ఇన్ఫోసిస్ ఉద్యోగి ఎలా గల్లంతయ్యారు?
న్యూఢిల్లీ: బెల్జియం రాజధాని బ్రస్సెల్స్ పేలుళ్లలో ఇన్ఫోసిస్ ఉద్యోగి రాఘవేంద్రన్ గణేశ్ మెట్రోలో ప్రయాణిస్తూ అదృశ్యమైనట్టు తెలుస్తోంది. ముందు అనుకున్నట్టుగా ఎయిర్ పోర్ట్ లో కాకుండా గణేశ్ మెట్రో ట్రైన్లో ప్రయాణిస్తూ గల్లంతు అయినట్లు తెలుస్తోంది. బెంగళూరుకు చెందిన గణేష్ పేలుళ్ల సమయంలో మెట్రో రైలులో ప్రయాణించారని భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ గురువారం ఉదయం ట్విట్ చేశారు.
అటు ముంబైకి చెందిన జెట్ఎయిర్ వేస్ మహిళా ఉద్యోగినులు నిధి, అమిత్, ఇద్దరు ఆసుపత్రిలో కోలుకుంటున్నారని సుష్మ తెలిపారు. ఇద్దరి క్షేమ సమాచారాన్ని మంజీవ్ పూరిని అడిగి తెలుసుకుంటున్నానన్నారు. అలాగే మంజీవ్ పూరి నాయకత్వంలోని భారత ఎంబసీ బృందం చేస్తున్న కృషిని ఆమె అభినందించారు.
రాఘవేంద్రన్ గణేశన్ గత నాలుగేళ్లుగా బ్రస్సెల్స్లో పనిచేస్తున్నారు. గణేష్ సోదరుడు ఇప్పటికే బ్రస్సెల్స్ చేరుకున్నారు. గణేష్ ఆచూకీని గుర్తించడంలో అక్కడి బెల్జియంలోని భారత దౌత్యకార్యాలయం అతనికి సహకరిస్తోంది. విమానాశ్రయంలో కంటే.. మెట్రో స్టేషన్ లో జరిగిన పేలుళ్ల తీవ్రత అధికంగా ఉండటంతో ప్రాణనష్టం కూడా అక్కడే ఎక్కువ జరిగింది. ఈ నేపథ్యంలో గణేష్ ఆచూకీ గల్లంతు కావడం ఆందోళన కలిగిస్తోంది. కాగా బ్రస్సెల్స్లో మంగళవారం ఎయిర్పోర్ట్లో, మెట్రో స్టేషన్ వద్ద జరిగిన ఆత్మాహుతి దాడుల్లో 31 మంది మృత్యువాత పడగా, మరో 200 మంది గాయపడిన సంగతి తెలిసిందే.
Raghavendran Ganesh - We have tracked his last call in Brussels. He was travelling in the metro rail. @SanjeevKandakur @IndEmbassyBru
— Sushma Swaraj (@SushmaSwaraj) March 24, 2016