ఇన్ఫీ ఇన్వెస్టర్లతో మూర్తి మీటింగ్ వాయిదా
సాక్షి, బెంగళూరు: ఇన్ఫోసిస్ ఇన్వెస్టర్లతో ఆ కంపెనీ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణమూర్తి నిర్వహించే మీటింగ్ వాయిదా పడింది. వచ్చే మంగళవారం ఈ సమావేశం జరిగే అవకాశమున్నట్టు తెలిసింది. సిక్కా రాజీనామా అనంతరం ఇన్వెస్టర్లతో మూర్తి నేడు(బుధవారం) సమావేశం కాబోతున్నట్టు వార్తలు వచ్చాయి. కంపెనీలో తదుపరి పరిణామాలపై వారికి భరోసా ఇచ్చేందుకు మూర్తి ఈ మీటింగ్ నిర్వహించబోతున్నట్టు తెలిసింది. కానీ ఈ మీటింగ్ నేడు జరుగడం లేదని సంబంధిత వర్గాలు చెప్పాయి. విశాల్ సిక్కా రాజీనామా అనంతరం గత వారం రోజులుగా జరిగిన పరిణామాలపై ఇన్ఫోసిస్ కంపెనీ పెద్ద షేర్ హోల్డర్స్‌లలో ఆందోళనలు చెలరేగాయి.
సిక్కా తన పదవి నుంచి తప్పుకుంటూ.. తాను వైదొలగడానికి ప్రధాన కారణం మూర్తినే అంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. సిక్కా ఆరోపణలపై మూర్తి కూడా ఘాటుగానే స్పందించారు. ఈ ఆరోపణలపై తగిన వేదికపై, తగిన సమయంలో స్పందిస్తానని కూడా మూర్తి చెప్పారు. సిక్కా దెబ్బకు కుదేలైన ఇన్పీ షేర్లతో, ఆ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.34వేల కోట్ల మేర తుడిచిపెట్టుకుపోయింది. మూర్తిపై నిందలుగుప్పిస్తూ బోర్డు రాసిన ఆరు పేజీల ప్రకటనను బహిర్గతం చేయాలని లార్జ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు, ప్రొక్సీ అడ్వయిజరీ సంస్థలు, బ్రోకరేజస్, టాప్ ఎగ్జిక్యూటివ్‌లు కోరుతున్నారు.