నిర్బంధంలో థాయ్ ప్రధాని ఇంగ్లక్
బ్యాంకాక్: థాయ్లాండ్ ప్రధాని ఇంగ్లక్ షినవత్రాను సైనిక ప్రభుత్వం నిర్బంధంలోకి తీసుకుంది. గురువారం సైనిక చర్య అనంతరం తనను తాను ప్రధాని గా నియమించుకున్న సైన్యాధిపతి జనరల్ ప్రయూత్ చాన్ ఒచా(60).. ఇంగ్లక్ను శుక్రవారం సైనిక దళాల కార్యాలయానికి రమ్మని ఆదేశించారు. అక్కడ ఆమెతో పాటు ఆమె కుటుంబంలోని పలువురిని సైన్యం అదుపులోకి తీసుకుంది. అనంతరం ఆమెను గుర్తు తెలియని స్థావరానికి తరలించారు. ప్రయూత్ ఆదేశానుసారం.. ఇంగ్లక్ ప్రభుత్వంలోని ఇతర ముఖ్యులు, పలువురు నేతలు దాదాపు 150 మంది కూడా ఆయన ముందు హాజరయ్యారు.
అనంతరం కొందరు ముఖ్య అధికారులతో ప్రయూత్ సమావేశమయ్యారు. ఆర్థిక, రాజకీయ సంస్కరణలు దేశానికి అత్యవసరమని, వాటిని అమలు చేసిన తరువాతే ఎన్నికలు నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు. దేశంలో శాంతి నెలకొన్న తరవాత అధికారాన్ని మళ్లీ ప్రజలకు అప్పగిస్తామన్నారు. గత ప్రభుత్వ పథకం కారణంగా రుణభారంతో ఇబ్బంది పడుతున్న వరి రైతుల కోసం నిధులను కేటాయిస్తామని, మరో 15, 20 రోజుల్లో రైతులు ఆ డబ్బును అందుకుంటారని ప్రకటించారు.