జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి
అక్రిడిటేషన్లు, హెల్త్‌కార్డులు ఇవ్వాలి
డబుల్ బెడ్రూం ఇళ్లు మంజూరు చేయాలి
వివిధ పార్టీల మద్దతు
కరీంనగర్ : జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూతెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం(టీయూడబ్ల్యూజే–ఐజేయూ) ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా, వంటావార్పు నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు తాడూరి కరుణాకర్ అధ్యక్షతన జరిగిన కార్యక్ర మంలో రాష్ట్ర అధ్యక్షుడు నగునూరి శేఖర్ మాట్లాడారు. తెలంగాణ ఆవశ్యకతను ప్రపంచానికి చాటిచెప్పిన జర్నలిస్టులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేయడం బాధకరమన్నారు. అక్రిడిటేషన్లు, హెల్త్‌కార్డులు, డబుల్ బెడ్రూం ఇళ్లు వెంటనే మంజూరు చేయాలన్నారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్ నీతూప్రసాద్‌కు సమర్పించారు. ఆందోళనకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి పి.సుగుణాకర్‌రావు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ పార్టీ ఎస్సీసెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఆరెపల్లి మోహన్, డీసీసీ అధ్యక్షుడు కటుకం మృత్యుంజయం, టీడీపీ జిల్లా అధ్యక్షుడు విజయరమణారావు, వైఎస్సార్ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి డాక్టర్ కె.నగేశ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొత్త శ్రీనివాస్‌రెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి కోమటిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి, సీపీఎం జిల్లా కార్యదర్శి గీట్ల ముకుందరెడ్డి, బీఎస్పీ జిల్లా నాయకుడు నిశాని రాంచంద్రం, మహిళ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గందె మాధవి, వైఎస్సార్ సీపీ మహిళ విభాగం జిల్లా అధ్యక్షురాలు బోగే పద్మ మద్దతు తెలిపారు.