దొంగల ముఠా అరెస్టు
నాగోలు: బస్సుల్లో.. వస్త్ర దుకాణాల్లో దృష్టి మళ్లించి చోరీలకు పాల్పడుతున్న ముఠాను ఎల్బీనగర్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం.. అంబర్పేటలో నివాసముంటున్న ఇంగుర్తి శ్రీను (27), ఇంగుర్తి విశ్వరూపాచారి (50), ఖమ్మం పట్టణానికి చెందిన నల్లగొండ కౌసల్య, నల్లగొండ ఈదమ్మలు ముఠాగా ఏర్పడి దృష్టి మళ్లించి బస్సులు, దుకాణాల్లో దొంగతనాలకు పాల్పడుతుంటారు.
ఈ క్రమంలో ఎల్బీనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో పలు దొంగతనాలకు పాల్పడ్డారు. ఎల్బీనగర్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న ముఠాను ఎల్బీనగర్ పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి నాలుగు తులాల బంగారు ఆభరణాలు, రూ. 20వేల నగదు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు.