'అగస్టా'తో ఎలాంటి ఒప్పందం జరగలేదు
న్యూఢిల్లీ: ఇటలీకి చెందిన అగస్టా వెస్ట్ ల్యాండ్ కంపెనీతో హెలికాప్టర్ల కోసం ఎటువంటి ఒప్పందం కుదుర్చుకోలేదని కేంద్ర ప్రభుత్వం శనివారం ప్రకటించింది. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే 2015 ఏప్రిల్ లో నరేంద్రమోదీ ప్రభుత్వం 100 నావల్ హెలికాప్టర్ల కొనుగోలు చేయడానికి అనుమతించిందని ప్రతిపక్షం ఆరోపిస్తోందని తాజాగా విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.
అసలు హెలికాప్టర్ల కొనుగోలుకు కేంద్రం ఎలాంటి చర్యలు చేపట్టకుండా అగస్టాను బిడ్ కోసం ఎలా పిలుస్తుందని.. మేక్ ఇన్ ఇండియా ద్వారా భారత్ లో ఆ హెలికాప్టర్ల తయారీ కోసం ప్రభుత్వం చూస్తోందని తెలిపింది. నావెల్ అవసరాల కోసం కొనుగోలు చేయాలనుకున్న హెలికాప్టర్ల కోసం 2012 ఆగష్టు 4న టెక్నో కమర్షియల్ రిక్వెస్ట్ ప్రపొజల్ (ఆర్ఎఫ్ పీ) ఎనిమిది సంస్థలకు బిడ్ అవకాశన్ని ఇచ్చిందని వివరించింది.
అందుకు సమాధానంగా యూరోకాప్టర్స్, అగస్టా వెస్ట్ ల్యాండ్ కంపెనీలు 2013 మార్చి 4 వాటి ప్రపోజల్స్ ను అందజేశాయంది. 2014 అక్టోబర్ 13న ఆర్ఎఫ్ పీ వాటిని పరిశీలనలోకి తీసుకుందని కేంద్రం తెలిపింది. కాగా ఓ కుంభకోణంలో ఉన్న కంపెనీను మేక్ ఇన్ ఇండియాలో కేంద్ర ప్రభుత్వం ఎందుకు భాగస్వామ్యం చేయదలుచకుందో చెప్పాలని ప్రతిపక్ష కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.
కేసులో నిజానిజాలను వెలికితీయడానికి అవసరమైన చర్యలు చేపట్టామని చాపర్ కేసులో దోషులకు శిక్ష విధిస్తామని కేంద్రం ఈ సందర్భంగా తెలిపింది. సీబీఐ, ఈడీలు కేసులో అన్ని విషయాలను క్షుణ్ణంగా విచారిస్తున్నాయి. ఈ కేసులో ఇప్పటివరకు నిందితులుగా ఉన్న ముగ్గురు విదేశీయులు కార్లో జెరోసా, రాల్ఫ్, క్రిస్టియన్ మైఖేల్ జేమ్స్ ల అరెస్టుకు రంగం సిద్ధం చేసినట్లు వివరించింది.
సీబీఐ ఇప్పటివరకు ఈ కేసులో 100 మందిని విచారించిందని కొంతమంది నిందితుల ఆస్తులపై అధికారాలను సీబీఐ 2014లోనే తాత్కలికంగా నిలిపివేసినట్లు తెలిపింది. విదేశాల్లో విచారణ కోసం సీబీఐ, ఈడీలు ఇప్పటికే స్విట్జర్లాండ్, మారిషస్, ఇటలీ, బ్రిటన్, సింగపూర్, వర్జీనియా, యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్, టునీషియా తదితర దేశాలకు లేఖలు పంపినట్లు కేంద్రం వివరించింది.