన్పీ షేర్లు, సోమవారం మార్కెట్ ట్రేడింగ్‌కు 14.5 శాతం క్రాష్ అయ్యాయి. దీంతో ఫౌండర్ ప్రమోటర్లు కూడా భారీగా తమ సంపదను కోల్పోయారు. మొత్త ఫౌండర్లు కంపెనీలో 12.74 శాతం వాటాను కలిగి ఉన్నారు. గత గురువారం 1,160 మిలియన్ డాలర్లు(రూ.7,437కోట్లకు పైన)గా ఉన్న గోపాలక్రిష్ణన్ షేర్లు సోమవారం సాయంత్రానికి 998 మిలియన్ డాలర్ల(రూ.6,398 కోట్లు)కు పడిపోయాయి.
ఇక నారాయణమూర్తి, ఆయన కుటుంబం రూ.1000 కోట్లకు పైగానే కోల్పోయింది. 800 మిలియన్ డాలర్ల(రూ.5,129కోట్లు)కు పైన ఉన్న నందన్ నిలేకని సంపద కూడా 750 మిలియన్ డాలర్ల(రూ.4,808కోట్లు) కిందకి దిగజారింది. అటు ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ కూడా రెండు రోజుల వ్యవధిలోనే రూ.34వేల కోట్లకు పైగా క్షీణించింది. మొత్తంగా ప్రమోటర్లు రూ.4,321 కోట్లను నష్టపోయారు. ఈ మొత్తం ప్రస్తుతం నందన్ నిలేకని కలిగి ఉన్న సంపదంతగా ఉంది. రూ.30వేల కోట్లగా ఉన్న ఫౌండర్ల షేర్లు, సోమవారం సాయంత్రానికి రూ.25,594 కోట్లకు వచ్చి చేరాయి. సిక్కా దెబ్బకు మూడేళ్ల కనిష్ట స్థాయిలకు పడిపోయిన ఇన్ఫీ షేర్లు, మంగళవారం మార్కెట్లో కోలుకున్నాయి. ప్రస్తుతం స్వల్పంగా 0.11శాతం లాభపడుతూ.. రూ.874.30 వద్ద ట్రేడవుతోంది.